అన్ని రంగాల్లో మేటిగా నిలవాలి


Sun,October 13, 2019 12:29 AM

- మేధోశక్తిని పెంపొందించుకోవాలి
- విద్యార్థులకు గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపు
- కోరుట్ల మహిళా సంక్షేమ గురుకుల కళాశాల సందర్శన
- కథలాపూర్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ


కోరుట్లటౌన్‌: పోటీ ప్రపంచంలో విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకొని అన్ని రంగాల్లో మేటిగా నిలువాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. పట్టణంలోని అయ్యప్ప గుట్ట మహిళా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కళాశాల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థినులకు అందిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరగతి గదిలో అధ్యాపకులు బోధించే విషయాలను పూర్తిగా విద్యార్థులు ఆకళింపు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా హ్యాండ్‌ రైటింగ్‌ ప్రాక్టిస్‌ చేయాలనీ, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై పట్టు సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలుపాలనే ఆకాంక్షతో నాణ్యమైన కార్పొరేట్‌ విద్యను అందించేందుకు గురుకుల, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యను సార్థకం చేసుకుంటూ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రిన్సిపాల్‌ నర్సింహరెడ్డి, స్వేరోస్‌ ప్రతినిధులు కొంతం నవీన్‌, మైస శ్రీధర్‌, మెట్టు దాసు తదితరులున్నారు.

అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చాలి
కథలాపూర్‌: అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి, ఐసీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని ఇప్పపెల్లిలో శనివారం రాజ్యాంగ నిర్మాత బీ ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్‌ విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఈ ప్రాంతంలో గల్లిగల్లికి స్తూపాలు నిర్మించిన చరిత్ర ఉందనీ, ఎందరో అమాయక యువకులు బలి కాగా వారి పేర్లు స్తూపాలపై ఎక్కాయన్నారు. అంబేద్కర్‌ ఆశయాలు ఆచరణలోకి రావడంతో కొద్దికొద్దిగా యువతలో మార్పు వచ్చిందన్నారు. మార్పుకోసం ప్రతీ గ్రామంలో చైతన్య సభలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలనీ, ఎప్పుడు తమ కళ్లముందే ఉండాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఇటీవలే పోలీస్‌శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు సాధించిన మండలంలోని యువకులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, మెట్‌పల్లి ఏఎస్పీ మల్లారెడ్డి, ఎంపీపీ జవ్వా జి రేవతి, జడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య, సర్పంచ్‌ కోలి వసంత, ఎంపీటీసీ సభ్యురాలు గంగం దేవేంద్ర, నిర్వాహకులు వంశీ, జగన్‌, కాశవత్తుల వంశీ, అంబేద్కర్‌ సంఘం నాయకులు మైస శ్రీధర్‌, కాశవత్తుల లక్ష్మీరాజం, పానుగంటి భాస్కర్‌, భూమయ్య, చిన్నయ్య, శంకర్‌, హన్మాండ్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ను కలిసిన కలెక్టర్‌, ఎస్పీ
జగిత్యాల క్రైం: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను జగిత్యాల కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, ఎస్పీ సింధూశర్మ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రవీణ్‌కుమార్‌కు గౌరవవందనం సమర్పించారు.

ఆకలైతే అక్షరాలు తినాలి..!
జగిత్యాల టవర్‌ సర్కిల్‌: ఆకలైతే అన్నం కాదు అక్షరాలు తినాలని గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివసాయి రెసిడెన్షి కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఫిట్‌ ఇండియా ఆధ్వర్యంలో గురుకుల గురువులకు సన్మాన కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరై గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానవంతమైన సమాజ నిర్మాణమే స్వేరోస్‌ లక్ష్యమన్నారు. బీర్లు కాదు బుక్కులు కావాలనీ, వాట్సప్‌ కాదు వ్యాయామం కావాలని విద్యార్థులకు బోధించారు. ఆరోగ్యంగా ఉంటేనే జ్ఞానవంతమైన సమాజం నిర్మించవచ్చనీ, సూర్యుడి కంటే ముందే మేల్కొని వ్యాయామం చేయాలని సూచించారు. ఆకాశమే హద్దుగా గురుకులాల్లో చదివిన విద్యార్థులు గమ్యాన్ని చేరుకుంటున్నారన్నారు. జ్ఞానం, ఆరోగ్యం స్వేరోస్‌, ఫిట్‌ ఇండియా లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నక్క విజయ్‌, సుమన్‌, మనోజ్‌కుమార్‌, దుమాల రాజ్‌కుమార్‌, మహేశ్‌, రాజ్‌నాయక్‌, బెజ్జంకి సతీశ్‌, శ్రీనివాస్‌, చిర్ర మారుతి తదితరులు పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles