జోరుగా.. హుషారుగా..

Tue,July 2, 2019 03:28 AM

-ఉత్సాహంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
-లక్ష్యంతో ముందుకెళ్తున్న నాయకులు
-గడపగడపకూ తిరుగుతున్న కార్యకర్తలు
-కోరుట్లలో పాల్గొన్న మంత్రి కొప్పుల
-జగిత్యాల, మెట్‌పల్లిలో ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, రూప్‌సింగ్
అధికార టీఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లాకు ముగ్గురు నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారు. గత నెల 27న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేతుల మీదుగా సభ్యత్వాలు స్వీకరించారు. మరుసటి రోజు 28న జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 29న సిరిసిల్లలో, మంత్రి ఈటల రాజేందర్ గత నెల 29న కరీంనగర్‌లో, 30న హుజూరాబాద్‌లో, మంత్రి కొప్పుల ఈశ్వర్ 29న కరీంనగర్ జిల్లాకేంద్రంలో ధర్మపురికి సంబంధించి సభ్యత్వ నమోదును షురూ చేశారు. ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో నమోదును చేపట్టారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు జోరుగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు ఆయా చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.

కరీంనగర్ జిల్లా..
సోమవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్, సీనియర్ నాయకుడు గడ్డం చుక్కారెడ్డి, తదితరులు సభ్యత్వ నమోదు చేపట్టారు. చాలా మంది కార్యకర్తలు తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోగా కొత్తగా మరికొంత మంది టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 60 వేల సభ్యత్వాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. సైదాపూర్‌లో జడ్పీ ఉపాధ్యక్షుడు పేరాల గోపాల్‌రావు కూడా సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. మండల కేంద్రంలో లక్ష్యానికి మించి సభ్యత్వాలు సేకరించాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను కోరారు. అలాగే గన్నేరువరంలో లో బెజ్జంకి జడ్పీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు శరత్‌రావు సభ్యత్వ నమోదు ప్రారంభించారు.

జగిత్యాల జిల్లా..
కోరుట్లలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతి త్వరలోనే కోటి మంది కార్యకర్తల సమాహారంగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల విశ్వాసం చూరగొన్న టీఆర్‌ఎస్‌ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మార్చేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయాలను కార్యకర్తలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శిక్షణ కేంద్రాలుగా పనిచేసేలా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కేంద్రాల ద్వారా ప్రజలకు కార్యకర్తలు, నాయకులు మరింత చేరువవువుతారన్నారు. ఇటు జగిత్యాల ఎల్‌జీ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జగిత్యాల, కోరుట్ల సభ్యత్వ నమోదు పరిశీలకుడు రూప్‌సింగ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. రూప్‌సింగ్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదును 10 రోజుల్లో పూర్తి చేయాలనీ, నామినీ పేరుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గానికి కూడా 50వేల టార్గెట్ ఇచ్చారనీ, వాటిని పూర్తి చేస్తామన్నారు. మెట్‌పల్లిలో నిర్వహించిన సభ్యత్వ నమెదుకు రూప్‌సింగ్‌తో కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని మాట్లాడారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

సిరిసిల్ల జిల్లా..
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆధ్వర్యంలో వేమువాడలో జరిగిన సభ్యత్వనమోదుకు జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకభాపురెడ్డి, ఉమ్మడి జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ పాల్గొని వెయ్యి క్రియాశీల సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడారు. నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసిన ప్రతికార్యకర్తకూ గుర్తింపు లభిస్తుందన్నారు. గంభీరావుపేట మండలంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మండల శాఖ అధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావుతో కలిసి నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 600 మందికి క్రియాశీలక, వెయ్యి సాధారణ సభ్యత్వాలు చేయించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పార్టీ అధికార ప్రతినిధి తోట ఆగయ్య, మండల శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి క్రియాశీల, వెయ్యి సాధారణ సభ్యత్వాలు చేయించారు. ముస్తాబాద్ మండలంలో జడ్పీటీసీ శరత్‌రావు, ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సహకార సంఘాల చైర్మన్లు చక్రధర్‌రెడ్డి, బాపురావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు కలిసి ఊరూరా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. 200 క్రియాశీల, 300 సాధారణ సభ్యత్వాలు చేయించారు.

పెద్దపల్లి జిల్లా..
గోదావరిఖనిలోని విశ్వం ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీబీజీకేఎస్ నేతలు, 34వ డివిజన్ ప్రజలకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. అలాగే అంతర్గాంలో మండల కేంద్రంలోనూ నిర్వహించారు. ఇక ధర్మారం మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి నేతృత్వంలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలు గ్రామాల్లో పర్యటించారు. ఖానంపల్లిలో మోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి దొంగతుర్తి ఎంపీటీసీ దాడి సదయ్య, ధర్మారంలో ఇన్‌చార్జి పూస్కూరు రామారావు, పత్తిపాక, నాయకంపల్లిలో ఇన్‌చార్జి జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, చామనపల్లి, కొత్తపల్లి (న్యూ)లో ఇన్‌చార్జి మూల మల్లేశం, గోపాల్‌రావుపేటలో ఇన్‌చార్జి ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, కటికెనపల్లిలో ఇన్‌చార్జి కోరుకంటి స్వామి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేశారు. ఓదెల మండలం ఇందుర్తిలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆకుల మహేందర్ నిర్వహించారు. రామగుండం ఒకటో డివిజన్ ఆబాదిరామగుండం గ్రామంలో కార్పొరేటర్ బద్రిరజిత ఆధ్వర్యంలో 100 మంది రైతులు, యువకులు సభ్యత్వం తీసుకున్నారు. అలాగే పాలకుర్తి మండలం ముంజంపల్లిలో పాలకుర్తి నూతన ఎంపీపీ వ్యాల అనసూర్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వనమోదు చేపట్టారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో నూతన ఎంపీపీ బాలాజీరావు పర్యటించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు వీరగోని సుజాత నివాసంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్రెపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, నర్సయ్యపల్లి సర్పంచులకు అక్కడే క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు.

గొల్లపల్లి: కుల మతాలకు అతీతంగా కల్యాణ లక్ష్మి, షాదిముభారక్ పథకాలను అమలు చేస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొల్లపల్లిలో 86 మంది లబ్ధ్దిదారులకు రూ. 82,85,860 విలువైన చెక్కులను అందజేశారు. ఇందులో 74 మందికి రూ.1,00,116 చెక్కులు ఇవ్వగా, 11 మందికి 75,116, ఒక్కరికీ రూ. 51,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజే శం, తాసిల్దార్ లకా్ష్మరెడ్డి, ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ గోస్కుల జలేందర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య, సర్పంచి ముస్కు నిషాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, విండో అధ్యక్షుడు నారాయణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు లింగా రెడ్డి, సర్పంచి గం గా రెడ్డి, నాయకులు హన్మాండ్లు, లింగా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles