ప్రాదేశిక పోరుకు సై

Mon,April 22, 2019 01:00 AM

-నేటి నుంచి తొలివిడత నామినేషన్ల స్వీకరణ
-ఆరు మండలాల్లో 61ఎంపీటీసీ, ఆరు జడ్పీటీసీ స్థానాలకు..
-ఆన్‌లైన్‌లో నమోదు, మండల కేంద్రాల్లో పత్రాలు తీసుకునేందుకు ఏర్పాట్లు
-సర్వం సిద్ధం చేసిన అధికారులు
జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో తొలి విడత పోరుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 18మండలాలుండగా తొలి విడతలో ఆరు మండలాలు, రెండో విడతలో ఆరు మండలాలు, మూడో విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నది. తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్నది. మొదటి విడతలో జిల్లాలోని ఆరు మండలాల్లోని 61 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉండనున్నాయి. ప్రతి మండల కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు మండల కేంద్రాల్లోనే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారులు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు.

తొలి విడత మండలాలు ఇవే..
జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, సారంగాపూర్, బీర్‌పూర్, రాయికల్ మండలాల్లో తొలివిడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 24వరకు నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఫిర్యాదులకు అవకాశం, 27న ఫిర్యాదులపై విచారణ చేపట్టనున్నారు. 28న ఉప సంహరణ, 29న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. మే 6న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఉదయం 10-30నుంచి సాయంత్రం 5వరకు..
మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రతి మండల కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించేందుకు ఆర్వో, ఏఆర్వోలను నియమించారు. ప్రతిరోజూ ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ప్రతి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చొప్పున తొలి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల నామినేషన్ల స్వీకరణకు ఆరుగురు రిటర్నింగ్ అధికారులను, ఆరుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 61 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు 20మంది ఆర్వోలు, 20మంది ఏఆర్వోలను నియమించారు.

డిపాజిట్ వివరాలు
పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల డిపాజిట్ల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5వేలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్‌కు కేటాయించిన జడ్పీటీసీ ప్రాదేశిక నియోజక వర్గానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజక వర్గాలకు పోటీ చేసే అభ్యర్థులు రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్‌లో రాయితీ ఉంటుంది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరన పత్రాలు సమర్పిస్తే డిపాజిట్ రూ.2,500, జనరల్ ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థు లు రూ.1,250 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ కాపీ మాత్రమే ఇవ్వాలి
ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించే విధానాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు నామినేషన్ల పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి అభ్యర్థి పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూర ల్ బాడీస్ అనే అంశంపై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూపెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో ఎం చుకొని ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ కాపీని ప్రింట్ తీసుకొని ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ నమోదును మాత్రమే పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది.

75
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles