గాజుల కోసం పోలీసుల వేట

Sat,May 18, 2019 01:13 AM

-శ్రీనివాస్ సన్నిహితులపై రహస్య విచారణ
-15 రోజుల క్రితమే అతడితోపాటు తమ్ముడిపై హైదరాబాద్‌లో కేసు
-ముందస్తు బెయిల్ తీసుకొని, మళ్లీ దందా..
-వెనుక నలుగురి హస్తం?
-లోతుగా విచారించాలని డిమాండ్
హుజూరాబాద్,నమస్తే తెలంగాణ/రూరల్: హుజూరాబాద్‌లో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న వ్యాపారి గాజుల శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అతడి కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో నకిలీ పత్తి విత్తనాలను ఎగుమతి చేస్తున్న డీసీఎం వ్యాన్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్న వెంటనే విషయం తెలుసుకున్న శ్రీనివాస్ పరారయ్యాడు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ హుజూరాబాద్ పట్టణంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అయితే నకిలీ విత్తనాల వ్యాపారాన్ని ఎప్పటి నుంచి చేస్తున్నాడు.?, ఎక్కడి నుంచి పత్తి గింజలను దిగుమతి చేసుకుంటున్నాడు..?, ఇక్కడ తయారు చేసిన ప్యాకెట్లను ఎక్కడికి ఎగుమతి చేస్తున్నాడు? అనే అంశాలతో పాటు ఇతడికి అక్రమ వ్యాపారంలో సహకరిస్తున్న వ్యక్తులపై పోలీసులు రహస్య విచారణ చేపట్టేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే కొంత మంది ఫర్టిలైజర్ వ్యాపారులతోపాటు సన్నిహితంగా మెదిగిన కొంత మందిని విచారించారు. ఎస్‌అర్, రజనీ సీడ్స్ పేరిట నకిలీ దందా చేస్తుండగా ఆ ప్యాకెట్లపై హైదరాబాద్‌లోని రామంతపూర్, మేడ్చల్ అడ్రస్‌లు ముద్రించి ఉన్నాయి. 20 రోజుల క్రితం హైదరబాద్ ప్రాంతంలోని ఓ కోల్డ్‌స్టోరేజీలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు కోల్డ్‌స్టోరేజీ గాజుల శ్రీనివాస్‌తోపాటు అయన సోదరుడి పేరుమీద ఉండడం వల్ల ఇద్దరిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ సోదరున్ని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, శ్రీనివాస్ పరారిలో ఉండి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. సోదరుడు మాత్రం జైలు పాలు కాగా, ఇటీవలే బెయిల్‌పై వచ్చాడు. అయితే ఈ నకిలీ దందాలో శ్రీనివాస్‌తోపాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. కోల్డ్‌స్టోరేజీలో దొరికిన నకిలీ పత్తి విత్తనాలు కూడా ఆ నలుగురు వ్యక్తులు పెట్టుబడి పెట్టినవేనని సమాచారం. ప్రస్తుతం శ్రీనివాస్ మరో సారి ముందుస్తు బెయిల్ కోసం హైదరాబాద్‌లోనే తిష్ట వేసినట్లు చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ దందా చేస్తూ సులువుగా బెయిల్ తెచ్చుకోవడం...మరల అదే దందాను కొనసాగించడం అతడికి ఓ అలవాటుగా మారిందనీ, ఇప్పటికైనా పోలీసులు అతడిపై చర్యలు తీసుకొని నకిలీ దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే అమాయక రైతులు మోసపోవాల్సి వస్తుందంటున్నారు. పోలీసులు ఈ నకిలీ దందాపై లోతుగా విచారణ చేస్తే తీగ లాగితే డొంక కదిలుతుందనే చందంగా మోసాలు బయటపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles