దేశ గతిని మార్చే ఎన్నికలివి

Tue,April 9, 2019 03:48 AM

- 70ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు
- ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ
- రోజురోజుకూ పడిపోతున్న మోడీ గ్రాఫ్
- కాంగ్రెస్, బీజేపీని పక్కనబెడితేనే దేశం అభివృద్ధి
- దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం
- గల్లీ, ఢిల్లీలో శక్తి వంచన లేకుండా పని చేశా
- మెట్‌పల్లి రోడ్ షోలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత
- పట్టణంలో పద్మశాలీ కులస్థుల ఆత్మీయ సమ్మేళనానికీ హాజరు
(మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ)
ప్రస్తుత ఎన్నికలు దేశ గతిని మార్చేవనీ, 16 ఎంపీ సీట్లు గెలిపించుకొని ఢిల్లీలో మన సత్తా చాటుదామని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి సోమవారం రాత్రి మెట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో, పద్మశాలీ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. దేశంలో ప్రధాని మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నదనీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగడం లేదనీ, జాతీయ పార్టీల ప్రభావం తగ్గుతున్నదనీ, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం కీలకం కానుందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కనబెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఐదేండ్లలో శక్తి వంచన లేకుండా ఢిల్లీలో, గల్లీలో తన వాణి వినిపించానన్నారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నాక, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేని కుసంస్కార ప్రభుత్వం బీజేపీదని విమర్శించారు. దేశ సరిహద్దులో ఉన్న విదేశాలతో సఖ్యత లేకనే తరచుగా దాడులు జరుగుతున్నాయనీ, 70 ఏండ్లలో చనిపోయిన సైనికుల కంటే ఈ ఐదేండ్లలోనే ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు. పక్క దేశాలతో విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందనీ, కానీ బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో సగం ప్రాంతం సస్యశ్యామలమవుతుందనీ, ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని పలు మార్లు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.

16మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రను మనం పోషించే అవకాశం వస్తుందనీ, దీని వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాజెక్ట్‌లను, నిధులు, వాటాలను సాధించుకోవచ్చన్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని ఆ నాడు బీజేపీ హామీ ఇచ్చిందనీ, ఐదేళ్లలో నల్లధనం బయటకు తీయకపోగా ఏ ఒక్కరి ఖాతాలోనూ రూపాయి కూడా జమ చేయలేదన్నారు. ఇప్పుడు మళ్లీ రూ. 15వేలు ఖాతాలో వేస్తామంటూ ఆ పార్టీ వారు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకవెళ్తున్నారనీ, ఓటు కోసం పైసలు ఇస్తే తీసుకోండి కానీ, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు. మెట్‌పల్లి పట్టణ సమగ్రాభివృద్ధికి రూ. 60 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకోలేని ప్రతి పేద కుటుంబానికీ రూ.5లక్షలు నేరుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 6వేల మంది ముస్లింలకు రూ.12వేలు విలువ చేసే కుట్టు మిషన్లు ఉచితంగా అందించామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు పూర్తి రాయితీతో రూ. 50వేల చొప్పున వేలాది మందికి ఆర్థిక సహాయం అందించామన్నారు. ఐదేండ్లు మీ కోసం పని చేశా.. నా పని తీరు నచ్చితే మళ్లీ నన్ను గెలిపించండి.. ఈసారి 12 ఈవీఎంలు వచ్చాయి.. మొదటి ఈవీఎంలో రెండో నంబర్‌పై నా ఫొటో, కారు గుర్తు ఉంటుంది.. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు.

రెట్టింపు మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
శాసన సభ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీతో ఎంపీగా కల్వకుంట్ల కవితను గెలిపించాల్సిన బాధ్యత, అవసరం మన అందరిపై ఉందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో నిరంతరం మన సమస్యలపై గళమెత్తిన చరిత్ర ఎంపీ కవితకు ఉందనీ, పసుపు బోర్డు కోసం ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదనీ, కానీ ఇప్పుడు ఎన్నికలు రాగానే తమను గెలిపిస్తే మూడ్రోజుల్లో పసుపు బోర్డు తెస్తామంటూ బీజేపీ నాయకులు అబద్దపు మాటాలు మాట్లాడుతున్నారనీ, ఈ ఐదేండ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మన ఆడబిడ్డ కవితను మరో సారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. కవితకు ఎన్నికల ఖర్చు కోసం పట్టణంలోని నాలుగోవార్డు టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సిరిసిల్ల అర్జున్ రూ.10వేలు విరాళం అందజేశారు. రోడ్ షోలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు మైలారపు లింబాద్రి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు డా. సంజయ్, జాగృతి జిల్లా అధ్యక్షుడు చెర్లపల్లి అమర్‌దీప్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎనుగందుల వనజ, బర్ల బగీర్థ, ద్యావతి అరుణ, గైనీ లావణ్య, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు లింగంపల్లి సంజీవ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, నాయకులు మర్రి సహదేవ్, పూదరి నర్సాగౌడ్, ఎండీ జావీద్, పిప్పెర శేఖర్, సలీం, సిరిసిల్ల అర్జున్, షేక్ నవాబ్, షేక్ అమ్జద్, సారథిగౌడ్, గాదె రాజన్న, ఒజ్జెల శ్రీనివాస్, భీమనాతిని సత్యనారాయణ, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, ఆనంద్‌గౌడ్, ఎనుగందుల శ్రీనివాస్‌గౌడ్, గైనీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే పద్మశాలీల అభ్యున్నతి
టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే పద్మశాలీల అభ్యున్నతి సాధ్యమని ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పట్టణంలోని వాసవీ గార్డెన్స్‌లో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మరోసారి తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో పద్మశాలీ సంఘం భవనానికి రూ. 25 లక్షలు మంజూరు చేశామనీ, వాడ కట్టు సంఘాల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో చేనేత పనివారు తక్కువగా ఉన్నందున పద్మశాలీల ఉపాధి కోసం ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తే బాగుటుందని తన దృష్టికి వచ్చిందనీ, తప్పకుండా అమలు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వచ్చే మే 1 నుంచి బీడీ కార్మికులతో పాటు ఆసరా పింఛనుదారులకు రెట్టింపు పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామనీ, ప్రస్తుతం వేసవిలో తాత్కాలికంగా నీటి సమస్యను తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాల్లో బీజేపీ దిట్ట అనీ ఆ పార్టీ ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ ప్రచారంలో పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నికలు ఉన్నా, లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు కేసుల సురేందర్, నాయకులు మర్రి సహదేవ్, గుంటుక విష్ణు, ద్యావనపల్లి రాజారం, భీమనాతిని సత్యనారాయణ, గజం రవి, రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles