పెగడపల్లి: హరితహారం కోసం మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో 4లక్షల 73 వేల 602 మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామనీ, లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ఎంపీడీవో వాసాల వెంకటేశం పేర్కొన్నారు. మండలంలోని ఐతుపల్లి నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 23గ్రామపంచాయతీలకు శాలపల్లి మినహా 22 గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించి, అవసరం మేరకు అందరికీ అనువైన మొక్కలను మాత్రమే నర్సరీల్లో పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. మండలంలో బండ్ ప్లాంటేషన్ కింద 40,070 మొక్కలు, నివాస గృహాల్లో 1,67,280, గీత కార్మికుల సొసైటీ భూముల్లో 5,450, ముదిరాజ్‌లకు సంబంధించి వివిధ రకాల పండ్ల మొక్కలు 78,636, గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా 42,160, యాదవ సొసైటీ భూముల్లో 14,600, పాఠశాలలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో 9,584, ఎస్సారెస్పీ కాలువలు, చెరువు, కుంటల కట్టలకు 91,972 మొక్కలు నాటేందకు సర్వే చేసినట్లు తెలిపారు. నీడ నిచ్చే చెట్లతో పాటు, కలపకు అవసరమయ్యే టేకు, పండ్లు, పూల మొక్కలను అన్ని నర్సరీల్లో పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీడీవో పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంకా అవసరమున్న చోట మొక్కలు నాటించాలని ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇంతవరకు ఆరవల్లి, ల్యాగలమర్రి, సుద్దపల్లి, నామాపూర్ గ్రామాల్లోని నర్సరీలు అటవీశాఖ ఆధ్వర్యంలో ఉండగా, ఇక నుంచి గ్రామపంచాయతీ ఆధీనంలోనే నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వివరించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో వేణు పాల్గొన్నారు.