వేగానికి ఇక కళ్లెం..!

Wed,July 3, 2019 03:03 AM

జగిత్యాల క్రైం : మితిమీరిన వేగంతో రయ్ రయ్‌మంటూ వెళ్లే వాహనదారులకు ఇక కళ్లెం పడనుంది. ఇకపై జిల్లాలోని రహదారులపై పోలీసులు స్పీడ్‌గన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పరిమితికి మించి వెళ్లే వారికి భారీ జరిమానాలు పడనున్నాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ సింధూశర్మ స్పీడ్ లేజర్‌గన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివేగతంతో వెళ్లే వాహనాలను స్పీడ్‌గన్ సహాయంతో గుర్తించి వాహనదారులకు జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. అతివేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీడ్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక స్పీడ్‌గన్ 160 మీటర్లదూరంలో ఉన్న వాహనాల వేగాన్ని సులభంగా గుర్తిస్తుందని చెప్పారు. వేగాన్ని కొలిచి అతివేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్, వాహనాన్ని ఫొటోలు తీస్తుందని, వాటి ఆధారంగా వాహనదారుల చిరునామాలకు ఈ-చలాన్‌ను జారీ చేస్తామన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, పంచాయతీ రోడ్లపై వేగం పరిమితి మేరకు అనుగుణంగా స్పీడ్‌గన్స్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ఆర్మీ లెఫ్టినెంట్ భరత్ వంశీ, మేజర్ అజీముద్దీన్ స్పీడ్‌గన్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, టౌన్ సీఐ ప్రకాశ్, ట్రాఫిక్ ఎస్‌ఐ ఆరోగ్యం, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles