హాజరుపై నజర్


Mon,September 16, 2019 01:01 AM

-పాఠశాల విద్యపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
-ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు సరికొత్తగా టీ హాజర్ యాప్
-హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో నేరుగా అనుసంధానం
-వచ్చారా? లేదా..? అనే వివరాలు అప్‌డేట్ చేయాలని ఆదేశం
- బడులను నిత్యం తనిఖీ చేయించాలని నిర్ణయం
-జిల్లాలో 795 ప్రభుత్వ, 13 ఆదర్శ పాఠశాలల్లో అమలు


జగిత్యాల, నమస్తే తెలంగాణ: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. టీ-హాజర్ పేరుతో ఇది అమల్లోకి రాగా, పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను ప్రధానోపాధ్యాయులు రోజూ ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేగాక విద్యా బోధనలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం తదితర విషయాలను పర్యవేక్షించేందుకు డీఈవో, ఎంఈఓలు నిత్యం ఏదో ఒక పాఠశాలను సందర్శించాలని ఆదేశాలు జారీచేసింది. ఇక విద్యాశాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుండగా, అప్పుడప్పుడూ ఎదురయ్యే వేధింపులకు చెక్ పెట్టేందుకు ఉన్నతాధికారులు నడుం బిగించారు. అందుకు ఓ కమిటీ వేశారు. ఫిర్యాదులపై ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇకపై చర్యలు తీసుకోనున్నారు. టీ-హాజరు యాప్ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించగా, విద్యాబోధనలో నాణ్యత, మౌలిక సౌకర్యాలు, మధ్యాహ్న భోజనంలో నాణ్యతను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే బాధ్యతలను డీఈఓ, ఎంఈఓలకు అప్పగించారు.

హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యం..
ఇతర శాఖలతో పోలిస్తే విద్యాశాఖకు సెలవులు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు సీఎల్, స్థానిక సెలవులు, విద్యా సంస్థల బంద్ వంటివి ఆదనంగా ఉంటాయి. ఇన్ని ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న చోట సర్దుబాటు చేసుకోవడం, అనధికారికంగా సెలవులు తీసుకోవడం, పిల్లలు లేనిచోట ఉన్నట్టుగా హాజరు చూపి ఉపాధ్యాయులు బయట తిరగుతున్నట్లు సమాచారం. కొద్దిమంది సంఘ నేతలు రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, ఎల్‌ఐసీ వ్యాపారాల్లో బిజీగా ఉంటూ హాజరు మాత్రం నూటికి నూరుశాతం వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కొదిమంది నేతలు బినామీ టీచర్లతో ప్రయోజనాలు పొందుతున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటికీ చెక్‌పెట్టే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు. టీ-హాజర్ అనే యాప్ ద్వారా నేరుగా, హైదరాబాద్ నుంచి హాజరు శాతాన్ని పరిశీలించే విధానాన్ని ప్రవేశపెట్టారు. టీ-హాజర్ యాప్‌ను ప్రధానోపాధ్యాయులు అండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో పాఠశాల డైస్‌కోడ్, పాఠశాల మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ రిజిస్టర్ చేయాలి. ఒకసారి రిజిస్టర్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రతి రోజూ ఉదయం 11 గంటల లోపు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు నమోదు చేయాలి. బాలికలు, బాలుర హాజరు శాతాన్ని వేర్వేరుగా నమోదు చేయాల్సి ఉంటుంది.

పాఠశాలను నిత్యం సందర్శించాలి
డీఈఓ, ఎంఈఓలు ప్రతి రోజూ ప్రార్థన సమయంలో ఒక పాఠశాలను సందర్శించి తమ సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వాటిని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి వెనువెంటనే ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆధునిక పరిజ్ఞానంతో హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు దృష్టిపెడతారన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీ-హాజర్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజ రు శాతం మెరుగు పడితే డీఈఓ, ఎంఈవోల ని త్య పర్యటన ద్వారా నాణ్యమైన విద్యాబోధన, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంపుదలకు అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన. జిల్లాలో 795 ప్రభుత్వ పాఠశాలలు, 13 ఆదర్శ పాఠశాల ల్లో 63,938మంది విద్యార్థులు 1వ తరగతి నుం చి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 510, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, ఉన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, టీఎస్‌ఎంఎస్ స్కూళ్ల 200వరకు ఉన్నాయి. సుమారు 3500మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

మహిళా ఉపాధ్యాయుల్ని వేధిస్తే వేటు
జిల్లాలో మిగతా శాఖల కంటే విద్యాశాఖ పరిధిలోనే మహిళా ఉద్యోగులు అధికంగా ఉన్నారు. పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లోని బడుల్లో, బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో సైతం వీరు పాఠాలు బోధిస్తుంటారు. పని ప్రదేశాల్లో పలు సమస్యలు ఎదుర్కొంటున్న వారు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా వేధికంటూ లేకుండా పోయింది. వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందో? లేదో? అనే అనుమానాలతో అవమానాలు ఎదురైనా భరిస్తూ వచ్చారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు విద్యాశాఖలో అంతర్గతంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఫిర్యాదులపై విచారించి ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. 10 మంది సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో మహిళలు, పురుషులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ఎక్కడ వేధింపులు జరిగినా ఈ కమిటీ దృష్టికి తీసుకువస్తే విచారణ, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles