సాగు ప్రణాళిక రెడీ

Tue,May 21, 2019 12:53 AM

జగిత్యాల టౌన్‌: జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ తెలుపడంతో రైతులు వానాకాలం పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేసి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో 1.21 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. జిల్లా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి, ఆ మేరకు అవసరమైన 22వేల క్వింటాళ్ల విత్తనాలు, 85 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటికే జిల్లాకు చేరిన పచ్చిరొట్ట విత్తనాలు, జనుము, జీలుగ, పెసర విత్తనాలను ఆగ్రోస్‌, సింగిల్‌విండో కేంద్రాలకు తరలించారు.

సాధారణానికి అదనం
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,14,495 హెక్టార్లు ఉండగా అదనంగా సుమారు 8వేల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశముంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధాన పంట అయిన వరిని అత్యధికంగా 46, 220 హెక్టార్లలో పండించే అవకాశముందనీ, 25,800హెక్టార్లలో మక్క, 10,300హెక్టార్లలో పత్తి, 14,200హెక్టార్లలో పసు పు, 2,370హెక్టార్లలో పెసర, 2,278 హెక్టార్లలో కంది, 2,500హెక్టార్లలో సోయాబీన్‌, 45హెక్టార్లలో చెరుకు, 35హెక్టార్లలో మినుము, 25హెక్టార్లలో అలచంద, 18వేల హెక్టార్లలో ఇతర ఆహార పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించారు.

22,602 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు
వానాకాలం సీజన్‌లో జిల్లాలో వివిధ పంటల సాగు కోసం దాదాపు 22,602 క్వింటాళ్ల రాయితీ విత్తనాలను రైతులకు సరఫరా చేయనున్నారు. ఇందులో వరి 8,193 క్వింటాళ్లు, మక్క హైబ్రీడ్‌ విత్తనాలు 500 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, కంది 50 క్వింటాళ్లు, మినుములు 39 క్వింటాళ్లు, జీలుగ 8000, జనుము 5000, సోయాబీన్‌ 620 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు 50 శాతం విత్తనాలను అందుబాటులో ఉంచారు. త్వరలోనే జనుము, జీలుగ విత్తనాలను పంపిణీ చేయనున్నారు.

85,355 మెట్రిక్‌ టన్నుల ఎరువులు
వానాకాంలో సాధారణ సాగుకు మించి పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించి 85,355 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 35,895 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 3,927 మెట్రిక్‌ టన్నుల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌, 16,229 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే దాదాపు 60 శాతం ఎరువులు జిల్లాలోని గోదాములకు చేరినట్లు తెలిపారు.

విత్తనాలు, ఎరువుల కోసం నివేదించాం
వానాకాలం పంట సాగు కోసం జిల్లాలో అంచనాలు రూపొందించి అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఈ ఏడాది సాధారణానికి మించి పంటలు సాగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు కాళేశ్వరం రివర్స్‌ పం పింగ్‌ సిస్టం ద్వారా నీరు పంటలకు అందించినట్లయితే మరింత సాగు పెరిగే అవకాశముంది.
-కృష్ణమోహన్‌, జిల్లా వ్యవసాయాధికారి

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles