ఢిల్లీ నుంచి గల్లీదాకా గులాబీమయమే..

Tue,April 23, 2019 01:00 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఢిల్లీ నుంచి గల్లీదాకా గులాబీ నీడలో గెలిచిన ప్రజా ప్రతినిధులే అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 2.05 లక్షల మెజార్టీతో గత చివరి ఎన్నికల్లో తానే గెలిచాననీ, ఇపుడు తన రికార్డును తానే బద్దలు కొడుతూ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు రెండు విడతల్లో పార్లమెంట్ ఎన్నిలు జరిగాయని, ఈ నెల 23న మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎంపీ స్పష్టం చేశారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న తన సహచర ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తకు పరిచయం ఉన్న అధికార యంత్రాంగంతో, పత్రికా రంగంలో పని చేస్తున్న కొందరు మిత్రులతో మాట్లాడితే దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తిరిగి బీజేపీ అధికారంలోకి రాదని, అధికారంలోకి వచ్చే స్థాయికి కాంగ్రెస్ పుంజుకోలేదని స్పష్టం చేశారు. పలు మీడియాలు నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కూడా ఇప్పటి వరకు ఇదే విషయం స్పష్టమైందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏతర పార్టీలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఎంపీ వినోద్ చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి, ఒడిషాలో నవీన్‌పట్నాయక్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్ వీళ్లు కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తుపెట్టుకోకుండా పోటీ చేసిన నాయకులు. వీళ్ల నేతృత్వంలోని పార్టీల ప్రాబల్యం పార్లమెంట్‌లో చాలా పెద్ద ఎత్తున ఉంటుందని అన్నారు. కేంద్రంలో పరిపాలన చేసే సామర్ధ్యం, శక్తి ఈ పార్టీలకు ఉంటుందని స్పష్టత వస్తున్నదని ఎంపీ వినోద్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తనకు అనుకూలంగా చేసుకుంటున్న ప్రచారం నీటి బుడగ అని తేలిపోయిందని, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేవని స్పష్టం చేశారు. మోడీగానీ, రాహుల్ గానీ ఈ దేశాన్ని వాళ్ల మీద వాళ్లు నిలబడి పాలించ లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణ వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుంది. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాబోది మంచి కాలమన్నారు. కేంద్రంలో ప్రధాన పాత్ర ఉంటది. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రాలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు.

వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా కోడ్ అమలులో ఉండి పాలన ముందుకు సాగ లేక పోతున్నదని, ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపంతో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపీ అన్నారు. పరిషత్తు ఎన్నికలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులే అధికారంలో ఉండబోతున్నామని, పరిషత్తు ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారో అదే విధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ కేంద్రంలోనే ఓటమి చవిచూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏమీ చేయలేదని, మే 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే 24న ప్రధాని మోడి తన పదవికి రాజీనామా చేయక తప్పదని ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కే అవకాశమే లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో మేమే దిక్కు అని అనుకునే రాహుల్, మోడీలకు దేశ ప్రజలు తగిన బుద్ది చెప్పబోతున్నారని ఎంపీ స్పష్టం చేశారు. అందుకే ఈ సారి జరిగే పరిషత్తు ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఎంపీ వినోద్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ విలేకరుల సమావేశంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, నాయకులు వై సునిల్ రావు, బండారి వేణు తదితరులు ఉన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles