ధాన్యం దళారులపై కొరడా


Mon,December 2, 2019 12:58 AM

-క్రిమినల్‌ కేసులు పెడుతున్న అధికారులు
-జేసీ ఆదేశాలతో గన్నేరువరం పోలీసులకు డీఎం ఫిర్యాదు
-ఐదుగురు దళారులపై చీటింగ్‌ కేసు నమోదు
-దర్యాప్తులో వెలుగులోకి రానున్న మరిన్ని అక్రమాలు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):ధాన్యం దళారులపై జిల్లా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. క్రిమినల్‌ చర్యలకు దిగుతున్నారు. జేసీ శ్యాంప్రసాద్‌ లాల్‌ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రైతులను మోసం చేసి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను కాజేసిన ఐదుగురు దళారులపై ఆదివారం గన్నేరువరం పోలీసులకు స్వయంగా సీఎస్‌సీ జిల్లా మేనేజర్‌ ఎం శ్రీకాంత్‌ ఫిర్యాదు చేశారు. ఈ మండలంలోని చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆధారం చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లు ఐదుగురు దళారులు, తిమ్మాపూర్‌ మండలంలోని ఒక రైసు మిల్లుపై ఫిర్యాదు చేయడంతో గన్నేరువరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైతుల ఫిర్యాదు ఆధారంగా..
గత యాసంగి సీజన్‌లో తమ వద్ద తక్కువ ధరకు ధాన్యం కొని చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధరకు విక్రయించి తమను మోసం చేశారని కొందరు దళారులపై గన్నేరువరం మండలం హన్మాజీపల్లి, గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు శనివారం జేసీ శ్యాంప్రసాద్‌ లాల్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేక పోవడంతో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ ఎం శ్రీకాంత్‌కు ఫిర్యాదును అందజేశారు. హన్మాజీపల్లికి చెందిన ఆర్‌ లక్ష్మారెడ్డి తన ధాన్యాన్ని తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలోని ఓ రైస్‌ మిల్లుకు విక్రయించగా సదరు ధాన్యాన్ని గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. దీంతో లక్ష్మారెడ్డి తాను చొక్కారావుపల్లిలో ఎలాంటి ధాన్యం విక్రయించ లేదనీ, దీనిపై విచారణ జరపాలని డీఎంకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన బోయిని మల్లేశం తన ధాన్యాన్ని జంగపల్లికి చెందిన అశోక్‌ అనే దళారికి, లెంకల లక్ష్మారెడ్డి అనే రైతు జంగపల్లికి చెందిన శ్రీను అనే మరో దళారికి, గునుకుల కొండాపూర్‌కు చెందిన కొర్వి పోచయ్య, కొర్వి చంద్రయ్య, లింగంపల్లి అనసూయ, అనుమండ్ల రాజవీరు, గుండ్లపల్లికి చెందిన బోయిని బాలయ్య అనే రైతులు బూట్ల దేవదాసు అనే దళారికి, గునుకుల కొండాపూర్‌కు చెందిన సుదగోని కనుకయ్య, ముదిగంటి సంజీవరెడ్డి, వంగల భాస్కర్‌రెడ్డి, లెంకల కిషన్‌రెడ్డి నాగపురి శంకర్‌ అనే మరో దళారికి తక్కువ ధరకు విక్రయించామని, అదే ధాన్యాన్ని చొక్కారావుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధరకు విక్రయించి తమ పేర్లపై ఎక్కువ వచ్చిన మొత్తాన్ని కాజేసినట్లు సీఎస్‌సీ డీఎంకు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు.

విచారణతో వెలుగులోకి..
గత రబీ సీజన్‌లో చొక్కారావుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అక్రమాలు జరిగాయని ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో గన్నేరువరం జడ్పీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల సమావేశంలోనే ఉన్న జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ను ఆదేశించారు. దీంతో చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన 147 మంది రైతుల జాబితాను సేకరించిన అధికారులు ఒక్కో రైతును విచారిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మాజీపల్లి, గునుకుల కొండాపూర్‌, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులను అధికారులు విచారించగా ఆశ్చర్య పోవడం వారి వంతైంది. దీంతో తాము అసలు చొక్కారావుపల్లిలో ఎలాంటి ధాన్యం విక్రయించ లేదని పేర్కొంటూ దీనిపై విచారణ జరిపించాలని సీఎస్‌సీ డీఎంకు చేసిన ఫిర్యాదులో కోరారు.

తక్షణం స్పందించిన జేసీ
చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రంపై విచారణ జరుగుతుండగానే రైతులు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన 70 మంది మాత్రమే ఇక్కడ ధాన్యం విక్రయించారనీ, మిగతా రైతులు ఇతర గ్రామాలకు చెందిన వారేనని జడ్పీ సమావేశంలోనే గన్నేరువరం జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తెచ్చారు. మండలానికే చెందిన కొందరు దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ఎక్కువ ధరకు విక్రయించడం, రైతులకు తక్కువ ధరతో చెల్లింపులు జరిపి మిగతా మొత్తాన్ని కాజేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో రైతు నుంచి రూ.వేల మొత్తంలో కాజేసిన సొమ్ము రూ.లక్షల్లో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను మోసం చేసిన దళారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు జేసీ సిద్ధమయ్యారు. ఆయన ఆదేశాల మేరకు గన్నేరువరం పోలీసులకు సీఎస్‌సీ డీఎంకు ఫిర్యాదు చేశారు.

ఐదుగురిపై చీటింగ్‌ కేసు
రైతులను మోసం చేసి కనీస మద్దతు ధర కాసేసిన ఐదుగురు ధాన్యం దళారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌సీ డీఎం శ్రీకాంత్‌ చేసిన ఫిర్యాదు మేరకు జంగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, అశోక్‌, కొండాపూర్‌కు చెందిన బూట్ల దేవదాస్‌, నాగపురి శంకర్‌, చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బుర్ర శ్రీనివాస్‌తోపాటు ఓ రైస్‌ మిల్లుపై ఛీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్‌ఐ ఆవుల తిరుపతి తెలిపారు. డీఎం ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఈ దర్యాప్తులో దోషులని తేలిన వారిపైనా మరిన్ని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, నవాబుపేటకు చెందిన బుర్ర శ్రీనివాస్‌ గతంలో చొక్కారావుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించినట్లు తెలుస్తోంది. చిగురుమామిడి తాసిల్దార్‌ ఇచ్చిన నివేదిక ప్రకారంగా అతని స్వగ్రామం నవాబుపేటలో ఎలాంటి భూమి లేదనీ, అయితే ఇతరుల వద్ద భూమిని లీజ్‌కు తీసుకుని రెండెకరాల్లో వరి సాగు చేసినట్లు, ఇందులో వచ్చిన 104.80 క్వింటాళ్ల ధాన్యాన్ని చొక్కారావుపల్లి కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. డీఎం శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు బుర్ర శ్రీనివాస్‌పైనా ఛీటింగ్‌ కేసు నమోదైంది.

76

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles