ఫలితం నేడే

Thu,May 23, 2019 12:35 AM

-నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు పూర్తయిన ఏర్పాట్లు
-మొదట 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
-8.30 గంటల నుంచి ఈవీఎంలు
-ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు వీవీ ప్యాట్స్ కౌంటింగ్
-రౌండ్ల వారీగా రిజల్ట్స్.. ఆలస్యమయ్యే అవకాశం
-సువిధ యాప్‌లోనూ ఫలితాలు
-కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
-అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

కరీంనగర్/నిజామాబాద్/ జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ;దేశవ్యాప్తంగా ఈ సారి ఏడు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికలు తొలి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ ముగియగా, ఫలితాలు 42రోజుల తర్వాత నేడు వెలువడనున్నాయి. నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి బోర్లకుంట వెంకటేశ్ నేత బరిలో ఉన్నారు.

నిజామాబాద్ బరిలో 185మంది
ఎన్నో ప్రత్యేకతలతో కూడి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నది. ఉదయం 6 గంటలకే డిచ్‌పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ) స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు చేర్చుతారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపును చేపడతారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహిస్తారు. మొదటి రౌండ్‌కే ఎక్కువ సమయం తీసుకోనున్నారు. దాదాపు గంటన్నర తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత అన్నీ సర్దుకొని కౌంటింగ్ ప్రక్రియ త్వరితగతిన చేపట్టనున్నారు. మిగిలిన స్థానాల మాదిరే ఇక్కడా సరైన సమయానికే ఫలితాలు వస్తాయని అధికార యంత్రాంగం భావిస్తున్నది. 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా కలెక్టర్ ప్రతిపాదనతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ టేబుళ్ల సంఖ్యను రెట్టింపు చేసింది.

36 కౌంటింగ్ టేబుళ్లతో అనుకున్న సమయానికే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ టేబుళ్ల సంఖ్య పెరగడంతో రౌండ్ల సంఖ్య కూడా సగానికి తగ్గిపోయింది. నిజామాబాద్ అర్బన్‌లో 8 రౌండ్లు, నిజామాబాద్ రూరల్‌లో 8 రౌండ్లు, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో 8 రౌండ్ల చొప్పున, బాల్కొండ 7 రౌండ్లు, ఆర్మూర్ 6 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గానికి ఐదు పోలింగ్ స్టేషన్ల వీవీ ప్యాట్లను ర్యాండమ్‌గా ఎంచుకొని వాటిని లెక్కిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు సెగ్మెంట్లు నిజామాబాద్ జిల్లాలో ఉండగా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లాలోని వీఆర్కే కాలేజీలో నిర్వహిస్తున్నారు.

రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే సమయంలో నిజామాబాద్ పరిధిలోని ఐదు నియోజవర్గాల ఫలితాలతో పాటు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఫలితాలు కలుపుకొని ఇక్కడే ఒకే చోట మొత్తం ప్రకటిస్తారు. దీంతో రౌండ్ రౌండ్‌కు ఓటరు తీర్పుపై ట్రెండ్స్ తెలిసిపోతాయి. మధ్యాహ్నం సమయానికే తీర్పు ట్రెండ్స్ తెలిసిపోనుండగా.. సాయంత్రం ఐదు గంటల వరకు ఓ స్పష్టత రానుంది. రాత్రి 9లోగా అధికారికంగా ఫలితాలు వెల్లడించే వీలుంది. కాగా, ఇప్పటికే కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్నీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం కౌంటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. నియోజకవర్గాల వారీగా అబ్జర్వర్లను నియమించారు.

రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు టేబుల్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, లైన్ ఆఫీసర్లు తదితరులు మొత్తం 700 మంది వరకు సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీపీ ఒకరు, అదనపు డీసీపీ ఒకరు, ఏసీపీలు 12 మంది, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు 26 మంది, సబ్ ఇన్‌స్పెక్టర్లు 89 మంది, ఏఆర్, సివిల్ సిబ్బంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు 1,108 మంది, హాంగార్డులు, మహిళా హాంగార్డులు 310 మొత్తం 1,547 మందిని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ బందోబస్తు కోసం నియమించారు.

కరీంనగర్‌కు 15మంది
కరీంనగర్ లోక్‌సభకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా మొత్తం 15 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కరీంనగర్‌లోని ఎస్సారార్ పీజీ, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరిచారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, నియోజకవర్గాలవారీగా కౌంటింగ్ చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 14 చొప్పున 98 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 3 టేబుళ్లు, ఈ- పోస్టల్ బ్యాలెట్‌కు మరో 2 చొప్పున మొత్తం 103 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరగంటకొక రౌండ్ పూర్తి చేయాలని అనుకుంటున్నా, ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్ల లెక్కింపు నిర్ణయించారు.

ఇందులో 390 పోలింగ్ కేంద్రాలున్నా కరీంనగర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 28 రౌండ్లు లెక్కింపు జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. 327 పోలింగ్ కేంద్రాలున్న చొప్పదండిలో 24 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. కౌంటింగ్ కోసం ఒక రిటర్నింగ్ అధికారి, ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతోపాటు 379 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 130 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 121 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 128 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, మొత్తం ముగ్గురు సిబ్బందిని నియమించారు. గురువారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్ అధికారి, పరిశీలకులు ర్యాండమైజేషన్ ద్వారా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు సిబ్బందిని కేటాయిస్తారు. నేటి ఉదయం 7 గంటల వరకు తపాలా శాఖ ద్వారా కౌంటింగ్ కేంద్రానికి చేరే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకున్నా 8.30 గంటల నుంచి ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు మొదలు పెడుతారు.

ఫలితాలు ఆలస్యం..
సాధారణంగా ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉండేది. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు వీవీ ప్యాట్స్‌ను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి స్లిప్పులను తప్పని సరిగా లెక్కించాల్సి ఉంది. పార్లమెంట్ పరిధిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 5 చొప్పున ఏడు శాసనసభా నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 35 వీవీ ప్యాట్స్‌ను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఎంపిక చేసి, వాటిలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌లోని సిప్పులను లెక్కించేందుకు కనీసం గంట సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే కనీసం 5 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా, ఎంపిక చేసిన వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పులకు, ఈవీఎంలలోని ఓట్లకు సరిపోలని పక్షంలో అప్పటికప్పుడు రీ కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది.

అయినా సరిపోలని పక్షంలో వీవీ ప్యాట్స్‌లోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకోనుండగా, దీనికి మరింత అదనపు సమయం పడుతుంది. మొత్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి కానున్న ఫలితాలు మరో ఐదు గంటల వరకు ఆలస్యం అయ్యే అవకాశమున్నది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే 144 సెక్షన్ విధించారు. లెక్కింపు కేంద్రం, పరిసర ప్రాంతాల్లో 40 సీసీ కెమెరాలు, 3 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నేటి ఉదయం 5 గంటల నుంచే జగిత్యాల మార్గంలో రోడ్డు డైవర్షన్ చేశారు. ఇటు వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కనీసం 400 మంది పోలీసులు రక్షణగా ఉండనున్నారు. సీపీ పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ డీజీపీలు, 10 మంది ఏసీపీలు, 21 మంది ఇన్‌స్పెక్టర్లు, 75 మంది ఎస్‌ఐ స్థాయి అధికారులతోపాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles