కొండంత పండుగకు వేళాయె..

Wed,April 17, 2019 12:28 AM

-19న చిన్న హనుమాన్ జయంతి
-నేటి నుంచి కొండగట్టులో ఉత్సవాలు
-నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
-లక్షలాదిగా తరలిరానున్న అంజన్న దీక్షాపరులు
-మాల విరమణకు పటిష్ట వసతులు
-650మంది పోలీసులతో భారీ బందోబస్తు
-నిఘా నేత్రాల పర్యవేక్షణలో వేడుకలు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంజనేయ స్వామి చిన్న జయంత్యుత్సవాలు నేటి నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేడుకలకు లక్షలాది మంది తరలివచ్చే అవకాశముండగా, ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.కొండగట్టులోనే రెండు జయంతులుదేశంలో ఎక్కడాలేని విధంగా కొండగట్టులో ఆంజనేయ స్వామికి రెండు జయంతులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతిని నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున దేశమంతటా ఆంజనేయ స్వామి జయంతిని జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, వివిధ పూజాధి కార్యక్రమాలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. కానీ, కొండగట్టు ఆలయంలో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులూ నిర్వహించకుండా కేవలం అభిషేకాలు, అర్చనలు మాత్రమే చేస్తారు. చాత్తాద శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. స్వామి వారి తిరునక్షత్రం రోజయిన వైశాఖ బహుళ దశమిని ప్రధాన ఉత్సవంగా పేర్కొంటూ ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం నిర్వహించి, జయంతి రోజున పూర్ణాహుతి వంటి పూజాధికార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. చిన్న జయంతి తర్వాత సరిగ్గా మండల(41)రోజుల తర్వాత పెద్ద జయంతి నిర్వహిస్తారు. అత్యంత కఠిన నియమాలతో స్వీకరించి ఆచరించిన మండల, అర్ధమండల దీక్షలు, ఏకాదశ దీక్షలు, ఐదు రోజుల దీక్షలను చిన్న జయంతి సందర్భంగా విరమిస్తారు. ఈ మధ్య దీక్ష తీసుకోవడం వీలు కాని వారు చిన్న జయంతిన స్వీకరించి పెద్ద జయంతికి విరమిస్తారు. స్వామి సన్నిధిలో మాల విరమణ చేసి మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్తుంటారు.

ఆవరణలో చలువ పందిళ్లు..
ఎండాకాలం కావడంతో ప్రధానాలయం ఆవరణతోపాటు పార్క్, గెస్ట్‌హౌస్‌కు వెళ్లే దారి, ఆలయం వెనకాల ఖాళీ ప్రదేశం, బేతాళుని గుడి పరిసరాలు, బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, ఆలయం ముందు ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేశారు. 20 గదుల ధర్మశాల వద్ద లడ్డూ పులిహోర, టికెట్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి, టికెట్ల కొనుగోలుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు వేయించారు.
పటిష్టంగా క్యూలైన్లు, బారికేడ్లు..
టికెట్ విక్రయ కేంద్రాలు, కేశఖండనం, మాల విరమణ, లడ్డూ పులిహోర విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లు, బారికేడ్లను పటిష్టంగా నిర్మించారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనాలకు సైతం ప్రత్యేక క్యూలైన్లు వేశారు. వచ్చే భక్తులకు అనుగుణంగా మరిన్ని క్యూలైన్లు, బారికేడ్లు వేస్తామని అధికారులు తెలిపారు. మాల విరమణ మండపం ముందు భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆరు సెల్లార్లు నిర్మించారు. వీఐపీల దర్శనం కోసం ఆలయ వెనక ద్వారం నుంచి ప్రత్యేక క్యూలైన్ వేశారు.

సకల వసతులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ..
లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆలయం తరఫున ఆలయంలోపల, వెలుపల అమర్చిన సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని అమర్చారు. కొత్త పుష్కరిణి, దీక్ష విరమణ మండపం, ఆలయం ముందు భాగంలోని పాత అన్నదాన సత్రం వద్ద విద్యుత్ స్తంభానికి, పోలీస్ ఔట్ పోస్టు, మెట్ల దారి, ప్రసాద తయారీ కేంద్రం, నాలుగు దిక్కులు కవరయ్యేలా రామాలయం వద్ద గల హైమాస్ లైట్లకు, బస్టాండ్ వద్ద టికెట్ బుకింగ్, వైజంక్షన్ కమాన్‌కు సీసీ కెమెరాలు బిగించారు. పోలీస్ ఔట్ పోస్టులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. ఆలయంతోపాటు పోలీస్ ఔట్ పోస్టు వద్ద డీవీఆర్లను ఏర్పాటు చేశారు.

వీటితో పాటు ఆలయానికి విద్యుత్ దీపాలు, ఆలయ ఆవరణలో లైటింగ్, సౌండ్ సిస్టం, ఎమర్జెనీ వినియోగానికి జనరేటర్లను సైతం సిద్ధంగా ఉంచారు. వై జంక్షన్ నుంచి నాచుపల్లి మార్గంలోని బొజ్జపోతన్న వరకు శాశ్వత ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. 20 ప్రాంతాల్లో చలివేంద్రాలు పెడుతున్నారు. పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీఓ అదనపు సిబ్బందిని సమకూర్చారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, జగిత్యాల మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. గుట్ట మీద, వాహన పూజల షెడ్డు వద్ద, వై జంక్షన్ వద్ద, గుట్ట కింద వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో వైద్య శిబిరాలు నెలకొల్పింది. భక్తులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్ పెట్టారు. కొత్త పుష్కరిణి వద్ద మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకుగాను గదులు నిర్మించారు.

భారీ బందోబస్తు
చిన్నజయంతి ఉత్సవాలకు ఎస్పీ సింధూశర్మ పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. జగిత్యాల డీఎస్పీతో పాటు 31 మంది ఎస్‌ఐలు, ఏడుగురు సీఐలు, 212 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 95 మంది ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది మహిళా కానిస్టేబుళ్లు/హోంగార్డులు, 261మంది హోంగార్డులు, మొత్తంగా 650 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
3 లక్షల లడ్డూ ప్రసాదం..
భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆలయ అధికారులు ముందుస్తుగానే 3లక్షల లడ్డూలను తయారుచేయించి పెట్టారు. ఇవిసరిపోని పక్షంలో వెంటనే తయారుచేసేందుకు అదనపు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచినట్లు ప్రసాద తయారీ ఇన్‌చార్జి ధర్మేంధర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడే పులిహోర తయారుచేసి అందిస్తామని తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈవో అమరేందర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్‌రావు మల్యాల, జగిత్యాల రూరల్ సీఐలు నాగేందర్, శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles