విలీన గ్రామాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్


Sat,November 2, 2019 01:45 AM

-అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
-గతేడాది మార్చి30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లకు చాన్స్
-మొదలైన దరఖాస్తుల స్వీకరణ
-మూడు నెలల దాకా గడువు
-మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం
-అనుమతులకు తొలగనున్న ఇబ్బందులు


(జగిత్యాల/మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ)నగరపాలక, మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమైన గ్రామాల్లోనూ అనుమతి లేని లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన 73 బల్దియాల్లో గత నెల 15 నుంచే అమలు చేస్తుండగా, తాజాగా విలీన గ్రామాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం)ను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతేడాది 2018 మార్చి 30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లతోపాటు సేల్‌డీడ్ అయిన భూములను క్రమబద్ధీకరించుకునే చాన్స్ ఉన్నది. గత నెల 29 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. మూడు నెలల వరకు కొనసాగనున్నది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాలకు అవకాశముండగా, ఆయా బల్దియాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆయా నిబంధనల మేరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తులు చేసుకునే వారికి బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్, లే అవుట్ సెక్యూరిటీ, జరిమానాలను కలిపి ఫీజును నిర్ణయిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, లొకేషన్ ప్లాన్, సెక్యూరిటీ బాండ్, ఎన్‌ఓసీని జత చేసి ఆయా మున్సిపాలిటీల్లో అమలు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల ఫీజులు ఇలా..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు అన్ని చార్జీలతో పాటు, జరిమానా కలిపి ఫీజును నిర్ణయిస్తారు. సాధారణ క్రమబద్ధీరణ ఫీజుల కింద 100 లోపు చదరపు మీటర్ల భూమికి చదరపు మీటర్‌కు 200 చొప్పున, 101 నుంచి 300లో వాటికి 400 చొప్పున, 301 నుంచి 500లోపు వాటికి 600 చొప్పున, 500 చదరపు మీటర్లకు పైగా ఉన్న భూములకు 750 చొప్పున, మురికివాడల్లో ఎంత చదరపు మీటర్లలో ఉన్నా 5 ఫీజు వసూలు చేయనున్నారు. వీటితో పాటు క్రమబద్ధీకరణ చార్జీలను ఆయా ప్రాంతాల్లోని భూమి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను ఆధారంగా ఫీజుల శాతాన్ని విధించి వసూలు చేస్తారు. దీనిలో స్క్వేర్ యార్డుకు 3వేలలోపు మార్కెట్ విలువ ఉన్న వాటికి 20 శాతం చొప్పున, 3001 నుంచి 5వేల లోపు ఉన్న వాటికి 30 శాతం, 5001 నుంచి 10వేల లోపు వాటికి 40 శాతం, 10 వేల నుంచి 20 వేల లోపు వాటికి 50 శాతం, 20 వేల నుంచి 30 వేల లోపు వాటికి 60 శాతం, 30 వేల నుంచి 50 వేల లోపు ఉన్న వాటికి 80 శాతం, 50 వేలకు పైగా మార్కెట్ విలువ ఉన్న వాటికి 100 శాతం ఫీజులు విధిస్తారు.

భారీగా ఆదాయం..
ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఎల్‌ఆర్‌ఎస్ వల్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. జగిత్యాల మున్సిపాలిటీలో 4 గ్రామాలు, 3 గ్రామాలు పాక్షికంగా, కోరుట్లలో ఒకటి, మెట్‌పల్లిలో రెండు గ్రామాలు విలీనమయ్యాయి. శివారులో ఉన్న ఈ గ్రామాల్లో ఇటీవల కాలంలో నిర్మాణ రంగం జోరుగా సాగుతున్నది. కొంతకాలంగా ఆయా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకున్నది. పెద్ద సంఖ్యలో ప్లాట్లు కూడా చేపట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వడంతో భవన నిర్మాణాలు భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అవకాశం మేరకు మరింత ఎక్కువ ఆదాయం రాబట్టే దిశగా అధికారులు సమాలోచన సాగిస్తున్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles