సంచార జాతులకు అండగా ప్రభుత్వం

Fri,July 12, 2019 02:32 AM

మారుతీనగర్/మెట్‌పల్లి రూరల్/మల్లాపూర్/ కోరుట్ల టౌన్ : సంచార జాతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ శెట్టి కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ భరోసా ఇచ్చారు. గురువారం మెట్‌పల్లి మండలంలోని వెంపేట, మేడిపల్లి, మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామాల్లో ఆయన సందర్శించి బాగోతుల కులస్తుల జీవన విధానంపై, గౌడ శెట్టి కాలనీలో ఉన్న కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, జీవన విధానంపై ఆయన అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కులం సర్టిఫికెట్ లేకపోవడంతో ఉన్నత చదువులు చదువలేక తమ బిడ్డలను కూలీలుగా పంపించి చాలీచాలని జీతంతో బతకు వెళ్లదీస్తున్నామని వారి గోడును వెల్లబోసుకున్నారు. కాగా వేంపేట గ్రామంలో దయనీయ పరిస్థితిలో ఉన్న వృద్ధుడికి ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు పలువురు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లోని సంచర జాతుల కులస్థులు వివిధ పనులను చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారిని బీసీ ఏలో చేర్చి ఆదుకోవాలని ఏంపీపీ మారు సాయిరెడ్డి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడికు విన్నవించారు. కాగా ముత్యంపేటలో ఆయన మాట్లాడుతూ గౌడ శెట్టి కులస్థుల సమస్యలు చాలా ఉన్నాయనీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక అందజేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కే రాజలింగం, సామాజిక సేవా కార్యకర్తల కిరణ్‌కుమార్, మెట్‌పల్లి వ్యవసాయమార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, తాసిల్లార్లు దండిగ రాజయ్య, రమేశ్, సర్పంచులు పీసు తిరుపతిరెడ్డి, బొల్లం కృష్ణవేణి, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, ఎంపీటీసీలు గుండెల నగేష్, మాజీ సర్పంచులు, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్, బాగోతుల కులస్థులు, బీసీ హాస్టల్ వార్డెన్ బన్సీ నాయక్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ గురుకుల పాఠశాల సందర్శన..
మండలంలోని వెంకట్రావుపేట శివారులో గల మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ గురువారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. పాఠశాలలోని బోధన తీరును విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూ ప్ర కా రం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు.

సొన్నాయి కులస్థుల స్థితి గతుల పరిశీలన..
పట్టణంలోని ఝాన్సీరోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్న సొన్నాయి కులస్తుల స్థితిగతులను బీసీ కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణమోహన్ గురువారం పరిశీలించారు. ఈ మేరకు కుల వృత్తికి ప్రోత్సాహం లేక ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని సొన్నాయిల కులస్తులు ఆయనకు వివరించారు. సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కడ బీసీ సంక్షేమాధికారి రాజలింగం, సొన్నాయిల సంఘం నాయకులు ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles