ఇక ప్రాదేశిక పోరు

Sun,April 14, 2019 01:43 AM

- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
- జిల్లాలో రెండు విడతల్లో పోలింగ్
- 18జడ్పీటీసీ, 214ఎంపీటీసీ స్థానాలకు..
- తొలివిడత మే 6, రెండో విడత 10న
- ఈనెల 22, 26నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- 18న హైదరాబాద్‌లో ఈసీ సమావేశం
- ఆ తర్వాతే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంట నే ప్రాదేశిక పోరుకు తెర లేచింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల ప్రాదేశిక స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, షెడ్యూల్‌ను కూడా దాదాపు ఖరారు చేసింది. ఈ నెల 18న హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ సమావేశం కానుండగా, ఆ తర్వాతే షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 18మండలాల్లో మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియకు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ విషయమై ప్రాతినిధ్యం చేయగా, కోడ్ ముగిసే లోపు ఎన్నికలు ముగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవనీ, ఫలితాలను మాత్రం కేంద్ర ఎన్నికల కోడ్ ముగిసే దాకా ప్రకటించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి వీ నాగిరెడ్డితో సమావేశం కావడం తెలిసిందే.

మే 23లోపు ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలనీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం తర్వాత నిర్వహించాలని ము ఖ్యమంత్రి, అధికారులు నిర్ణయించారు. మున్సిపల్ చట్టానికి మార్పులు చేర్పులు తెచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ పోరు ఈ మేలో నిర్వహించే అవకాశాలు లేకుండాపోయాయి. కాగా శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వీ నాగిరెడ్డి, రాష్ట్రంలో మూడు విడతలో ప్రాదేశిక పోరు నిర్వహించనున్నట్లు ప్రకటన జారీ చేయడంతో పాటు, మూడు విడుతల ఎన్నికల వివరాలను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన నేపథ్యంలో జిల్లా లో రెండు విడుతల్లో ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇక మరోసారి గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

18 జిల్లా, 214 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు
18మండలాల్లో విస్తరించి ఉన్న జగిత్యాల జిల్లాలో 214 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా, 18జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. వీటికి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం జిల్లాలో 5,61, 141 మంది గ్రామీణ ప్రాంత ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇప్పటికే రిజర్వేషన్లు ఖారారు
214 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు, 18 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు, ఎంపీపీ స్థానాలకు ఇప్పటికే అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 3, బీసీ 5, జనరల్ 9, జడ్పీ చైర్మన్ స్థానా న్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ స్థానాలకు ఎస్టీ 1, ఎస్సీ 4, బీసీ 4, జనరల్ విభాగానికి 9 స్థానాలను కేటాయించారు. జిల్లాలోని 214ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీ కేటగిరీకి 40 స్థానాలను రిజర్వు చేశారు. ఇందులో ఎస్సీ జనరల్ 16, ఎ స్సీ మహిళకు 24 స్థానాలు ఇచ్చారు. ఎస్టీ మహిళకు 6 స్థానాలు కేటాయించారు. బీసీ కేటగిరీకి 55 స్థానాలు కేటాయించగా, బీసీ జనరల్‌కు 25, బీసీ మహిళకు 30 స్థానాలు రిజర్వయ్యాయి. జనరల్ కోటాకు 60 స్థానాలు కేటాయించారు. జనర ల్ మహిళకు 53 కేటాయించారు. మొత్తంగా జనరల్ కేటగిరిలో 113 స్థానాలకు అవకాశం కల్పించారు.

ఏర్పాట్లు దాదాపు పూర్తి
జిల్లాలో ప్రాదేశిక పోరుకు అధికారులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 5,61,141మంది ఓటర్లున్నట్లు ఇప్పటికే తేల్చారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను, 367పోలింగ్ లోకేషన్లు, 1,058పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రాదేశిక స్థానాలకు సంబంధించి 18 మంది రిటర్నింగ్ అధికారులను కేటాయించారు. వారితో పాటు మరో నలుగురిని రిజర్వు కేటగిరిలో ఉంచారు. ఇక 214 మండల ప్రాదేశిక స్థానాలకు సైతం 80కి పైగా రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. మొత్తం జిల్లాలో 18 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి డివిజన్ల వారీగా రెండు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జిల్లాలో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడ త ఎన్నికల ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రా రంభం కానుంది. 22న నామినేషన్ ప్రక్రియ మొ దలవనుండగా 24వరకు స్వీకరణ, 25న పరిశీలన చేయనున్నారు. 26న ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. 27న ఫిర్యాదులపై విచారణ, 28న నామినేషన్ల ఉప సంహరణ, 29న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నా రు. మే 6న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26నుంచి 28వరకు నామినేషన్ల స్వీకరణ, 29న పరిశీలన, మే 2న ఉప సంహరణ ప్రక్రియ ఉండనుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల, మే 10న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏ విడతలో ఏ మండలం
పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్, మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలాల ఎన్నికలు తొలివిడతలో నిర్వహించనున్నారు. మేడిపల్లి, రాయికల్, కోరుట్ల, కథలాపూర్, సారంగాపూర్, బీర్‌పూర్, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు రెండో విడతలో ఎన్నికలు ఉండనున్నాయి.

77
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles