పుర పోరుకు సిద్ధం


Wed,November 6, 2019 01:47 AM

- ఏర్పాట్లు చేసిన అధికారయంత్రాంగం
జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. గతంలోనే సిబ్బందికి శిక్షణ ఇవ్వగా నోటిఫికేషన్‌ రావడమే తరువాయి.. ఎలక్షన్లు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇక మున్సిపల్‌ ఎన్నికలు అప్పుడు ఇప్పుడంటూ లెక్కలు వేసుకుంటున్న వివిధ పార్టీల ఆశావహులు అప్పుడే తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోటీకి ఏర్పాట్లు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. మున్సిపల్‌ పాలకవర్గాల గడువు జూలై 2తోనే ముగిసిపోగా, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమై, దాదాపుగా ఏర్పాట్లను పూర్తి చేసింది. ఓటర్ల జాబితా నుంచి మొదలు కొని పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లును సైతం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో మున్సిపల్‌ ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా ఇటీవలే హైకోర్టు ధర్మాసనం మున్సిపాలిటీలపై దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలకు దాదాపు లైన్‌ క్లియరైంది. సింగిల్‌ జడ్జి వద్ద మున్సిపాలిటీల నుంచి దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండడంతో సింగిల్‌ జడ్జి తీర్పు కోసం ఎదిరు చూస్తున్నారు. ధర్మాసనం కేసులను కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వీ నాగిరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్‌ ఆదేశాల నేపథ్యంలో ఈనెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.


ఐదు మున్సిపాలిటీలు.. 134వార్డులు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 134వార్డులు ఉన్నాయి. గతం లో మూడు మున్సిపాలిటీలే ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఆగస్టులో ప్రభుత్వం జిల్లాలో కొత్తగా రెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజవర్గంలోని రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలుగా అవతరించాయి. దీంతొ గతంలో ఉన్న జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలతో కలిపి మొత్తం ఐదు బల్దియాలు ఏర్పడ్డాయి. వీటిలో వార్డుల విభజన పూర్తి చేయడంతో పాటు పోలింగ్‌ కేంద్రాల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో 38వార్డులుండగా, ప్రస్తుతం గోవిందుపల్లె, శంకులపల్లి, తారక రామానగర్‌, ధరూర్‌, లింగంపేట, తిమ్మాపూర్‌ గ్రామాల్లోని కొన్ని సర్వేనంబర్లలో విస్తరించి ఉన్న గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో పట్టణంలో 48 వార్డులు ఏర్పడ్డాయి. పది వార్డులు ఒకేసారి పెరగడంతో పట్టణ పరిధి కూడా పెరిగింది. 2011జనాభా లెక్కల ప్రకారం 48 వార్డుల పరిధిలో 80,325మంది ఓటర్లున్నారు. వీరి కోసం 117పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జిల్లాలో రెండో పెద్ద మున్సిపాలిటీగా పేరుగాంచిన కోరుట్లలో ఎకీన్‌పూర్‌ను విలీనం చేశారు. గతంలో 31వార్డులుండగా ఇప్పుడు 33వార్డులకు పట్టణం పెరిగింది. ఇక్కడ 53,868మంది ఓటర్లుండగా 71పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్‌పెల్లి బల్దియాలో వెంకట్రావుపేట, ఆరపేటను విలీనం చేశారు. దీంతో 24వార్డులున్న మున్సిపాలిటీ, 26వార్డులకు పెరిగింది. మెట్‌పల్లి పట్టణ పరిధిలో 40,464మంది ఓటర్లుండగా 56పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త మున్సిపాలిటీగా అవతరించిన ధర్మపురిని ముందు 9వార్డులుగా విభజించిన అధికారులు, తర్వాత పునర్విభజన చేశారు. దీంతో ఆరు వార్డులు పెరిగి, 15 వార్డులకు పట్టణం చేరుకుంది. ధర్మపురిలో 12,374మంది ఓటర్లుండగా 15పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రాయికల్‌ మున్సిపాలిటీలో 9వార్డులుగా గుర్తించిన అధికారులు తర్వాత 12వార్డులకు పెంచారు. 11,880మంది ఓటర్లుండగా 24పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లాలో పుర ఓటర్లు 1,98,911 మంది
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 1,98,911 మంది ఓటర్లున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ఓటర్ల జాబితాను అధికారులు గతంలోనే సి ద్ధం చేశారు. ఇటీవలి కాలంలో మరికొంత మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. మొత్తంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 134 వార్డుల్లో, 1,98,911 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 283 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ
మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ స్థానంతో పాటు, వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఆశిస్తున్న వారితో పాటు, వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారు సైతం రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠతో ఎదిరు చూస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ గతంలో వరుసగా జనరల్‌, జనరల్‌ మహిళ కేటగిరీలకు రిజర్వు కావడం, పట్టణంలో బీసీల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ సారి బీసీ జనరల్‌, లేదా బీసీ మహిళకు రిజర్వయ్యే అవకాశముందనే చర్చ ఓ వైపు జరుగుతుండగా, గతంలో సమైక్య రాష్ట్రంలోని మున్సిపాలిటీల సంఖ్య, రాష్ట్రం బేస్‌పై రిజర్వేషన్లు చేశారనీ, తెలంగాణ ఏర్పాటుతో కొత్తగా రిజర్వేషన్‌ ప్రక్రియ ఆరంభమవుతున్న నేపథ్యంలో జనరల్‌ కేటగిరీకే జగిత్యాల వస్తుందనే వాదన సైతం వినిపిస్తున్నారు. ఇక కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలోనూ చైర్మన్‌ స్థానం రిజర్వేషన్‌పై నాయకులు ఆసక్తిగా చూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీలు బీసీ రిజర్వు అవుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వార్డు స్థానాల రిజర్వేషన్ల విషయంలోనూ ఉత్కంఠే నెలకొంది.

ముఖ్యనేతల ప్రసన్నం కోసం ప్రయత్నాలు
పుర పోరులో నిలిచేందుకు సిద్ధమవుతున్న నాయకులంతా, పార్టీల ముఖ్యనేతల ప్రసన్నం కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నవారంతా కీలక నాయకుల వద్దకు వెళ్లి తమ అర్హతలను విన్నవించుకుంటూ, అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు కనిపిస్తుండడంతో, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లోనే పోటీ తీవ్రమైంది. ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానంతో పాటు, వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు ఇప్పటికే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక జగిత్యాల, రాయికల్‌ మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కలిశారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు చెందిన ఔత్సాహికులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును కలిసి తమ ఆసక్తిని తెలియజేశారు. ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు సైతం ఆయా పార్టీల కీలక నేతలైన జీవన్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌, ముదుగంటి రవీందర్‌రెడ్డి తదితరులను కలుస్తున్నారు.

సరంజామాను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు
ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్నవారు తమ సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారు తాము నిలబడాలనుకుంటున్న వార్డులో ఓటర్ల జాబితాను సరి చూసుకుంటున్నారు. మెజార్టీ కులాల ఓటర్ల సంఖ్యను విశ్లేషించుకుంటున్నారు. వార్డులో ప్రభావం చూపే పెద్ద మనుషుల జాబితాను రూపొందించుకుంటున్నారు. కుల సంఘాల ప్రభావం ఎంత ఉంటుందన్న విషయాన్ని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో వార్డుల్లోని ఓటర్లను కలిసి అభ్యర్థించడంతో పాటు, కీలకమైన నాయకులు, వార్డు ప్రముఖులతో మంతనాలు మొదలు పెట్టారు. మొన్నటి వరకు ఉదయం పలకరింపులు, సాయంత్రం విన్నపాలు చేపట్టిన ఔత్సాహికులు, ప్రస్తుతం రాత్రి పూట మంతనాలకు తెరలేపారు. ఇక చైర్‌ పర్సన్‌ పదవిని ఆశిస్తున్న నాయకులు ఏ వార్డులో ఏ అభ్యర్థి అయితే తమకు అనకూలంగా ఉంటారన్న విషయాలను అంచనా వేయడంలో మునిగిపోయారు. పట్టణంలో ఏఏ వార్డులో ఎవరు కీలకమైన వ్యక్తులు అన్న పరిశీలన చేస్తున్నారు. వీటితో పాటు ఎన్నికల ప్రచారానికి కావాల్సిన అన్ని రకాల సరంజామాను, ఆర్థిక, అంగబలాన్ని సమకూర్చుకునే యత్నంలో మునిగిపోయారు.

వ్యూహ రచనల్లో ప్రధాన నేతలు
పుర పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పార్టీల ప్రధాన నాయకులు మున్సిపాలిటీలపై తమ జెండాను ఎగరవేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. జగిత్యాల, రాయికల్‌ మున్సిపాలిటీల్లో విజయం కోసం డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్ని చర్యలూ చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన పట్టణంలోని అన్ని వార్డుల నాయకులు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేశారు. ఇక ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వ్యూహ రచన సాగిస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles