బీజేపీ నేతలు చిత్తశుద్ధి చాటుకోవాలి


Sat,September 14, 2019 02:49 AM

-కాళేశ్వరం, పాలమూరుకు జాతీయ హోదా తీసుకురావాలి
-మండలి విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు
-ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం
-విప్‌కు ఘన స్వాగతం పలికిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలుపెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కలెక్టరేట్: కేంద్రంలో అధికారంలో ఉన్నామనీ, తామే అభివృద్ధి ప్రధాతలమని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదాను తీసుకరావాలని రాష్ట్ర శాసన మండలి విప్ తానిపర్తి భానుప్రసాదరావు హితవు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంధంపల్లిలోని స్వరూపగార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మండలి విప్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన సందర్భంగా శుక్రవారం భాను ప్రసాదరావుకు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీగా ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ పుష్ఫగుచ్ఛాలను అందజేశారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌కు చేరుకున్నారు.

భాను ప్రసాదరావుకు పెద్దపల్లి నియోజకవర్గంతోపాటుగా జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ మాజీ కమిటీ, సింగిల్ విండో చైర్మన్లు, ఇతర టీఆర్‌ఎస్ నాయకులు, కార్తకర్తలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాను ప్రసాదరావు మాట్లాడుతూ, రైతులకు 24గంటల విద్యుత్‌తోపాటు రైతుబంధు, రైతు బీమా పథకాలను అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. మంథని నియోజకవర్గ గోదావరి అవతలి ఒడ్డున ఉన్న మహారాష్ట్ర, కర్నాటకతోపాటు ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులపై ఏ మాత్రం ప్రేమ లేకుండా రాజకీయాలే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయనిర్ణేతలనీ, ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలకు తెలుసన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తూ, అమలు చేస్తున్నారని చెప్పారు. జిల్లాకు లభించిన అందరి పదవులతో అందరం కలిసికట్టుగా పనిచేద్దామనీ, రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండంపై గులాబీ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles