యథావిధిగా బస్సులు నడపాలి


Mon,October 21, 2019 12:58 AM

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/కోరుట్ల టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందులా బస్సులు అన్ని రూట్లలో నడిచేలా చర్యలు చేపట్టాలని ఆయా డిపో మేనేజర్లను కలెక్టర్ శరత్ ఆదేశించారు. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లోని ఆర్టీసీ బస్ డిపోను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 141 చార్ట్‌ను, బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బస్సు వేళల సమయ సూచిక బోర్డులను పరిశీలించారు. ఏయే రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి, తాత్కలిక సిబ్బంది వివరాలను డిపో మేనేజర్ అప్పారావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డిపోలో చార్ట్ మేరకు బస్సులు నడపాలన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయనీ, విద్యార్థులతో పాటు ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. గతంలో శాశ్వత సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.


రెగ్యులర్ సిబ్బందికి విధులు కేటాయించినట్లుగా ఒక రోజు ముందే డ్యూటీ, సమయం, రూట్ వివరాలను తాత్కాలిక సిబ్బందికి తెలుపాలన్నారు. గతంలో మాదిరిగా కంట్రోలర్‌ను నియమించుకోవాలని పేర్కొన్నారు. బస్సుల రాకపోకలకు సంబంధించిన సమయాలను సూచించే ప్లెక్సీలు బస్టాండ్‌లో ఏర్పాటు చేయాలని తాసిల్దార్, నోడల్ అధికారులకు సూచించారు. నాలుగు క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, బస్సులను తనిఖీ చేసి మరమ్మతులు చేసిన తరువాతే ఆయా రూట్లకు పంపాలన్నారు. పని చేయని డిపో మేనేజర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట జేసీ రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్ పొత్తు రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, డీవీఎం నాగేశ్వర్‌రావు ఉన్నారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles