కమలంలో.. ముసలం


Thu,September 19, 2019 01:02 AM

-మరోసారి తారస్థాయికి వర్గపోరు!
-నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీరుపై శ్రేణుల గుస్సా
-పైవేట్ స్కూల్ కరస్పాండెంట్‌కు ప్రాధాన్యమివ్వడంపై పెదవివిరుపు
-మాటిమాటికీ కాంగ్రెస్ మనిషి ఇంటికెందుకంటూ ఆగ్రహం
-ఒకవర్గం వారినే వెనకేసుకెళ్తున్నాడంటూ ఆరోపణలు
-అతి చేస్తున్నాడంటూ విమర్శలు
-ఒంటెద్దు పోకడపై క్యాడర్‌లో నైరాశ్యం

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)నేను పాతికేళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నవాడిని. విద్యార్థి సంఘం నాయకుడిగా మొదలై, పట్టణ శాఖ అధ్యక్షుడిగా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన. ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న. బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలూ పనిచేసిన. వంద సార్లు ఫోన్ చేసినా, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అయనేం ఎంపీ? పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందుబాటులో ఉండని ఆ మనిషి ఇక ప్రజల సమస్యలు ఎట్ల పరిష్కరిస్తడు?


- ఓ నాయకుడి ఆక్రోషం
వ్యయ ప్రయాసలకోర్చి, ఇరవై ఏండ్ల నుంచి పార్టీ ఉనికిని కాపాడుకుంట వస్తున్న. నాకు మా ఎంపీ ఊళ్లోకి వచ్చేది తెలియదు, పోయేది తెలియదు, ప్రోగ్రాము తెలియదు. ఇక పార్టీ కార్యాలయానికి ఆయన వచ్చిందే లేదు. మా ఎంపీ సారుకు ఎవరో కాంగ్రెస్ మనిషి పరిచయమట! ఆయన ఇంటికే వస్తుండూ, పోతుండు. ఆ కాంగ్రెస్ మనిషి చెబితే తప్ప మాకు తెలుస్తలేదు. ఇట్లయితే పార్టీని ఎట్ల నడపాలె?
- మరో నాయకుడి ఆవేదన
..ఇలా జిల్లా కేంద్రంలో ఓవర్గం బీజేపీ శ్రేణులు గరంగరమవుతున్నారు. ఎంపీ అర్వింద్ వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. క్రమశిక్షణ, సిద్ధాంతాల ఆచరణకు కట్టుబడి ఉండే పార్టీగా చెప్పుకునే బీజేపీలో తాజా పరిణామాలు పార్టీలో వర్గపోరును బట్టబయలు చేస్తున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది. తెలంగాణ ఉద్యమం మొదలైనపుపటి నుంచి బీజేపీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పో తూ వచ్చింది. ఆ సయంలోనే రెండు వర్గాలుగా చీలిపోయింది. కేంద్ర మాజీ మంత్రికి విధేయులుగా ఒకవర్గం, మాజీ ఎమ్మెల్యే అనుచరులుగా మరోవర్గం ఏర్పడాయి. ఇరువర్గాల ఆధిపత్య పోరు సాగుతూ రావడంతో పార్టీ క్రమంగా బలాన్ని కోల్పోయింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని జగిత్యాల నుంచే నిలబెట్టినా డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో శ్రేణులన్ని నిరాశలో మునిగాయి. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ అనూహ్యంగా విజయం సాధించడం క్యాడర్‌లో ఉత్సాహం నింపింది. పార్టీకి మంచి రోజులు వ చ్చాయని నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్న తరుణంలో అంతర్గత సమస్యలు మళ్లీ మొదలు కావ డం, తారస్థాయికి చేరి ఏకంగా ఎంపీ కార్యక్రమాలనే బహిష్కరించేస్థాయికి చేరడం చర్చనీయాంశమైంది.

లభించని అపాయింట్‌మెంట్..
కార్యక్రమాలకు సమాచారం కరువు
ఎంపీగా అర్వింద్ గెలిచాగా అర్వింద్‌తో జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేయాలని పార్టీ తలపోసింది. కానీ, అది నెరవేరలేదు. మొదటి నెల రోజుల పాటు త్వరలో సభ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన లోకల్ క్యాడర్, ఎంపీ నుంచి కృతజ్ఞత సభ నిర్వహణకు అనుమతి రాకపోవడంతో మెల్లగా తమ ప్రయత్నాన్ని విరమించుకున్నది. ఇక పలుమార్లు ఎంపీని కలిసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నించినా, వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వనట్లు సమచారం. ఎంపీని పదిసార్లు కలిసి సమస్యలను, పార్టీ పరిస్థితిని వివరించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోవడంతో క్యాడర్, నాయకులు పూర్తిగా నిరాశలో మునిగారు. ఫోన్‌లో కలిసేందుకు ప్రయత్నించినా స్పందన రాకపోవడంతో విసుగు చెంది ఫోన్ చేసే ప్రయత్నాన్ని సైతం విరమించుకున్నామని చెబుతున్నారు. ఎంపీగా గెలిచి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా నాలుగైదు సార్లే జగిత్యాలకు రావడం, వచ్చినప్పుడు కూడా క్యాడర్‌కు, నాయకులకు సమాచారం ఉండక పోవడంతో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు.

ప్రైవేట్ కరస్పాండెంట్ ఇంటికి రావడంపై కినుక
ఎంపీ జగిత్యాలకు వచ్చిన ప్రతీసారి ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఇంటికి వస్తుండడం, ఆ సమాచారం కూడా ఎవరికీ ఉండకపోవడంతో పార్టీ శ్రేణులు కినుక వహించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే అర్వింద్ సదరు కరస్పాండెంట్‌కు అధిక ప్రాధా న్యం ఇస్తూ వచ్చారని నాయకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆ కరస్పాండెంట్‌కు జగిత్యాల మాజీ ఎమ్మె ల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా గుర్తింపు ఉందనీ, అతడు ఏనాడూ బీజేపీతో కలిసి రాలేదనీ చెబుతున్నారు. ఎన్నికలపుడు ప్రచార సామగ్రి నుంచి మొదలుకొని అన్ని వ్యవహారాలనూ ఆ కరస్పాండెంట్‌కే అప్పగించారనీ, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికలపుడే ఓ నాయకుడు సదరు ప్రైవేట్ కరస్పాండెంట్‌కు బాధ్యతలు, సామగ్రిని అప్పగించడంతో పాటు, పార్టీ అందజేసిన నిధులు సైతం ఇచ్చారనీ, వాటిని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడని, కార్యకర్తలకు ఇవ్వడం లేదంటూ తీవ్రంగా గొడవపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సదరు కరస్పాండెంట్‌కే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎంపీ జగిత్యాలకు వచ్చిన మూడు నాలుగు సందర్భాల్లో అయన వద్దే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీ శ్రేణులకు పెదవి విరుస్తున్నారు. ప్రెస్‌మీట్లు సైతం సదరు కరస్పాండెంట్ ఇంట్లోనే జరుగుతున్నాయనీ, ఆయనే అందరికీ సమాచారం ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. నిన్నమొన్న సభ్యత్వం తీసుకున్న సదరు వ్యక్తికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం, పార్టీకోసం ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారిని పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఎంపీ కార్యక్రమాలను బహిష్కరించిన క్యాడర్
ఎంపీ వ్యవహారశైలిలో మార్పు రాకపోవడం, మొ న్న సోమవారం జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమాన్ని మళ్లీ సదరు ప్రైవేట్ కరస్పాండెంట్ ఇంట్లోనే నిర్వహించాలని నిర్ణయించడంతో పార్టీ నాయకులు, క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోయారు. ఎంపీ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఎంపీ కార్యక్రమం ఉన్నపుడే జిల్లా కేంద్రానికి చెందిన పార్టీ ప్రముఖులంతా కలిసి, తారక రామానగర్‌లోని వృద్ధాశ్రమంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఎంపీ కార్యక్రమానికి ఒక్కరూ హాజరుకాలేదు. పార్టీ నాయకులు ఎవరూ వెంట లేకుండానే ఎంపీ అర్వింద్ సోమవారం జగిత్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వర్ణకార సంఘంలో నిర్వహించిన కార్యక్రమానికి, వీరబ్రహ్మంగారి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. వాటిలో ఆయన వెంట ఒక్క జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ మినహా మరెవ్వరూ కానరకపోవడం గమనార్హం. ఎంపీ అర్విం ద్ వెంట జిల్లా అధ్యక్షుడు, ఏ పార్టీ ప్రతినిధి వచ్చినా, వారి పక్కన కనబడే ఓ పత్రిక ప్రతినిధి మాత్రమే ఉండడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

అవును బహిష్కరించాం
ఎంపీ కార్యక్రమాలకు ఎవరూ హాజరుకాకపోవడంపై జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తాము ఎంపీ కార్యక్రమాలను బహిష్కరించామని బాహాటంగానే పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించరనీ, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్‌కే ప్రాధాన్యత ఇస్తారనీ, ఒకవర్గం వారినే దగ్గరికి తీసుకున్నారనీ, అందుకే ఆయ న కార్యక్రమాన్ని బహిష్కరించామని స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై సన్నాయినొక్కులు నొక్కారు. ముందు గా పత్రికలకు ప్రకటనలు జారీ చేసిన వారు, తదుపరి మాట్లాడుతూ ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని బహిష్కరించామనీ, మిగిలిన వాటిని బహిష్కరించలేదన్నారు. ఏదేమైనా బీజేపీలో ముసలం పుట్టిందని వారే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

69

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles