గర్భ నిరోధానికి అంతర


Sat,October 19, 2019 01:50 AM

-ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఇంజక్షన్లు
-ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు కృషి చేయాలి
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
-ఐఏంఏ హాలులో సమావేశం, కరపత్రాల ఆవిష్కరణ
జగిత్యాల అర్బన్: గర్భ నిరోధానికి ప్రభుత్వం అంతర అనే ఆరోగ్యకర ఇంజక్షన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందనీ, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో గర్భ నిరోధానికి అంతరపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా అంతర కార్యక్రమం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బిడ్డకు, బిడ్డకు మధ్య వ్యవధి ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం కొత్తగా అంతర అనే గర్భ నిరోధక ఇంజక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధకత అంటే కేవలం ట్యూబెక్టమీ, వేసెక్టమీ లాంటి ఆపరేషన్లు మాత్రమే ఉంటాయని చాలామంది తెలుసనీ, వారికి అవగాహన లేకపోవడంతో దంపతులకు జన్మించే పిల్లల మధ్య కనీస వ్యత్యాసం కూడా ఉండడం లేదని తెలిపారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు అంతరపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ.. గర్భ నిరోధక ఇంజక్షన్‌ను మూడు నెలలకు ఒకసారి ఇస్తారనీ, ఈ ఇంజక్షన్ గర్భం రాకుండా నిరోధిస్తుందని తెలిపారు. ఈ ఇంజక్షన్ ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టంచేశారు. అనంతరం అంతర కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి, డాక్టర్ సమియొద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి, గైనకాలజిస్ట్ డాక్టర్ రజిత, డీపీవో రాజేందర్, మాస్ మీడియా విభాగం తులసి రమణ, ఫార్మాసీ విభాగం రాజేందర్, పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.


పట్టణాభివృద్ధిపై సమీక్షా సమావేశం
ఆర్డీవో కార్యాలయంలో పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో తాగునీటి సరఫరా, మురుగు కాల్వలు, పారిశుధ్యం, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనీ, అభివృద్ధి పనులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఘంటా నరేందర్, డీఈ సత్యనారాయణ, ఏఈలు అయూబ్‌ఖాన్, లచ్చిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి వేణు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దేవేందర్, ఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

దేశ శ్రేయస్సు కోసమే గాయత్రి పరివార్ కలశ యాత్ర : ఎమ్మెల్యే
జగిత్యాల టౌన్: దేశ శ్రేయస్సు కోసమే గాయత్రి మహాయజ్ఞ కలశ యాత్ర అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎడ్ల అంగడి శ్రీసీతారాముల ఆలయానికి చేరుకోగా, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాయత్రి మహాయజ్ఞ కలశ యాత్ర జగిత్యాలకు చేరుకోవడం మనందరి అదృష్టమన్నారు. జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం మాట్లాడుతూ.. విశ్వ గాయత్రి పరివార్ తలపెట్టిన ఈ మహాయజ్ఞం దేశ శ్రేయస్సు కోసమేనని పేర్కొన్నారు. గాయత్రి శక్తి కలశ యాత్ర రాష్ట్రమంతా అన్ని దేవాలయాలను సందర్శించి జనవరి 2న హైదరాబాద్‌లో జరుగబోయే మహాయజ్ఞంలో కలశ స్థాపన జరుగుతుందని గాయత్రి పరివార్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు కనపర్తి నాగభూషణం, రామ్‌రెడ్డి, కొమురవెల్లి లక్ష్మీనారాయణ, కళశ్రీ గుండేటి రాజు, వుజగిరి జమున, అమర్నాథ్, భాస్కర్, డాక్టర్ రాజగోపాలాచారి, లక్ష్మి, గంగాలక్ష్మి, సూర్యనారాయణ, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

67

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles