ఇంటికో పాడి పశువు


Sun,July 7, 2019 01:02 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ) :వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి ఉత్పత్తిని పెంచి, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగానే కరీంనగర్ డెయిరీ అడుగులు వేస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఇంటికి పాడి పశువు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం డెయిరీ పరిధిలో 70 వేల పైచిలుకు పాడి రైతులున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను లక్షకు పెంచుతాం. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యమున్న డెయిరీని, అతి కొద్ది నెలల్లోనే ఐదు లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచుతాం. మారుతున్న పరిస్థితులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం వినియోగించేందుకు ఆలోచనలు చేస్తున్నాం. ఇందుకోసం లండన్‌కు చెందిన ఎక్సెటర్ విశ్వవిద్యాలయంతో ఎంఓయూ కుదుర్చుకునే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి అని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాడి రైతులు, వినియోగదారుల సంక్షేమం, డెయిరీ పరిధిలో అమలవుతున్న పథకాలు, విదేశాల్లో పాడి పరిశ్రమరంగానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి అనేక అంశాలను వివరించారు.


నమస్తే : లండన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం నుంచి దేశంలోనే మీ ఒక్కరికే ఇటీవల పిలుపు వచ్చింది. మీరు వెళ్లొచ్చారు కదా? అక్కడ గమనించిందేమిటి?
చైర్మన్: ఎక్సెటర్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిన మాట నిజం. ఈ విశ్వవిద్యాలయం పాడి పరిశ్రమపై అనేక పరిశోధనలు చేస్తున్నది. సదరు విశ్వవిద్యాలయ నిర్వాహకులు మన దేశంలోని డెయిరీల వివరాలు తెలుసుకొని కరీంనగర్ డెయిరీ నుంచి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో పాడి పరిశ్రమ అభివృద్ధికి వినూత్న పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. చిన్న ఉదాహరణ చూస్తే.. కేవలం 40 మంది రోజుకు రెండు లక్షల లీటర్ల ఉత్పత్తి చేసే డెయిరీని విజయవంతంగా రన్ చేస్తున్నారు. అదే మన వద్ద అయితే వేల మందిని వినియోగించాల్సి ఉంటుంది. దాణా నుంచి పాలు పితికే వరకు అంతా సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతున్నారు. అంతేకాదు మేం పరిశీలించిన మరో అంశం ఏంటంటే. ఒక్కో పాడి ఆవు సగటన రోజుకు 36 లీటర్ల నుంచి 80 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. రోజుకు నాలుగుసార్లు ఆవు నుంచి పాలు తీసుకుంటారు. ఇలా ప్రతి విషయంలోనూ టెక్నాలజీ వాడుతున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇలా పాడి ఉత్పత్తి రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను మేం అక్కడ గమనించాం.

నమస్తే : ఎక్సెటర్ విశ్వవిద్యాలయం పరిజ్ఞానం ఇక్కడ పాడిపరిశ్రమ అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతుందా?
చైర్మన్: మన ప్రాంత పరిస్థితులను వారికి వివరించాం. సాధ్యాసాధ్యాలపై వారు మాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి చూపించారు. మన ప్రాంతంలోని వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువులు వేడిని తట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఎలాంటి దాణాను వినియోగించాలి?, వాటి ద్వారా పాలు ఎలా పెరుగుతాయి?, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా వినియోగించాలి?, పాల నాణ్యతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వంటి అనేక అంశాలను వివరించారు. అయితే వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలన్నా.. ఇతర అంశాలను మనం తీసుకోవాలన్నా.. ముందుగా మోమోరండం అఫ్ అండర్ స్టాడింగ్ (ఎంఓయూ) కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా చర్చిస్తున్నాం. లాభనష్టాలు బేరీజు వేసుకోవడంతో పాటు ఎంఓయూలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అందుకు అనుగుణంగా అడుగువేయాలని భావిస్తున్నాం. పాడిరంగంలోని కొంత మంది నిపుణులతోనూ చర్చిస్తున్నాం. అన్నీ ఓకే అనిపిస్తే అప్పుడు ముందుకు వెళ్తాం. కానీ,, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం వాళ్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉంది. పాడిపరిశ్రమకు బాగా ఊతమిచ్చే విధంగా ఉంది.

నమస్తే : ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమ పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు?
చైర్మన్: పాడి ఉన్న చోటే పంట ఉంటుందంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం అని నేను నమ్ముతున్నా. ఇదే కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆలోచనలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలిచేది, వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉండేది పాడిపరిశ్రమ మాత్రమే అన్నది సీఎం ఆలోచన. ఇందులో భాగంగానే పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. వివిధ పథకాల ద్వారా పాడి పశువులను ఇస్తోంది. ఈ కోణంలోనే కరీంగనర్ డెయిరీ సైతం ముందుకోళ్తోంది. ప్రస్తుతం డెయిరీ సామర్థ్యం రెండు లక్షల లీటర్లు. 70 వేల మంది పాడి ఉత్పత్తిదారులున్నారు. కానీ, దీనిని ఐదు లక్షల లీటర్లకు పెంచడమే కాకుండా ప్రస్తుతం ఉన్న 70 వేల పాడి రైతుల సంఖ్యను లక్షకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం.

నమస్తే : ఐదు లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచాలంటే మౌలిక సదుపాయాలు అవసరం కాదా? ఇందుకోసం మీరేం చేస్తున్నారు?
చైర్మన్: ప్రస్తుతం పద్మనగర్‌లో ఉన్న డెయిరీ సామర్థ్యం రెండు లక్షల లీటర్లు. మరో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీని ఇటీవలే తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద ప్రారంభించాం. పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా పూర్తిచేసి దానిని అచరణలోకి తీసుకొచ్చేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు అవసరమైన బల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒకవైపు మౌలిక సదుపాయాలు సమకూర్చుతూనే మరోవైపు పాడి ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతు కుటుంబాలకు అవగాహన కల్పిస్తూ ఇంటికో పాడి పశువు ఉండాలన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇంటికి పాడి ఆవు ఉండడం వల్ల విపత్కర పరిస్థితుల్లోనూ కుటుంబానికి ఎలా ఆదాయం సమకూరుతుందన్న విషయాన్ని వివరిస్తున్నాం. దీంతో చాలా మంది రైతులు ముందుకొస్తున్నారు. ఆ దిశగా పాడిపశువులను అందించేందుకు అనువుగా ఉన్న అన్ని మార్గాలనూ అందిపుచ్చుకొని పాడి రైతులకు అందే విధంగా డెయిరీ నుంచి చర్యలు తీసుకుంటున్నాం.

నమస్తే : ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తే.. వాటి విక్రయానికి మార్కెట్ సౌకర్యం ఉందా? అంత డిమాండ్ మార్కెట్‌లో ఉందంటారా?
చైర్మన్: ఐదు లక్షలు కాదు.. మరో ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తిచేసినా మన రాష్ట్రంలో వాటిని విక్రయించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక్క హైదరాబాద్‌లో రోజుకు 20 నుంచి 25 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంటే.. ఇందులో 75 శాతం పాలు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్నవే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. మన రాష్ట్రంలో మన పాలు అనే నినాదంతో ముందుకెళ్లాలి అంటే.. ముందుగా వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా పాల ఉత్పత్తి జరగాలి. అందుకే ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. అంతేకాదు, మన రాష్ట్రంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపోయేంత పాలు లేకపోవడం వల్లే ఇతర ప్రాంతాల పాలు కొనుగోలు చేస్తున్నారే తప్ప మరో ఉద్దేశం ఈ ప్రాంత వాసులకు కూడా లేదు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడం వల్ల మన రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకడమేకాదు, రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

నమస్తే : పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలకు స్పందన ఎలా ఉంది?
చైర్మన్: ఈ విషయంలో కరీంనగర్ డెయిరీ దేశంలోని అన్ని డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. పాడి ఉత్పత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో వినూత్న పథకాలకు అంకురార్పరణ చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఉదాహరణకు జనశ్రీ బీమా పథకం, ఉత్తమ ప్రతిభ చూపిన రైతు బిడ్డలకు స్కాలర్‌షిప్‌లు, కల్యాణమస్తు పథకం, దహన సంస్కారాల ఖర్చులు, పాలనిధి, పశువు చనిపోతే తక్షణ సాయం, పశు దాణాపై సబ్సిడీ, పాల ఉత్పత్తిని పెంచేందుకు కావాల్సిన కాల్షియం విటమిన్ ముందులను వచ్చిన ధరకే ఇవ్వడం, రైతు ముంగిట్లోకి పశువైద్యం వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. ఇంకా మున్ముందు మరిన్ని అమలు చేస్తాం.

నమస్తే : కరీంనగర్ డెయిరీ పాలతోపాటు స్వీట్లు అమ్ముతోంది. మార్కెట్ నుంచి వస్తున్న స్పందన?
చైర్మన్: ప్రస్తుతం మార్కెట్‌లో పాల సేకరణకు మించి డిమాండ్ ఉంది. చాలా సందర్భాల్లో మేం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పాలను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. అంటే కరీంనగర్ డెయిరీపై వినియోగదారులకు ఉన్న నమ్మకం అలాంటిది. మార్కెట్‌లో ఎన్నో రకాల పాలు వస్తున్నా.. కరీంనగర్ డెయిరీ పాలను ఆదరిస్తున్నారు. వినియోగదారుల నమ్మకం అనుగుణంగానే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా మార్కెట్‌కు అందిస్తున్నాం. పాలతో పాటు డెయిరీ తయారు చేస్తున్న దూద్‌పేడా, బటర్‌మిల్క్, కప్పులతో కూడిన పెరుగు, మ్యారేజ్ టబ్స్, పన్నీర్, టిన్స్‌లో నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్, మలాయి లడ్డూ, కర్జురా కోవ లాంటి వాటి విషయంలోనూ వినియోగదారులనుంచి మంచి స్పందన ఉంది. మున్ముందు మరిన్ని కొత్త రకం పదార్థాలను మార్కెట్‌లోకి తెస్తాం.

89

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles