ఏసీబీ వలలో అవినీతి అనకొండలు

Fri,April 19, 2019 02:26 AM

అవినీతి అనకొండల అవతారమెత్తిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఏసీబీకి అడ్డంగా చిక్కారు. తోటి అధికారి నుంచే లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిపోయారు. వనసంరక్షణ పనులకు సంబంధిచిన నిధుల్లో కమీషన్ ఇవ్వాలని సెక్షన్ ఆఫీసర్‌పై ఒత్తిడి చేసి, గురువారం ఆ అధికారి నుంచి సిరిసిల్ల అటవీశాఖ కార్యాలయంలో 4లక్షలు తీసుకుంటూ ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో అనిత అధికారులకు పట్టుబడ్డారు. ఇందులో సూత్రధారిగా నిలిచిన డీఎఫ్‌వో శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేయడం ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది.

సిరిసిల్లక్రైం: అవినీతి నిరోధక శాఖ వలకు ఏకంగా అనకొండలే చిక్కాయి. అటవీశాఖలో తోటి సిబ్బందినే లంచం కోసం వేధిస్తూ అడ్డంగా దొరికాయి. సిరిసిల్ల ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో అనిత 4లక్షల కమీషన్ తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకగా, ఇందులో సూత్రధారిగా ఉన్న డీఎఫ్‌వో శ్రీనివాసరావును సైతంను అదుపులోకి తీసుకోవడం అటవీశాఖను కుదిపేసింది. జిల్లాలో సంచలనం రేపింది. సంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను కొద్దిరోజుల క్రితమే ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి సెక్షన్ అఫీసర్‌గా బదిలీ చేశారు. వనసంరక్షణలో భాగంగా ఆయన అక్కడి అటవీ భూముల్లో నర్సరీల పెంపకం కోసం 45లక్షలు నిధులతో పనులు నిర్వహిస్తున్నారు. ఆ పనులపై 15శాతం కమీషన్ ముట్టజెప్పాలని సదరు సెక్షన్ ఆఫీసర్‌పై డీఎఫ్‌వో వేముల శ్రీనివాసరావు, సిరిసిల్ల ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో కడారి అనిత ఒత్తిడి తెస్తున్నారు. అంత కమీషన్ ఇచ్చుకోలేనని చెప్పడంతో 10 శాతం తేవాలని ఆదేశించారు. వారిద్దరి వేధింపులు భరించలేక చివరికి 4లక్షలు ఇస్తానని శ్రీనివాస్ ఒప్పుకున్నాడు.

వారం క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం సిరిసిల్లలోని అటవీశాఖ కార్యాలయంలోని క్యాంప్ ఆఫీస్‌లో ఎఫ్‌ఆర్వో అనితకు శ్రీనివాస్ 4లక్షల కమీషన్‌ను అందిస్తుండగా, డబ్బులతోసహా ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎఫ్‌ఆర్వో అనితను ఏసీబీ డీఎస్పీ రవికుమార్, ముగ్గురు సీఐలు రాము, ప్రశాంత్, వేణుగోపాల్‌తోపాటు సిబ్బంది విచారించారు. క్యాంప్ ఆఫీస్‌లో సోదాలు చేశారు. సిబ్బందిని విడివిడిగా విచారించారు. డీఎఫ్‌వో శ్రీనివాసరావే సూత్రధారని ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో చెప్పడంతో జగిత్యాలలో ఉన్న శ్రీనివాసరావును అక్కడే అదుపులోకి తీసుకుని, సిరిసిల్లకు తీసుకువచ్చారు. ఆయనను విచారించి అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏసీబీకి పట్టించిన సెక్షన్ అధికారి శ్రీనివాస్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయనీ, ఆయనను సైతం విచారిస్తామని డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ఎవరైనా అధికారులు లంచం అడిగినా, కమీషన్ల కోసం వేధించినా టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు. ఫిర్యాదు చేయగానే వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఉద్యోగోన్నతి రేసులో..?
అనిత ఏడాది క్రితం జగిత్యాల జిల్లా నుంచి సి రిసిల్లకు ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వోగా వచ్చారు. అయితే ఆమె డీఎఫ్‌వోగా ఉద్యోగోన్నతి రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో వాయిదా పడినట్లు సమాచారం. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో ఇక ఆమె ప్రమోషన్‌కు బ్రేక్ పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సా యంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంట ల వరకు విచారణ కొనసాగగా, ఆద్యంతం ఎఫ్‌ఆర్వో అనిత విలపించడం కనిపించింది. కాగా సొంతశాఖలో కిందిస్థాయి అధికారే డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్వో ను పట్టించడం అటవీశాఖలో సంచలనం సృష్టించింది.

61
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles