త్వరలోనే స్మార్ట్ పనులు షురూ

Sat,May 18, 2019 01:12 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో త్వరలోనే స్మార్ట్‌సిటీ పనులు మొదలుపెడుతామనీ, ఇప్పటికే టెండర్లు చేపట్టిన పనులకు ఎన్నికల సంఘం కూడా అనుమతులు మంజూరు చేసిందని నగర ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ సదస్సుకు హాజరైన కమిషనర్, ఆ వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతానికి జాతీయ జీవన ప్రమాణస్థాయి సూచికలో కరీంనగర్ 11వ స్థానంలో ఉందనీ, దీనిని ఈ సారి 10 లోపు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వంద స్మార్ట్‌సిటీ నగరాల మధ్య కేంద్ర ప్రభుత్వం రేటింగ్ ఇస్తుందని తెలిపారు. ఆ మేరకు నగరంలోనూ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే జూన్ 15లోగా స్మార్ట్ పనులను లక్ష్యం మేరకు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. స్మార్ట్‌సిటీ కింద మల్టీపర్పస్ స్కూల్‌లో రూ. 7.20 కోట్లు, సర్కస్ గ్రౌండ్‌లో రూ. 3.80 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. నగరంలో రెండు విడతల్లో చేపట్టే రోడ్ల పనులకు రీ టెండర్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. వీటిని వెంటనే చేపడుతామని స్పష్టంచేశారు. మూడో విడతలో హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.53.70 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉందనీ, టెండర్లు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

అంబేద్కర్ స్టేడియంలో రూ. 18 కోట్లతో అభివృద్ధ్ది పనులు కూడా త్వరలోనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. టవర్ సర్కిల్‌ను అమృత్‌సర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు రూ. 17 కోట్లతో టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు. రూ.2 కోట్లతో గంజ్ హైస్కూల్‌ను అభివృద్ది చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.40 కోట్ల వ్యయంతో ఏబీడీ ఏరియాల్లోని డివిజన్లల్లో పూర్తిస్థాయిలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఏబీడీ ఏరియాలోకి 2 నుంచి 25, 28, 29, 31, 38, 39, 45 డివిజన్లు వస్తాయన్నారు. ఈ ప్రాంతాల్లో స్మార్ట్ సిటీ కింద మట్టి రోడ్లు లేకుండా చేస్తామని తెలిపారు. రూ. 18 కోట్లతో తెలంగాణ చౌక్ ఐలాండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశామనీ, ఇంకా టెక్నికల్ బృందం అనుమతులు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే, నగరంలోని భగత్‌నగర్, అంబేద్కర్‌నగర్, రాంపూర్‌ల్లోని రిజర్వాయర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్‌సిటీలో 24 గంటల నీటి సరఫరా చేస్తామన్నారు. నగరంలో మిషన్ భగీరథ పైపులైన్ పనులు తుది దశకు వచ్చాయని తెలిపారు. రిజర్వాయర్ల పనులు కూడా ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశముందన్నారు. భగీరథ పనులు పూర్తైతే నగరంలో ప్రతిరోజూ నీటి సరఫరా చేసేందుకు అవకాశముంటుందన్నారు. ఈ దిశగా తాము కూడా దృష్టి పెడుతున్నామని తెలిపారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్‌సిటీ కింద చేపట్టే పనుల విషయంలో వేగం పెంచుతామనీ, టెండర్ల పక్రియను త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles