విద్యాసంస్థల బస్సులు తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించుకోవాలి

Thu,May 23, 2019 12:33 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన స్కూలు బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి ఎం.కిషన్‌రావు తెలిపారు. బుధవారం కిషన్‌రావు విలేకరులతో మాట్లాడారు. గత విద్యా సంవత్సరంలో బస్సులకు సంబంధించి జారీ చేసిన ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాల గడువు మే 15వ తేదీ వరకు ముగిసిందన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరానికి విద్యాసంస్థలకు చెందిన వాహనాలన్నీ తప్పనిసరిగా ఆర్‌టీఏ అధికారుల వద్దకు తీసుకువచ్చి ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. వాహనాలు తెచ్చే ముందు నిబంధనలు సరిచూసుకోవాలన్నారు. విద్యాసంస్థల బస్సులకు పసుపు రంగు, స్కూల్ పేరు తప్పనిసరిగా రాయించాలన్నారు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సు, బ్రేకులు, నిర్ణీత నిబంధనల ప్రకారం వాహనానికి లైట్స్, ఇండికేటర్స్, వైపర్లు, నిబంధనల ప్రకారం సరైన కండిషన్ టైర్లు, బస్సులకు బటన్ టైర్లు కాకుండా కండిషన్/కొత్త టైర్లు ఉండాలన్నారు. బస్సులో కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌పోర్టు తెలంగాణ వెబ్‌సైట్‌లో విద్యా సంస్థల లాగిన్ ఉంటుందనీ, వాటిలో వాహనానికి విద్యాసంస్థ, యజమాని పేరు, హోదా, చిరునామా, వాహన రిజిస్ట్రేషన్ నంబరు, సెల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలన్నారు. అనంతరం రవాణా అధికారులు ఒక యూజర్ ఐడీ పాస్‌వర్డు ఇస్తారనీ, వీటిలో విద్యాసంస్థల బస్సుల వివరాలు నమోదు చేయాలన్నారు. విద్యా సంస్థల బస్సు డ్రైవర్, అటెండర్ పేర్లు, చిరునామా ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. జూన్ 30లోగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలనీ, బస్సు నడిపే డ్రైవర్ ఫొటోను డ్రైవర్ వెనుకవైపు అతికించాలని సూచించారు. బస్సు ఫిట్‌నెస్ పరీక్షలు మాత్రం తప్పనిసరిగా ఈనెల 31లోగా పూర్తి చేసుకోవాలనీ, లేనిపక్షంలో బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles