పునర్జీవంతోనే ఎస్సారెస్పీకి జలకళ

Thu,July 4, 2019 04:40 AM

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ/ మల్యాల/ ఇబ్రహీంపట్నం: ప్రభుత్వం చేపట్టిన పునర్జీవం పథకంతోనే ఎస్సారెస్పీకి తిరిగి జలకళ వస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్ పనులను చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అంతకు ముందు మంత్రి వేముల కోరుట్ల, వేములవాడ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. రాంపూర్ పంప్‌హౌస్ వద్ద మంత్రులు మాట్లాడుతూ జూన్ 4న సీఎం కేసీఆర్‌తో కలిసి పర్యవేక్షించిన సందర్భంలో రాంపూర్‌లో ఒక మోటర్ బిగింపు మాత్రమే పూర్తయిందనీ, జూలై 15నాటికి ఐదు మోటర్ల బిగింపు పూర్తిచేసి 0.6టీఎంసీల నీటిని తోడేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాంపూర్ పంప్‌హౌస్‌లో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మే 30న మొదటి మోటర్, జూన్ 22న రెండో మోటర్, జూన్ 30న మూడో మోటర్ బిగింపు జరిపారనీ, జూలై 10లోపు నాలుగో మోటర్, జూలై 15లోపు ఐదో మోటర్ బిగించి ట్రయల్ రన్ పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాదంతా వరద కాలువ జీవనదిలా మారి ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.

కేవలం 50ఎకరాల్లోపు మాత్రమే భూ సేకరణ జరిపి ప్రాజెక్టు పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అనీ, పునర్జీవ పథకం పూర్తయితే అటు కాకతీయ, సరస్వతీ కాలువలతో పాటు వరద కాలువ సైతం నిండు కుండల్లా మారుతాయన్నారు. ఆగస్టు చివరి నాటికి పంప్‌హౌస్ పనులను పూర్తి చేసి 8మోటర్లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌కుమార్, ఆర్థిక సంఘం చైర్మన్ గొడిశెల రాజేశంగౌడ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్, ఎంపీపీలు తైదల శ్రీలత, గంగారాం, జడ్పీ సభ్యుడు కొండపలుకుల రామ్మోహన్ రావు, రాంపూర్ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఓరుగంటి రమణా రావు, మిట్టపెల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, అయిల్నేని కోటేశ్వర్ రావు, జనగాం శ్రీనివాస్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, గడ్డం మల్లారెడ్డి, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు సుధాకర్ రెడ్డి, సుధాకిరణ్, శ్రీకాంత్ రావు, రాంప్రదీప్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రాఘవచారి, ఈఈ శ్రీనివాస్ రావు, డీఈ సత్యనారాయణ, జేఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

చెరువులు నింపాలని వినతి
పంప్‌హౌస్ నిర్మిస్తున్న రాంపూర్‌లో ఊరి చెరువులను సైతం మోటర్లతో నింపాలని కోరుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డికి స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి విన్నవించారు. పంప్‌హౌస్ నిర్మాణం కోసం తమ గ్రామ రైతులు అధికారులు అడిగిన వెంటనే 24గంటల్లోపు భూ సేకరణకు సహకరించడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి సైతం తమవంతు సహకారాలను అందజేస్తున్నారన్నారు. తమ గ్రామంలో గుర్తింపు పొందిన పంప్‌హౌస్ నిర్మిస్తున్నారనీ, పాత, కొత్త, లంబాడికుంట చెరువులను వరద కాలువ నీటితో నింపేలా తూములను లేదా మోటర్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు. సంబంధిత అధికారులను పరిశీలించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

ఎమ్మెల్యే సంజయ్‌పై మంత్రి చలోక్తులు
పంప్‌హౌస్ పనులను పరిశీలిస్తున్న సందర్భంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన కళ్లు ఎర్రబడ్డాయని నేత్ర వైద్యుడైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చూడాలంటూ చలోక్తులు విసిరారు. ఇందుకు సంజయ్‌కుమార్ సమాధానమిస్తూ కళ్లు బాగానే ఎర్రబడ్డాయి, రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేయడంతో నిద్ర లేకపోవడం వల్ల కళ్లు ఎర్రబడ్డాయనడంతో అక్కడున్న వారంతా కాసేపు నవ్వుకున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles