పోలీసులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

Tue,July 9, 2019 01:10 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధిలో పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆ తర్వాత సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిరోజూ పోలీసులు మారుమూల గ్రామాలను సందర్శించాలన్నారు. నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో సమూల మార్పులు తీసుకవచ్చిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టడంతో ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహభావం పెరిగిందన్నారు. ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా నేరుగా పోలీసులకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు కళాజాత బృందాలతో గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో సామాజిక రుగ్మతలను తొలగించడం, చట్టాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రజలు చైతన్య వంతులు కావడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రోజువారిగా పోలీసు స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి పోలీసులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్ రవికుమార్, ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీసు అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles