64 వైన్స్‌లు.. 1,285 దరఖాస్తులు


Thu,October 17, 2019 01:34 AM

-నాన్ రిఫండ్ ఫీజు పెరిగినా తగ్గని వ్యాపారులు
- గతంతో పోలిస్తే 238 అదనం
-ఒక్క చివరి రోజే 800 దాఖలు
-ముగిసిన స్వీకరణ గడువు
-ఆబ్కారీకి 25.70కోట్ల ఆదాయం


(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)రాష్ట్ర సర్కారు ఈ నెల 3న కొత్త మద్యం పాలసీని విడుదల చేసింది. రెండేళ్ల కాలపరిమితికి (నవంబర్ ఒకటి నుంచి 2020 అక్టోబర్ 10) గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు లక్ష నుంచి 2లక్షలు కాగా, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం లైసెన్స్ ఫీజు నిర్ణయించింది. కొత్తగా నాలుగు నుంచి ఆరు స్లాబులకు పెంచింది. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ సాగింది. ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల్లోపు దరఖాస్తులు స్వీకరించగా, ఆశవహులు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపారు. పోటాపోటీగా దాఖలు చేశారు. చివరి రోజు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువల వచ్చాయి.

బుధవారం ఒక్కరోజే 800 దాకా దాఖలయ్యాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తుదారులు పొటేత్తడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తులను బుధవారం రాత్రి 10 గంటల వరకు తీసుకున్నారు. రాత్రి వరకు జిల్లాలోని 64 మద్యం దుకాణాలకు 1,285 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల, మెట్‌పల్లి, ధర్మపురి సర్కిల్ పరిధిలోని 64 దుకాణాలకు గాను గత ఏడాది 1047 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా 238దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఎస్పీ శ్రీధర్ తెలిపారు. జగిత్యాల సర్కిల్ పరిధిలోని 27దుకాణాలకు 457, ధర్మపురి సర్కిల్ పరిధిలోని 16 దుకాణాలకు 364, మెట్‌పల్లి సర్కిల్ పరిధిలోని 21 దుకాణాలకు 464 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అత్యధికంగా మల్లాపూర్ మండలం రాఘవాపూర్‌లో గెజిట్ నంబర్ 63వ దుకాణానికి 48దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుల రూపేణా రూ.25కోట్లా 70లక్షల ఆదాయం సమకూరింది.

రేపే డ్రా..
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ఉండనున్నది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. దరఖాస్తుదారులకు ఎంట్రీ పాసులు వెంటనే జారీ జేశారు. ఎంట్రీ పాసు లేకుండా వస్తే లోనికి అనుమతించమని తెలిపారు. లక్కీ డ్రా రేపే తీయనుండగా, ఆశాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వైన్స్ దక్కుతుందో లేదోనన్న టెన్షన్ కనిపిస్తున్నది.

రేటు తగ్గించి అమ్మినా నేరమే
ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అమ్మినా చట్ట ప్రకారం నేరమేనని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించే వ్యాపారులపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ సెక్షన్ 36(బీ), 41 ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఎమ్మార్పీ కన్నా తక్కువ రేటుకు మద్యం విక్రయిస్తే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకూ జైలుశిక్ష, వెయ్యి అపరాధ రుసుంతోపాటు 2లక్షల నుంచి 3లక్షల వరకు పెనాల్టీ విధించనున్నట్లు ఉత్తర్వులో వెల్లడించారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles