సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి


Mon,October 21, 2019 12:59 AM

జగిత్యాల టౌన్ : రైతులు సేంద్రియ సాగు విధానంపై దృష్టి పెట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం పొలాస ప్రాంతీయ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఆరవ రోజు గంగాధర మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కిసాన్‌మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు సూచనలు రైతులు పాటించాలని సూచించారు. వ్యవసాయ విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.శ్రీధర్ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వెన్నం టి ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. విద్యార్థులు వ్యవసాయ విద్యలో అద్భుతాలు సృష్టించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తరగతి గదిలో చదువుకున్న పాఠాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించాలన్నారు. రైతుల కష్టాలు, వారు ఎదుర్కొనే సమస్యలపై అధ్యయ నం చేయాలన్నారు.


వ్యవసాయ కళాశాల డీన్ డా క్టర్ కే బీ సునీతాదేవి మాట్లాడుతూ వ్యవసాయ విద్యలో విద్యార్థులు చివరి సంవత్సరంలో క్షేత్ర స్థాయిలో పంటలు పండించడం, గ్రామాల్లో రైతులతో మమేకమవుతూ సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు. అదేవిధంగా వ్యవసాయ విద్యార్థులు పట్టు పురుగుల పెంపకం, వర్మి కంపో స్టు, పాలీహౌస్ సాగు విధానంపై శిక్షణ పొందుతున్నారన్నారు. చదువు పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా తయారు కావాలన్నారు. ఏటీఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమనీ, ప్రతి రైతు శాస్త్ర పద్ధతిలో పంటలు పండించాలన్నారు. కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కె.మధన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ కె.శేఖర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతుకు సమాచారం అందించే మాసపత్రికలు, మొబైల్ యాప్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని రకాల సమాచార కేంద్రాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు వరి పంటలో ఆరుతడి పద్ధతి ద్వారా పంట పండించడం, తడి, పొడి పద్ధతులను పాటించడం వల్ల రైతులు నీటిని ఆదా చేసుకొని ఎక్కువ దిగుబడులు పొందవచ్చన్నారు.

పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్ రైతులకు పంటల్లో వచ్చే సమస్యలు, రబీ పంటకు అనువైన నూతన వంగడాలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త ఓంప్రకాష్ పంటల్లో వచ్చే చీడపీడలు, వాటి నివారణ చర్యలపై వివరించారు. కళాశాల వ్యవసాయ విద్యార్థులు విషపు ఎరలు, సమగ్ర వ్యవసాయ విధానం, పాలీహౌస్, పట్టు పురుగుల పెంపకం, వాటర్‌షెడ్, వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు, విత్తనశుద్ధి విధానం, లింగాకర్షణ బుట్టలు, పత్తి పంటలో బొట్టుపెట్టే విధానం, శ్రీవరి సాగు నమూనాలతో రైతులకు వివరించారు. జాతీయ సేవా పథకం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం విజయలక్ష్మి, ఎ.రామరాజశేఖర్, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ డాక్టర్ బలరాం, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ కళాశాల అధ్యాపక బృందం, గంగాధర మండలం ప్రజాప్రతినిధులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

72

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles