సాకారం దిశగా సొంతింటి కల

Sun,August 18, 2019 02:54 AM

-కోరుట్ల నియోజకవర్గంలో చకచకా డబుల్ బెడ్రూం ఇండ్లు
-మొదటి, రెండో విడతలో 1400 మంజూరు
-కోరుట్ల మండలంలోని నాలుగు గ్రామాల్లో ఇప్పటికే గృహ ప్రవేశాలు
-దసరా కల్లా 90శాతం పూర్తికి సన్నాహాలు
-పట్టణ, గ్రామాల్లో శరవేగంగా నిర్మాణ పనులు

(మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ) నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. లబ్ధిదారుపై పైసా ఖర్చు భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. జిల్లాలోనే ప్రథమంగా కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో 25, పైడిమడుగులో 25, అయిలాపూర్‌లో 30, ధర్మారంలో 5 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తవగా ప్రస్తుతం లబ్ధిదారులు సంతోషంగా నివాసముంటున్నారు. ఏడాది క్రితమే మాదాపూర్, అయిలాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లలో అప్పటి ఎంపీ కవిత చేతుల మీదుగా లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. ఇటీవల ధర్మారం, పైడిమడుగులో డబుల్ బెడ్రూం ఇండ్లలో గృహ ప్రవేశాలు పూర్తయ్యాయి. వచ్చే దసరా పండుగ నాటికి 90శాతం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పండు రోజున లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇటీవల ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల్లో వేగవంతం కోసం దిశా నిర్దేశం చేశారు.

అక్కడక్కడా ఏర్పడిన చిన్న సమస్యలను అధిగమించి పనులు పూర్తి చేయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులను ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. కోరుట్ల నియోజకవర్గానికి మొదటి విడతలో 400 ఇండ్లు, రెండో విడతలో 1000 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే మొదటి విడతలో కేటాయించిన ఇండ్లలో కొన్ని పూర్తయి గృహ ప్రవేశాలు జరగ్గా, మిగతావి త్వరలోనే ప్రవేశాలకు ముస్తాబవుతున్నాయి. రెండో విడతలో కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సైతం ఇప్పుడిప్పుడే పురోగమనం దిశలో సాగుతున్నాయి. స్థల సేకరణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, సుదీర్ఘ కాలం ఎన్నికల కోడ్ తదితర కారణాల వల్ల రెండో విడత ఇండ్ల నిర్మాణ పనుల ప్రారంభం, పనుల నిర్వహణలో కొంత జాప్యం ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఇండ్ల నిర్మాణ పనులను వేగిరం చేసేందుకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాకర్లు, స్థానిక ప్రజాప్రతినిధులను సమాయత్తం చేశారు. ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సమీక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెరిగినట్లు తెలుస్తున్నది. మెట్‌పల్లి పట్టణ శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలో మొదటి విడతలో చేపట్టిన 80 డబుల్ బెడ్రూం ఇండ్లు (జీ ప్లస్-2) నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు చకచకా ముస్తాబు చేస్తున్నారు. కోరుట్ల పట్టణ శివారులోని పెద్దగుండు సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మరో నెల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లుకు రూ. 5.05 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ. 5.25 లక్షలు ప్రభుత్వం నిధులు కేటాయించి లబ్ధిదారుకు పైసా ఖర్చు లేకుండా నిర్మించి ఇస్తుండడంపై నిరుపేదలైన లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles