అన్నదాతకు అండగా..

Tue,July 9, 2019 01:11 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:రైతుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రకృతి వైపరిత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తున్నది. జిల్లాలో గతేడాది ఆగస్టులో భారీ వర్షాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, సోయాబిన్, కంది, పెసర, ఇతర పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా 16,750 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లగా రూ.12.30 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఇప్పటికే నష్టపోయిన రైతులను గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

16,750 హెక్టార్లలో పంట నష్టం
గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా లక్షా 24 వేల హెక్టార్లలో పత్తి, సోయాబిన్ 40 వేల హెక్టార్లలో, కంది పంటను 24,600 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు జొన్న 6వేల హెక్టార్లు, పెసర్లు 2 వేలు, మినుములు 2వేల హెక్టార్లు వేశారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పంటలకు అనుకూలిస్తుండడంతో పత్తి, సోయాబిన్, కంది పంటలు బాగా పెరుగుతుండగా ఆగస్టులో కురిసిన వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. పలు మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చెరువులు నిండి మత్తడి ద్వారా నీరు ప్రవహించగా, వాగులు, ఒర్రెలు పొంగిపొర్లాయి. కుండపోత కారణంగా పంటపొలాల్లోకి సైతం నీరు ప్రవహించడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 403 గ్రామాల్లో 96,370 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వీటితో పాటు 18,950 ఎకరాల్లో సోయాబిన్, 8069 ఎకరాల్లో కంది, 400 ఎకరాల్లో జొన్న, 20 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా ఏఏ పంటలకు ఎంత నష్టం వాటిల్లింది, ఎంత మంది రైతులు పంటలు నష్టపోయారనే వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది 101 బృందాలుగా ఏర్పడి పంట నష్టం నివేదికలు తయారు చేశారు.

రూ.12.30 కోట్లు మంజూరు
గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.12.30 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 16,750 హెక్టార్లలో వివిధ పంటలను నష్టపోయిన రైతులకు అధికారులు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేస్తారు. హెక్టారుకు రూ.6,800 చొప్పున వ్యవసాయశాఖ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులను వేస్తారు. ఇందు కోసం రైతుల బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు కావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భూసార పరీక్షలు తప్పనిసరి
బేల : రైతులు వేసవి కాలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న తర్వాతనే అధికారుల సూచనల మేరకు పంటలు వేసుకోవాలని జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ సూచించారు. సోమవారం బేల మండలంలోని సాయిల్ హెల్త్ కార్డు పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన మణియార్‌పూర్‌లో రైతులకు భూ సార పరీక్ష పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వేసవి కాలంలో తమ పొలంలో ఉన్న మట్టి నమూనాలు సేకరించి భూ సార పరీక్షలు చేయించుకోవాలన్నారు. భూ సార పరీక్షల ఆధారంగానే భూమిలో ఏ స్థాయిలో నత్రజని, పొటాష్, బాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుందన్నారు. పంటలను బట్టి యూరియా, డీఏపీ, సూపర్‌పాస్ఫెట్, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులను ఎంత మోతాదులో వాడాలో తెలుస్తుందన్నారు. రైతులు ఈ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఓ భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిందని, ప్రతి రైతూ వేసవి కాలంలో మట్టినమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి భగత్ రమేశ్ మాట్లాడుతూ.. భూసార పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా రైతులు ఏఏ పంటలు వేసుకోవాలో, ఏ పంటలు వేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందో తెలుస్తుందన్నారు. ఆహార భద్రత మిషన్, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద 90 శాతం రాయితీపై జొన్నలు, సజ్జలు, రాగుల విత్తనాలను అందిస్తున్నట్లు చెప్పారు. పంటల బీమాకు వాతావరణ ఆధారిత బీమా, పత్తికి జూలై 10 చివరి తేది, ఫసల్ బీమా సోయాబిన్‌కు 31వ తేదీ వరకు చివరి గడువు ఉందని, అధిక మొత్తంలో రైతులు బ్యాంకుల ద్వారా లేదా మీ సేవలో బీమా చేసుకోవాలని సూచించారు. రైతులందరూ ఫసల్ బీమా కింద తమ పంట బీమా ఇన్సూరెన్స్‌లు చేసుకోవాలన్నారు. మణియార్‌పూర్ గ్రామంలో 110 మంది భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్, ఎంపీపీ ఠాక్రె వనిత గంభీర్ భూసార పరీక్ష పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాడ్కర్ తేజ్‌రావు, కో-ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, బేల, జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రకాశ్ పవార్, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ సంతోష్, లక్ష్మణ్, వ్యవసాయశాఖ విస్తరణ అధికారి రాజేశ్, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles