నమ్మించి నట్టేట


Wed,October 23, 2019 01:58 AM

జగిత్యాల క్రైం : ‘లాటరీలో మీ ఫోన్‌ నంబర్‌కు రూ.4కోట్ల లాటరీ తగిలింది. నగదుగా మార్చుకోవాలంటే కొంత మొత్తం ట్యాక్స్‌ చెల్లించాలి” అంటూ ఆశపుట్టించారు. నిజమేనని నమ్మిన దంపతులు మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో అక్షరాలా రూ.15లక్షలు జమచేసి చివరికి మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ సోమవారం జగిత్యాల పోలీసులను ఆశ్రయించారు. జగిత్యాల టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన సుతారికారి రాజశేఖర్‌-జమున దంపతులు జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్‌లో ఉంటున్నారు. కాగా ‘రేంజ్‌ రోవర్‌ ఆటోమొబైల్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. నా పేరు డెస్నాండ్‌ డేనియల్‌.. మీ ఫోన్‌ నంబరుకు రూ. 4 కోట్ల లాటరీ తగిలింది” అంటూ 8506894207 నంబరు నుంచి రాజశేఖర్‌కు కాల్‌ రాగా, అతడి భార్య జమున మాట్లాడింది. లాటరీ మొత్తం నాలుగు కోట్లను నగదుగా మార్చుకోవాలంటే కంపెనీకి కొంత మేర ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో జమున నమ్మింది. ఫోన్‌లో వ్యక్తి చెప్పిన ప్రకారం రాజశేఖర్‌ దంపతులు 16 బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా రూ. 15,42,670ను జమచేశారు.


మరి కొంత మొత్తం బ్యాంకులో జమచేయాలని కంపెనీ వ్యక్తులు చెప్పడంతో అనుమానం వచ్చి లాటరీ డబ్బు కోసం పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఎదుటి వ్యక్తులు ఫోన్లు లేపకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం జగిత్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ వారు చెప్పిన విషయాలు నిజమని నమ్మి స్నేహితులు, బంధువుల నుంచి అప్పు తెచ్చి వారి ఖాతాల్లో వేశామనీ, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వాపోయారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles