ఆఖరి రోజూ అదే జోరు

Wed,April 10, 2019 12:59 AM

- ఆరుగంటల వరకు బిజీబిజీగా గులాబీసేన
- బతికపల్లిలో ప్రచారం చేసిన సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్
- జగిత్యాలలో ప్రెస్‌మీట్‌తో ప్రచారం ముగించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత
- జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్..
- మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు..
- కొండగట్టు వద్ద సైకిల్ ర్యాలీలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- మన్నెగూడెంలో బైక్‌ర్యాలీలో పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు అదరహో అనిపించేలా సాగింది. 15 రోజుల నుంచి విస్తృతంగా సాగిన ప్రచారం చివరిరోజు ఉధృతమైంది. జిల్లాలోని ప్రతి వార్డులోనూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత జగిత్యాలలో ఉదయం ప్రెస్‌మీట్‌ను నిర్వహించగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉదయం జగిత్యాలలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అనంతరం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని తరుఫున పెగడపల్లి మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మల్యాల మండలంలో ప్రచారం నిర్వహించి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మేడిపల్లి మండలం మన్నెగూడెంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు నేతృత్వంలో బైక్‌ర్యాలీ నిర్వహించి, ప్రచారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చివరి రోజు జోరుగా సాగిన ప్రచారం సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు పరిసమాప్తమైంది.

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరుగంటలతో ముగిసింది. చివరి రోజు ప్రచారం జిల్లా వ్యాప్తంగా అదరహో అన్న స్థాయిలో కొనసాగడం గమనార్హం. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు, చివరి రోజు ప్రచారంలో పూర్తిస్థాయిలో తలమునకలయ్యారు. 15 రోజుల నుంచి విస్తృతంగా సాగిన ప్రచారం చివరి రోజు మరింత ఉధృతంగా సాగింది. జిల్లాలోని ప్రతి వార్డులోను కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేపట్టారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలతో పాటు అనుబంధ శాఖలైన యువజన విభాగం, విద్యార్థి విభాగం, జాగృతి సంస్థ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత జగిత్యాలలో ఉదయం ప్రెస్‌మీట్‌ను నిర్వహించి, జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ ప్రజలను ఓటు అభ్యర్థించడంతో పాటు, తన మ్యానిఫేస్టోను, టీఆర్‌ఎస్ మ్యానిఫేస్టోను వివరించారు.

ఉదయం ప్రెస్‌మీట్ అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన కొందరు న్యాయవాదులు, వైద్యులను పార్టీలోకి ఎంపీ అభ్యర్థి కవిత సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రచారం నిమిత్తం నిజమాబాద్ జిల్లాకు వెళ్లిపోయారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉదయం జగిత్యాలలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అనంతరం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని తరుఫున ప్రచారం నిర్వహించేందుకు ధర్మపురి నియోజకవర్గం, పెగడపల్లి మండలంలోని బతికపెల్లికి వెళ్లి అక్కడ బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. అనంతరం టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సైతం ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలానికి వెళ్లారు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బాదినేని రాజేందర్, ద్వితీయ శ్రేణి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇక జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణంలోని 12, 13, 18, 11 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు, టీఆర్‌ఎస్ ప్రధాన నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలు, పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రచారం చేపట్టారు. రాయికల్ మండలంలో టీఆర్‌ఎస్ ఎంపీపీ పూర్ణిమా, తిరుపతి, గండ్ర రమాదేవి, తురగ శ్రీధర్‌రెడ్డి, మోర హన్మాండ్లు తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక మెట్‌పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రచారం నిర్వహించారు. మెట్‌పల్లి పట్టణంతో పాటు, కోరుట్లలో ప్రచారం నిర్వహించారు.

ఉదయం మినీస్టేడియంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వాకర్స్‌తో కలిసి ఎంపీ తరుఫున ఓటు అభ్యర్థించారు. ఎమ్మెల్యే కొడుకు, టీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎంపీ కవిత తరుఫున ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి, తిమ్మాపూర్, గోదూర్ గ్రామాల్లో ప్రచారం చేశారు. మెట్‌పల్లి మండలంలోని గ్రామాల సర్పంచులు అంతా కలిసి మెట్‌పల్లి పట్టణంలో భారీ బైక్‌ర్యాలీని నిర్వహించి ప్రచారం చేశారు. ముదిరాజ్ కులస్తులు నియోజకవర్గ పరిధిలో ఎంపీ అభ్యర్థి కవితకు ఓటేస్తామని నిర్ణయించుకొని ఈ మేరకు వివరాలను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అందజేశారు. మెట్‌పల్లి పట్టణంలో 200 మంది యువకులు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కరీంనగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్ కుమార్ తరుఫున మల్యాల మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా వారం రోజుల క్రితం కరీంనగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆరంభమైన సైకిల్ ర్యాలీ మంగళవారం కొండగట్టు పుణ్యక్షేత్రానికి చేరుకోగా, దానిలో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. కొడిమ్యాల మండలంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, సర్పంచ్ కృష్ణారావుల నేతృత్వంలో ప్రచారం చేపట్టారు. ఇక వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాల్లోను జోరుగా ప్రచారం నిర్వహించారు. కథలాపూర్ మండలం గంబీర్‌పూర్, భూషన్‌రావుపేట గ్రామాల్లో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ప్రచారం నిర్వహించారు. మేడిపల్లి మండలంలోను ప్రచారం జోరుగా చేపట్టారు. మండలంలోని మన్నెగూడెం గ్రామంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు నేతృత్వంలో బైక్‌ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. బీమారం గ్రామంలో ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు పునుగోటి రవీందర్‌రావు ఇంటింటి ప్రచారం చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చివరి రోజు జోరుగా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం పరిసమాప్తం అయింది.

79
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles