పచ్చదనం, పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించాలి

Tue,July 9, 2019 01:19 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ముఖ్యమంత్రి స్వచ్ఛ హరిత గ్రామం కార్యక్రమంపై ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టం 2019 సెక్షన్ 52ప్రకారం గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలో మూడు కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా, మొక్కలు నాటాలనీ, ఇంటింటికి ఆరు నుంచి పది వరకు మొక్కలు నాటేలా చూడాలన్నారు. చెరువులు, గ్రామపంచాయతీ కార్యాలయం, అటవీ, ప్రభుత్వ, ఎస్సారెస్పీ, కమ్యూనిటీ సెంటర్లు, హరితవనాలు, వైకుంఠ దామాల్లో, ఇనిస్టిట్యూషన్‌లలోని ఖాళీ స్థలాల్లో లక్ష్యానికి తగ్గకుండా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా, ప్రతి మూడు మండలాలకు ఒక క్లస్టర్ అధికారిని, ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. గ్రామాల్లో ఏరియాల వారీగా గ్రామ స్థాయి అధికారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించబోయే కార్యక్రమాల గురించి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బహిరంగ మల విసర్జన చేసినా, రోడ్లపై చెత్త వేసినా, నీటిని వృథా చేసిన వారికి అపరాధ రుసుము విధించనున్నట్లు పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంబంధిత ప్రత్యేక అధికారులు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. మొక్కలు చనిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనీ, మొదట ఐదు మండలాలను ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. డ్రెయినేజీలను శుభ్ర పరచాలనీ, ముళ్లపొదలు, రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూడాలనీ, ఇండ్లలోని వృథా నీటిని ఇంకుడుగుంతల్లోకి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఇండ్లు, రోడ్ల నుంచి చెత్తను సేకరించే సైకిళ్ల ద్వారా డంపింగ్ యార్డుకు చెత్తను తీసుకెళ్తున్నారా? అందులో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వాటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసేలా ఉన్నాయా? పరిశీలించాలన్నారు. ఒక వారంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఫొటోలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం జడ్పీ సీఈవో ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముందుగా ప్రజల్లో ఈ కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రారంభించాలన్నారు. ప్రత్యేక అధికారులు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలన్నారు. నాటే ప్రతి మొక్కను స్వయంగా పరిశీలించాలనీ, మొక్కలు నాటి వాటికి కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ భిక్షపతి, అటవీ అధికారి నరసింహారావు, డీపీవో శేఖర్, జడ్పీ ఏవో శ్రీలతారెడ్డి, ఏపీడీలు లక్ష్మీనారాయణ, సుం దర వరదరాజన్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles