పట్టపగలే హత్యాయత్నం

Tue,April 16, 2019 02:17 AM

జగిత్యాల క్రైం: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.. ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. హఠాత్తుగా గొడ్డలితో వచ్చిన ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయగా అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తేరుకునేలోపే గొడ్డలితో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దాడిలో గాయపడ్డ వ్యక్తి కింద పడి హాహాకారాలు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున సోమవారం జరిగిన హత్యాయత్నం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన తిప్పర్తి కిషన్ జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన కత్తురోజు లక్ష్మణ్‌కు మధ్యవర్తిగా ఉండి ఐదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాన్ని విక్రయింపజేశాడు. సదరు భూమి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలై తీవ్రస్థాయికి చేరాయి. ఈక్రమంలో కిషన్‌పై కోపం పెంచుకున్న లక్ష్మణ్ సోమవారం జిల్లా కేంద్రంలోని సార్గమ్మ వీధిలో కిషన్ కోసం కాపు కాశాడు. వీధిలోకి వచ్చిన కిషన్‌పై గొడ్డలితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మణ్ దాడిలో కిషన్ కడుపు, చేతులు, తలపై గాయాలయ్యాయి. గాయాలతో కిందపడిపోయిన కిషన్‌ను స్థానికులు జిల్లా దవాఖానకు తరలించారు. కిషన్ భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ప్రకాశ్ తెలిపారు. కాగా, సార్గమ్మ వీధిలో పగటి పూట వందలాది మంది సమక్షంలో దాడి జరగడంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

63
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles