నేడే లోక్‌సభ పోరు

Thu,April 11, 2019 12:46 AM

- పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం
- నిజామాబాద్ పరిధిలో ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు పోలింగ్
- కరీంనగర్, పెద్దపల్లి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు..
- సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
- కేంద్ర పోలీసు బలగాలతో నిఘా
- నేటి సాయంత్రం 5 గంటలకు దాకా 144 సెక్షన్
- దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
- అంధులకు ఇంగ్ల్లిష్, తెలుగు బ్రెయిలీ లిపిలో ఓటింగ్ సౌకర్యం
- దేశంలోనే మొదటిసారిగా ఇందూరులో ఎం-3 ఈవీఎంల వినియోగం

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నిలకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి సెగ్మెంట్ల పరిధిలో యంత్రాంగమంతా రెడీ అయింది. నేడు నిజామాబాద్ పరిధిలో ఉదయం 8నుంచి సాయంత్రం 6గంటల వరకు, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుండగా, ఆయాచోట్ల ఏర్పాట్ల ప్రక్రియ పూర్తయింది.

నిజమాబాద్‌లో ప్రత్యేకం..
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 185 మంది బరిలో నిలిచారు. ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల పరిధిలో మొత్తం 15,53,386 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 1,788 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎల్ ఆకారంలో ఈవీఎంల అమరికను కూర్పు చేశారు. దేశంలోనే మొదటిసారిగా ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 12 బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. 12వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. బెల్, ఈసీఐఎల్ నుంచి 400 మంది ఇంజినీర్లు ఈవీఎంలను పర్యవేక్షిస్తున్నారు. 700మంది మైక్రో సిబ్బందితోపాటు 12వేల అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల గుర్తుల విషయంలో అయోమయానికి గురి కాకుండా ఓటర్ల అవగాహన కోసం పోలింగ్ కేంద్రాల బయట ప్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఎన్నికకు కా వాల్సిన 26వేల బ్యాలెట్ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 2,150 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. ఈసీఐ నిబంధనల మేరకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పోలింగ్ అనంతరం జగిత్యాలలోని రెండు నియోజకవర్గాలు, నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని సామగ్రిని డిచ్‌పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)కు తరలించనున్నారు. సందేహాలు, సమస్యలుంటే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఉదయం మాక్‌పోలింగ్...
నేడు ఉదయం 6నుంచి 8గంటల వరకు మాక్‌పోలింగ్, 8నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ ప్రక్రియలో 6నుంచి 8గంటల వరకు క్యూలో నిల్చున్న ఓటర్లందరు ఓటు హక్కు వినియోగింకునే విధంగా సిబ్బంది సహకరిస్తారని రిటర్నింగ్ అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. సాధారణంగా 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలకు ఒక అధికారిగా వ్యవహరించే వారనీ, ప్రస్తుత ఎన్నికల్లో 5 పోలింగ్ కేంద్రాలకు ఒక అధికారిని నియమించినట్లు చెప్పారు. ఎక్కడైనా సాంకేతిక సమస్య సంభవిస్తే ఇంజినీర్లు, టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. 12 బ్యాలెట్ యూనిట్ల సంఖ్యతో పోలింగ్ నిర్వహించడం ఒక చరిత్రగా మిగిలిపోతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 355 సెక్టార్లలో, నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.

పోలీస్ నిఘా..
లోక్‌సభ పరిధిలో 83 సమస్యాత్మక గ్రామాలు, 278 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2వేల మంది స్థానిక పోలీసుశాఖ సిబ్బంది, 1200మంది ఇతర ప్రత్యేక పోలీసు బలగాలతో మొత్తం 3200 మంది పోలీసులను కేటాయించారు. డీఐజీ, సీపీ, అడిషనల్ సీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలు, ఆయా పరిధిలలో శాంతిభద్రతల కోసం విధులను నిర్వహించనున్నారు. సుమారు 12వేల మంది ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు 700 మంది, ప్రిసైడింగ్ అధికారులు, సహాయక ప్రిసైడింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు (సెంట్రల్), రూట్ ఆఫీసర్లు ఇదివరకే విధుల్లో ఉన్నారు.

మరో చరిత్రే..
ప్రపంచంలోనే ఎక్కువ మంది అభ్యర్థులతో తలపడుతున్న నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రపుటల్లోకి ఎక్కనున్నది. పరిమిత స్థాయికి మించి అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపర్ల విధానంలో ఎన్నికలు నిర్వహించేవారు. కానీ, 185 మంది అభ్యర్థులు ఉండడంతో దేశంలోనే మొదటిసారిగా ఎం-3 ఈవీఎంలను ఇక్కడే వినియోగిస్తున్నారు. బెల్, ఈసీఐఎల్ నుంచి 600 మంది ఇంజినీర్లు, ప్రత్యేక నిపుణులను రప్పించి యుద్ధప్రతిపాదికన ఈవీఎంల చెకింగ్, అమర్చడం పూర్తిచేశారు. ఇందులో 400 మంది నిజామాబాద్ జిల్లాకు, మరో 200మంది ఇంజినీర్లను జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనబరస్తున్న దృష్ట్యా, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఒక హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచారు. బ్యాలెట్ యూనిట్లతో కూడిన పోలింగ్ బూత్‌ల్లో సుమారు 26వేల బ్యాలెట్ యూనిట్లతో పాటు 2,150 కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో పోలింగ్ బూత్‌లో 12 ఈవీఎంలు, ఒక వీవీ ప్యాట్, ఒక కంట్రోల్ యూనిట్ చొప్పున తిరగేసిన ఎల్ ఆకారంలో అమర్చారు. ఇందులో సుమారు 4వేల పైచిలుకు ఈవీఎంలను సైతం రిజర్వ్‌లో అందుబాటులో ఉంచారు. వీటి మొదటి విడత చెకింగ్ ప్రక్రియను సైతం పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. 185 అభ్యర్థులు ఉన్నందున ఐదు పోలిం గ్ బూత్‌లకు ఒక సెక్టోరల్ అధికారిని కేటాయించారు. 1,788 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన పరిమిత స్థాయిలో మాత్రమే వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందులో బాసర ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు భాగస్వాములై ఆయా పరిధిలలో విధులు నిర్వర్తించనున్నారు.

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..
దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలో నిల్చునే పనిలేకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీల్‌చైర్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఓటు వేసేందుకు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, తిరిగి పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటోలు సిద్ధంగా ఉంచారు. అంధుల కోసం తెలుగు, ఇంగ్ల్లిష్ బ్రెయిలీ లిపిలో ఓటరు సౌకర్యాన్ని ఈ సారి అందుబాటులోకి తెచ్చామన్నారు.

పెద్దపల్లి లోక్‌సభ..
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా, మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లిలో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉన్న పెద్దపల్లి పార్లమెంట్‌లో 14,78,062 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 1,835 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో 17మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. ఎన్నికల నిర్వహణకు 7,340 మంది సిబ్బంది, అధికారులు విధులు నిర్వహిస్తుండగా ప్రత్యేకంగా వేలాదిమంది పోలీసులు బందోబస్తులో తలమునకవుతున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 307 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

కరీంనగర్ లోక్‌సభ..
కరీంనగర్ లోక్‌సభ పరిధిలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనుండగా, మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 16,50,893 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1,107 ప్రాంతాల్లో 2,181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెయ్యి పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. మిగతా 1,181 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు విస్తృత ప్రచారం చేశారు. 10,305 మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తిస్తుండగా, 3,747 మంది పోలీసులు బందోబస్తులో తలమునకలయ్యారు. 129 ప్రాంతాల్లో గుర్తించిన 273 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఆరుగురి చొప్పున కేంద్ర అదనపు పోలీస్ బలగాలను కేటాయించారు.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం
అభ్యర్థులు : 185
పోలింగ్ కేంద్రాలు : 1,788
పోలింగ్ సమయం : ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు
ఓటర్లు : 15,53,386
సిబ్బంది : 12వేలు

కరీంనగర్ పార్లమెంట్ స్థానం
అభ్యర్థులు : 15
పోలింగ్ కేంద్రాలు : 2,181
పోలింగ్ సమయం : ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు
ఓటర్లు : 16,50,893
సిబ్బంది : 10,305

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం
అభ్యర్థులు : 17
పోలింగ్ కేంద్రాలు : 1835
పోలింగ్ సమయం : ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు
ఓటర్లు : 14,78,062
సిబ్బంది : 7,340

51
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles