పౌర్ణమికి భారీ బందోబస్తు


Tue,November 12, 2019 03:03 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురి క్షేత్రంలో మంగళవారం అత్యంత వైభవంగా జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. సోమవారం ధర్మపురి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేడుకల్లో డీఎస్పీతో పాటు, ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు సహా 18 మంది ఏఎస్‌ఐలు, 32 మంది పోలీస్‌కానిస్టేబుళ్లు, 12 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 48 మంది హోంగార్డులు, 26 మంది మహిళా హోంగార్డులను నియమించామన్నారు. అలాగే వీఐపీల కోసం రోడ్ ఓపెన్ పార్టీ పోలీసులను కూడా నియమించామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నంది చౌక్ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నామన్నారు.


ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు నంది చౌక్ వద్దనే వాహనాలు దిగి కాలినడకన గోదావరి నదికి, దేవాలయానికి వెళ్లాలని సూచించారు. వాహనాల కోసం సోమవిహార్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు బంగారు ఆభరణాలు ఎక్కువగా వేసుకొని రావొద్దని కోరారు. భక్తుల రద్దీలో పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందనీ, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అలాగే గోదావరిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయపట్నం వద్దకూడా బందోబస్తు ఏర్పాట్లు చేశామనీ, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐలు శ్రీకాంత్, చిరంజీవి ఉన్నారు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles