ట్రిపుల్ ఐటీ ఘటనపై స్పందించిన కోర్టు

Tue,July 9, 2019 01:10 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ స్పందించారు. సుమోటోగా తీసుకొని 1382 పీఎల్‌సీ కింద ఐదుగురిపై కేసు నమోదు చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినికి కెమెస్ట్రీ విభాగంలో పని చేస్తున్న రవి వరాల మాయమాటలు చెప్పి వేధింపులకు పాల్పడినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితం కాగా.. ఐదుగురిపై సుమోటోగా కేసులు నమోదు చేశామన్నారు. నిర్మల్ ఎస్పీ, భైంసా డీఎస్పీ, ముథోల్ సీఐ, ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్‌లర్‌తో పాటు డైరెక్టర్‌లకు నివేదికకు ఆదేశించారు. ఈ నెల 15లోగా పూర్తి నివేదికను సమర్పించాలని సూచించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అవుట్ పోస్టింగ్ ఉన్న తర్వాత విద్యార్థులు బయటకు రాకుండా చూసే బాధ్యత వారిదే అని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు దర్యాప్తు నివేదికలో తేలితే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles