సీజనల్ వ్యాధులపై సమరం


Mon,October 21, 2019 01:01 AM

-రెండు నెలల్లో జిల్లాలో 600కు పైగా వైద్య శిబిరాల నిర్వహణ
-ఒక్కో మండలంలో 10 నుంచి 15క్యాంపులు
-వేలాది మందికి పరీక్షలు, మందుల పంపిణీ
-రోగాల నివారణకు ముందస్తు చర్యలు
-పరిసరాల పరిశుభతపైనా ప్రజలకు అవగాహన


సారంగాపూర్/పెగడపల్లి : జిల్లాలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. గ్రామ గ్రామానా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పరీక్షలు చేస్తూ అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నది. ఇటు పరిసరాలు పరిశుభ్రతపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోగాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది. వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు డయేరియా, మలేరియా, డెంగ్యూ, మెదడు వాపు, చికెన్ గున్యా, ఇతర విష జ్వరాలు ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండు, మూడు నెలలుగా తీవ్ర కృషి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని క్షేత్ర స్థాయిలో సూచిస్తున్నారు. జిల్లా ఉప వైద్యాధికారి ముస్కు జయ్‌పాల్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 3నెలల్లో ప్రతి మండలంలో 10 నుంచి 15 క్యాంపులు నిర్వహిస్త్తూ అందుబాటులో ఉన్న మందులను సైతం అవసరమున్నవారికి పంపిణీ చేస్తున్నారు.

మూడు నెలల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లో సుమారు 600 వరకు వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకావాలనీ, నీటిని నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆహార ప్రదార్థాలపై తప్పని సరిగా మూతలు పెట్టుకోవాలనీ, దోమ కాటుకు గురి కాకుండా చూసుకోవాలనీ, చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఏడిస్ దోమ కృత్రిమం గా నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడమే కాకుండా అక్కడే పెరుగుతుందనీ, ఇంటి పరిసరాల్లో సీసా లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పూల కుండీ ల్లో నీరు నిల్వ ఉండకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ అవగాహన కలిస్తున్నారు.

పెగడపల్లి మండలంలో 1026మందికి వైద్య పరీక్షలు
పెగడపల్లి మండలంలో అక్టోబర్‌లో ఇప్పటి వరకు నర్సింహునిపేట, మ్యాకవెంకయ్యపల్లి, దోమలకుంట, నందగిరి, ఏడుమోటలపల్లి, లింగాపూర్, వెంగళాయిపేటలో వైద్య శిబిరాలు నిర్వహించి, 1026 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేసినట్లు మండల వైద్య, ఆరోగ్య అధికారి సుధాకర్ తెలిపారు. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు చికిత్సలు నిర్వహించడంతో పాటు దీర్ఘ కాలిక వ్యాధులనై బీపీ, షుగర్, టీబీ, డయేరియా, కీళ్ల నొప్పులు తదితర వ్యాధులకు చికిత్సలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గర్భిణులకు సైతం వైద్య పరీక్షలు చేయడంతో పాటు, జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహించడం, మలేరియా సోకిన వారి రక్త నమూనాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

62

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles