ప్రతి మొక్కనూ బతికించాలి

Thu,July 4, 2019 04:41 AM

- జిల్లాలో స్వచ్ఛ హరిత గ్రామాలకు బహుమతులు
- మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలి
- రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
- రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
- నాలుగు అంశాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
- పాల్గొన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హరితహారాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనీ, పచ్చదనం పెరగాలంటే, నాటిన ప్రతి మొక్కనూ బతికేలా చూడాల్సిన అవసరముందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కొప్పుల ఈశ్వర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనంలో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. హరితహారం, మిషన్ భగీరథ, రైతుబంధు, ఎరువులు, విత్తనాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.

స్వచ్ఛ హరిత గ్రామాలకు బహుమతులు
తొలి అంశంగా హరితహారంపై మంత్రి ఈశ్వర్ వివరాలు సేకరించారు. జిల్లాలో 2.74 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామనీ, ఇందుకోసం జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు సిద్ధం చేశామన్నారు. లక్ష్యం కంటే అధికంగా 2.87కోట్ల మొక్కలు సిద్ధం చేశామన్నారు. ఉపాధి హామీ కింద మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నామనీ, ఇప్పటి వరకు 98లక్షల గుంతలు తవ్వేందుకు అనుమతులు పొందామనీ, 45 లక్షలకు పైగా గుంతలు తీయించామనీ, గుంతలు తవ్వే ప్రక్రియల్లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందనీ డీఆర్‌డీఏ, అటవీశాఖ అధికారులు తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ నాటిన మొక్కల్లో 56 శాతం మాత్రమే బతుకుతున్నాయనీ, ఇది బాధాకరమన్నారు. మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాల లభ్యత అతిపెద్ద ఇబ్బందికర అంశంగా తయారైందన్నారు. గ్రామాల వారీగా నాటిన మొక్కలను రక్షించుకునే ప్రణాళికలు సిద్ధం చేయించాలనీ, ప్రజాప్రతినిధులు, అధికారులను బాధ్యులను చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మొక్కల పెంపకాన్ని బాధ్యతాయుతమైన అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆగస్టు చివరి నాటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎస్సారెస్పీ కాలువ దాదాపు 80 కిలోమీటర్ల పొడువున ఉందనీ, అనేక డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయనీ, వాటి పక్కన ప్రభుత్వ స్థలం ఉందనీ, అక్కడ పెద్ద సంఖ్యలు మొక్కలు నాటాలనీ, ఈ మేరకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎస్సారెస్పీ అధికారులు, ఉపాధి హామీ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో ముదిరాజ్ సొసైటీల సభ్యులను గుర్తిం చి, వారికి సీతాఫలాల వంటి మొక్కలు ఉపాధి హామీ పథకం కింద నాటుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామా న్నీ, ఒక పట్టణాన్ని స్వచ్ఛ హరిత పంచాయతీగా, పట్టణంగా ఎంపిక చేసి అవార్డులు అందిస్తామని తెలిపారు. అభివృద్ధి చెందిన గ్రామాలంటే, అంకాపూర్, గంగదేవిపల్లి మాత్రమే కాదనీ, మన జిల్లాలోని గ్రామాలు సైతం అలా తయారు కావాలని ఆకాంక్షించారు.

అనుకున్న స్థాయిలో లేవు..
మిషన్ భగీరథ పనులపై మంత్రి సమీకిస్తూ మిషన్ భగీరథ పనులు జిల్లాలో అనుకున్న స్థాయిలో జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఇంటింటికీ మంచినీరిచ్చే విషయంలో ఎప్పటికప్పుడు లక్ష్యం పెట్టుకోవడం, తర్వాత పొడగించుకోవడం జరుగుతున్నదన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ ద్వారా బల్క్‌వాటర్ వస్తున్నా ఇంటింటికీ నల్లా ద్వారా నీరు రావడం లేదన్నారు. గత వేసవిలో బల్క్‌వాటర్ ప్రతి గ్రామానికీ రావడం వల్ల మంచినీటి ఇబ్బందులు రాలేదన్నారు. చాలా చోట్ల పైప్‌లైన్లు అమర్చే పని జరగడం లేదనీ, ఏజెన్సీలు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అధికారులు మాట్లాడుతూ మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికీ బల్క్ వాటర్ అందిస్తున్నామని తెలిపారు. పైప్‌లైన్ కేజేడీ పరిధిలో పూర్తయిందని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ వరకు ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరందించాలని మంత్రి ఆదేశించారు. సారంగాపూర్‌ను వందశాతం మిషన్ భగీరథ పూర్తయిన గ్రామంగా ఈ నెల చివరి నాటికి ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వందశాతం మిషన్ భగీరథ పూర్తయిన మండలాలుగా ప్రకటించేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు.

అన్నీ అపోహలే..
రైతుబంధు పథకంపై మంత్రి మాట్లాడుతూ ఈ పథకంపై రైతుల్లో అనేక అపోహలు వస్తున్నాయనీ, పథకం మార్గదర్శకాలు మారుస్తారని, ఐదెకరాల భూమికి మించి ఉన్న వారికి పెట్టుబడి రాదని అనుకుంటున్నారనీ, ఇది సారికాదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకసారి పథకాన్ని అమలు చేసిన తర్వాత వెనక్కి చూసుకునేది కాదన్నారు. వానాకాలం సీజన్‌కు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారా? అని అధికారులను ప్రశ్నించారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నారు?, ఎంత మొత్తంలో వేస్తున్నారు?, వారికి ఎలాంటి విత్తనాలు అవసరం?, ఎంత మొత్తంలో ఎరువులు అవసరం? తదితర వివరాలు సేకరించి, అందుకు తగ్గట్టు స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయాధికారులు మాట్లాడుతూ, జిల్లాలో 2.46 లక్షల మంది రైతులున్నారనీ, వారిలో 1,85,630 మందికి రైతుబంధు పథకం మంజూరైందని పేర్కొన్నారు. రైతులకు రూ.121 కోట్లు బ్యాంకుల్లో జమయ్యాయనీ, మరో రూ.76కోట్లు త్వరలోనే జమవుతాయని పేర్కొన్నారు. 1,35,630 లక్షల మందికి రైతుబంధు నగదు ఖాతాల్లో జమైందనీ, మిగిలిన వారికి త్వరలోనే జమ చేస్తామని చెప్పారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయ న్నారు. వరి విత్తన విషయంలో ఇబ్బందులు లేవనీ, పత్తికి సంబంధించి కంపెనీల విషయంలో అపోహలున్నాయనీ, జిల్లాలో పత్తిపంట పెద్దగా లేకపోవడంతో సమస్యలు లేవని పేర్కొన్నారు.

మిషన్ భగీరథపై శ్రద్ధ వహించాలి : ఎమ్మెల్యే కల్వకుంట్ల
సమీక్షలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ మిషన్ భగీరథపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాలకు బల్క్ వాటర్ అందినా పట్టణాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ట్యాంకుల నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారనీ, వేసవిలో ట్యాంకర్ల ద్వార కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో నీటిని సరఫరా చేశామనీ, ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇంటింటికీ నల్లా నీటిని ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి పేరొస్తుందనీ, లేదంటే ప్రజలు బద్నాం చేస్తారనీ, అధికారులు శ్రద్ధగా పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో భగీరథ అమలుపై కలెక్టర్, మంత్రి దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.

విజయవంతం కావడం లేదు : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
హరితహారం కార్యక్రమం అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. మానవులు చేపట్టే ప్రాజెక్టుల్లో అతిపెద్దది ఇదే అని చెప్పక తప్పదన్నారు. ముందుచూపు లేక పర్యావరణం దెబ్బతింటున్నదనీ, వేసవిలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది మన జిల్లాలోనే కావడం బాధాకరమన్నారు. హరితహారం విజయవంతానికి అన్ని చర్యలు తీసుకున్నా ఫలితం దక్కడం లేదన్నారు. గతంలో అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కవడం వల్లే నేడు అడవులు అంతరించి పోయే పరిస్థితి నెలకొందన్నారు. రాయికల్ పట్టణంలో నీటి ఎద్దడి తీవ్రంగానే ఉందని చెప్పా రు. జగిత్యాల పట్టణానికి బల్క్ వాటర్‌తో ఇబ్బందులు తప్పాయని చెప్పారు. బీర్‌పూర్ మండలం రంగసాగర్‌లో వాటర్ ట్యాంక్ సరిగా లేదనీ, దాన్ని పరిశీలించే మెట్లు కూడా సరిగా లేవనీ వాటిని బాగు చేయాలనీ, విత్తనాల విషయంలో రైతులు కొంత నారాజ్‌గా ఉన్నారనీ, రైతులు కోరుకుంటున్న కంపెనీ విత్తనాలు అధికారుల వద్ద స్టాక్ ఉన్నాయా? లేదంటే మన వద్ద ఉన్న విత్తనాల నాణ్యతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారా? అన్న విషయం అర్థం కావడం లేదన్నారు.

డబ్బా నుంచి నీరివ్వాలి : ఎమ్మెల్యే రమేశ్‌బాబు
మిషన్ భగీరథ పూర్తిస్థాయిలో విజయవంతం కావడం లేదనీ, బల్క్ వాటర్ విషయంలో పరిస్థితి బాగానే ఉన్నా, నల్లాల ద్వారా నీరు రావడం లేదని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. మేడిపల్లి మండలానికి రుద్రవరం నుంచి నీరిచ్చేందుకు ప్రణాళిక రూపొందించారనీ, కానీ, మేడిపల్లికి ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి నీరిస్తే బాగుటుందనీ, అధికారులు, మంత్రి దీనిపై దృష్టి సారించాలని కోరారు. మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో హరితహారం కింద ఎక్కువ చెట్లు పెంచేందుకు అవకాశాలున్నాయనీ, అధికారులు గుర్తించాలన్నారు.

అధికారులకు అభినందనలు : ఎమ్మెల్యే రవిశంకర్
హరితహారం, మిషన్ భగీరథ పనులు వేగవంతంగా చేస్తున్న అధికారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందనలు తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో కొడిమ్యాల, మల్యాల మండలాల్లో మిషన్ భగీరథపై పన్నెండుమార్లు సమీక్ష నిర్వహించామనీ, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. హరితహారం సైతం జోరుగా జరిపేందుకు అవకాశాలున్నాయన్నారు. అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించి అన్ని కార్యక్రమాలనూ విజయవంతం చేయాలన్నారు.

కొత్త పంచాయతీ చట్టం ప్రకారం క్లీన్ అండ్ గ్రీన్ : కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 2018- పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో క్లీన్ అండ్ గ్రీన్ పథకాన్ని అమలు చేసే పనిలో భాగంగా జిల్లాలో స్వచ్ఛ హరిత గ్రామాలు, పట్టణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కలెక్టర్ శరత్ తెలిపారు. కొత్త చట్టం ప్రకారం గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మురుగునీటి పారుదల సౌకర్యం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, చెత్తను పారవేసేందుకు డంప్ యార్డు, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు, వాటిని రక్షించే బాధ్యతను గ్రామానికి, గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులకు అందజేస్తామన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన గ్రామాన్ని సీఎం స్వచ్ఛ హరిత గ్రామంగా గుర్తిస్తామన్నారు. మండల స్థాయిలో గుర్తించిన తర్వాత జిల్లా స్థాయిలో ఉత్తమమైన వాటిని గుర్తించి అవార్డులు అందిస్తామన్నారు. మిషన్ భగీరథ పనులు వేగంగానే సాగుతున్నా యని చెప్పారు. రైతులకు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామ న్నారు. అటవీశాఖ, డీఆర్‌డీఏ సమన్వయంతో ఆగస్టు నాటికి హరితహారాన్ని పూర్తి చేస్తామ న్నారు.

పోడు భూముల ఇబ్బందులు రాకుండా చూడండి : మంత్రి
మిషన్ భగీరథ కింద ప్రతి పాఠశాలకూ, వసతి గృహానికీ, ఆలయాలకు నీటి కనెక్షన్లు ఇవ్వాలని మంత్రి ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు సామూహికంగా ఉండే చోట్ల నీటి వసతి ఉండాల్సిన అవసరముందన్నారు. ధర్మపురి తమ్మళ్లకుంట చెరువు, కోనేరు, చింతామణి చెరువు వద్ద నీటి కొళాయి ఉండాలన్నారు. ఇక పోడు భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులూ ఉండరాదనీ, అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జేసీ రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, ఆర్డీవో ఘంటా నరేందర్, ఏపీడీ శ్రీలతారెడ్డి పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles