వార్ వన్ సైడే

Fri,April 12, 2019 12:57 AM

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వరాష్ట్రంలో తొలిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన నిలిచారు. వివిధ సంస్థలు, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం జిల్లాలో పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ స్థాయిలో ఓట్లు పోలైనట్లు తెలుస్తున్నది. టీఆర్‌ఎస్‌కు ఈసారి గతంలో మాదిరిగా గెలుపు సాధ్యం కాదనీ, ఓడి పోతారని, ప్రజా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. మరోవైపు వివిధ పార్టీలు కలిసి పలువురిని బరిలో నిలిపాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ నాలుగున్నరేళ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, జిల్లాను ఏ రకంగా అభివృద్ధి చేయలేదని, తాము వస్తే అనేక రకాల సమస్యలు పరిష్కరిస్తామని హామీల వర్షం కురిపించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని, మైండ్ గేమ్ గ్లోబల్ ప్రచారం చేశారు. కానీ గురువారం జరిగిన ఓటింగ్ సరళిని చూస్తే ప్రజలు కాంగ్రెస్, బీజేపీ మాటలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్న విషయం స్పష్టమవుతున్నది. నిజానికి 2014ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మెజారిటీ రాగా మొత్తం నిజామాబాద్ నియోజక వర్గ పరిధిలో 1.67లక్షల మెజారిటీ వచ్చింది. ఇక పెదపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొంటున్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈసారి ప్రతి నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా కనీస మెజారిటీ వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, పెద్దపల్లి పరిధిలోని ధర్మపురిలో 50వేల మెజార్టీ వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రభావం ప్రస్పుటంగా కనిపించింది. వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల ప్రభావం భారీగా పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ప్రభావం చూపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంపీ అభ్యర్థి కవిత పనితీరుకు పట్టం
నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పనితీరుకు ఓటర్లు మరోసారి పట్టం కట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014లో తొలిసారిగా పోటీ చేసి, 1,67 లక్షల ఓట్లతో విజయం సాధించిన ఎంపీ కవిత ఐదేళ్లలో నిజామాబాద్ నియోజకవర్గంలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గాల్లో ఏనాడూ జరగనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. బోర్నపెల్లి వంతెన నిర్మాణం మొదలుకొని రోళ్లవాగు రిజర్వాయర్ వరకు భారీ నిధులను కేటాయింపజేశారు. జగిత్యాల పట్టణంలో 4వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరీ, దవాఖాన ఆధునీకరణ, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు, రాయికల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఎంపీ కవిత చేసిన కృషి నేపథ్యంలో ప్రజల్లో ఆమె విపరీతమైన ప్రేమాభిమానాలను సంపాదించుకున్నారు. వీటికి తోడు జాగృతి సంస్థ ద్వార గల్ఫ్ కార్మికులకు అండగా నిలిచారు. ఇలా ఎంపీ కవిత చేపట్టిన పనులతో నియోజకవర్గాల్లో ఆమె చరిష్మా పెరిగిపోయింది.

కుట్రలు పటాపంచలు..
ఎంపీగా రెండవసారి బరిలోకి దిగిన కవితను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలకు తెరలేపాయి. పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు, రైతులకు మద్దతుధర అందజేయడం లాంటి అంశాలపై కవిత అవిశ్రాంతంగా శ్రమించినా, వాటిని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎంపీ కవితకు పేరురాకూడదన్న కుట్రతో వాటిని పరిష్కరించని విషయం తెలిసిందే. ఎన్నికల సమయం ఆసన్నం కాగానే కాంగ్రెస్, బీజేపీలు పసుపుబోర్డు, ఎర్రజొన్న రైతుల పేరటి నాటకాలకు తెరలేపాయి. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు రైతుల ముసుగులో నామినేషన్లు వేశారు. పసుపుబోర్డు సమస్య పరిష్కారం కోసమంటూ తప్పుడు ప్రచారం చేపట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజా స్పందన ముందు వారి ఆటలు సాగలేవన్న విషయాన్ని గురువారం జరిగిన పోలింగ్ స్పష్టం చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చివరి దాకా కాంగ్రెస్ కుట్ర
పోలింగ్ రోజు సైతం కాంగ్రెస్ తన కుట్రలను కొనసాగించింది. పోలింగ్ ఆరంభమైనప్పటికీ దింపుడు కళ్లెం ఆశతో పనిచేసినట్లుగా కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థి గత పదిహేను రోజుల నుంచి ఎన్నికల క్షేత్రంలోంచి పారిపోయినట్లు ఇప్పటికే ప్రతి ఒక్కరికీ అవగతమైన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రచారం నిర్వహించని కాంగ్రెస్ అభ్యర్థి, క్యాడర్, పోలింగ్ ప్రక్రియ ఆరంభమైన మరు క్షణం నుంచి తమ మాయాజాలాన్ని ప్రదర్శించేందుకు యత్నించారు. కాంగ్రెస్ క్యాడర్ తమ అభ్యర్థికి కనీసం డిపాజిట్ సైతం దక్కదని గుర్తించి, తమ క్యాడర్‌కు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని బహిరంగంగా చెప్పడం కనిపించింది. తమ అభ్యర్థి గెలువకపోయినా, బీజేపీకైనా మేలు జరగాలని కాంగ్రెస్‌కు చెందిన ప్రధాన నాయకులు దిగువ శ్రేణి కార్యకర్తలకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాల పట్టణంతో పాటు, మండలాలు, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ క్యాడర్ బీజేపీతో ములాఖతై కనిపించ డం గమనార్హం. జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా, కారు స్పీడ్‌కు పూర్తిగా అవి తమ ఉనికి ని కోల్పోయాయని నిపుణులు పేర్కొంటున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles