ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి


Sat,November 16, 2019 01:39 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల వ్యాపారుల నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ, ఏడీఏ కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన ఎరువులు, విత్తనాల వ్యాపారి నగునూరి లక్ష్మణ్ పెద్దపల్లిలో మహాదేవ సీడ్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సమర్పించి చలానా కట్టి, లైసెన్స్ కోసం ఏడీఏ కృష్ణారెడ్డిని కలిశాడు. విత్తనాల దుకాణం లైసెన్స్‌కు రూ.వెయ్యి చలానాతోపాటు మరో రూ.15వేలు, ఎరువుల దుకాణం లైసెన్స్ కోసం రూ.2,500 చలానాతోపాటు రూ.15వేలు లంచం ఇవ్వాలని ఏడీఏ కృష్ణారెడ్డి డిమాండ్ చేశాడు. చివరికి రూ.10వేలకు బేరం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని లక్ష్మణ్, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో కృష్ణారెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పల పన్నిన ఏసీబీ అధికారులు, లక్ష్మణ్‌కు రూ.10వేల విలువైన రూ.500 నోట్లను అందించి, వాటిని ఏడీఏకు ఇవ్వాలని సూచించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యాపారి లక్ష్మణ్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు దాడిచేసి ఏడీఏ కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఈ దాడుల్లో డీఎస్పీ భద్రయ్యతోపాటు సీఐలు వేణుగోపాల్, రాము, రవీందర్, సంజీవ్, సిబ్బంది ఉన్నారు.


నేడు ఏసీబీ కోర్టులో హాజరు..
పెద్దపల్లి ఏడీఏ కార్యాలయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏడీఏ కృష్ణారెడ్డిని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో శనివారం హాజరు పరచనున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు. కృష్ణారెడ్డిపై ఇప్పటికే ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయంలోని ఫైళ్లను, వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. జిల్లాలో ఎక్కడా.. ఏ అధికారి లంచాల కోసం డిమాండ్ చేసినా తమను ఆశ్రయించాలని, ఏసీబీ తప్పకుండా బాధితులకు అండగా నిలుస్తుందని డీఎస్పీ భరోసా ఇచ్చారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని ఏసీబీ అందిస్తూ, అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏ శాఖలోనైనా అధికారులు అవినీతికి పాల్పడినా, లంచాల కోసం డిమాండ్ చేసినా 94404 46166, 94906 11025, 94408 08101, 94404 46139కు ఫోన్ చేసి తమకు నేరుగా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles