వడగండ్ల బీభత్సం

Thu,March 21, 2019 01:01 AM

(ధర్మపురి, నమస్తే తెలంగాణ/ కొడిమ్యాల/జగిత్యాల అర్బన్/ బుగ్గారం/గొల్లపల్లి/కథలాపూర్/వెల్గటూర్): జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్లు బీభత్సం సృష్టించాయి. పలు మండలాల్లో వరి, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతినగా, మామాడి పిందెలు, కాయలు రాలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మపురి మండలం రాయపట్నంలో గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఈదురు గాలులతో నాటు పడవ బోల్తా వెల్గొండ నర్సయ్య అనే మత్సకారుడు నీటిలో మునిగి మృతిచెందాడు.

కొడిమ్యాలలో గంటపాటు రాళ్లవాన..
కొడిమ్యాల మండలం నల్లగొండ, తిప్పాయపల్లి, దమ్మయ్యపేట, గంగారాం తండా, సూరంపేట, కోనాపూర్, తుర్కాశీనగర్‌లో గ్రామాలలో గంట పాటు కురిసిన రాళ్లవానకు వరి, మక్క పంటలు నేలకొరిగాయి. మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. ఆయా గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా రైతులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వరి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి పిం దెలు, కాయలు రాలిపడ్డాయి. ముఖ్యంగా మోతె, వెల్దుర్తిలో అధికంగా పంట నష్టం జరిగింది.

ధర్మపురి మండలంలో 300ఎకరాల్లో నష్టం
ధర్మపురి మండలంలో దాదాపు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రాయపట్నం, బూరుగుపల్లి, తిమ్మాపూర్‌తో పాటు బుగ్గారం మండలం మద్దునూర్, సిరికొండలో వరి, దోస, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. రాయపట్కం చౌరస్తా వద్ద హోటళ్ల కోసం వేసిన తాత్కాలిక షెడ్లు కూలిపోయాయి. రాయపట్నం, బూరుగుపల్లి మధ్యలో జాతీయ రహదారిపై వృక్షాలు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సీఐ లక్ష్మీబాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీకాంత్ చెట్లను తొలగింపజేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరింపజేశారు.

బుగ్గారంలో మామిడికి తీవ్ర నష్టం
బుగ్గారం మండలంలో మామిడి తోటలు తీవ్రం గా ధ్వంసమయ్యాయి. మద్దునూర్, సిరికొండ, యశ్వంతరావుపేట, గంగాపూర్, వెల్గొండ, శెకళ్లలో భారీగా వడగండ్లు పడడంతో మామిడి తోటల్లో కాయలు పెద్దసంఖ్యలో రాలిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. వెల్గొండలో ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. వెల్గటూరు మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఎలాంటి నష్టం వాటిల్లక పోవడంతో మండలవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

గొల్లపల్లిలో బీభత్సం..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతి కందుతాయను కున్న సమయంలో వడగండ్ల పాలు కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి, శంకర్రావుపేట, మల్లన్నపేట, రాపల్లి, బీబీరాజ్‌పల్లి, వెంగళాపూర్, నందిపల్లి, గొల్లపల్లిలో సాయంత్రం అరగంట సేపు వేగంగా వీచిన ఈదురు గాలకు, వడగండ్లకు మామిడి కాయలు నేలరాలాయి. సుమారుగా 500 ఎకరాల్లో మామిడి తోటలు, 200 ఎకరాల్లో నువ్వు పంట, 200 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఉద్యాన, వ్యవసాయాధికారులు తెలిపారు. రాపల్లి, మల్లన్నపేట, శంకర్రావుపేటలో రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. రాపల్లిలో పర్షనపల్లి మణెమ్మ, పర్షనపల్లి శంకరయ్య, మానుక పెద్దిరాజం, బొల్లి ఎల్లవ్వ, అలిశెట్టి మహేశ్, గాజెంగి లచ్చవ్వ (గుడిసె), గాజెంగి నర్సయ్య, అలిశెట్టి చంద్రయ్య, మతులాపురం చిన్న గంగన్నకు చెందిన రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సంభాలు విరిగి అంధకారం అలుముకున్నది.

కథలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో ..
కథలాపూర్ మండలం ఇప్పపెల్లి, పోతారం, తాం డ్య్రాలలో వడగళ్ల వర్షం కురిసింది. అంబారిపేట, కలికోట, చింతకుంట, భూషణరావుపేటలో తేలికపాటి వర్షం పడింది. వడగళ్లలో నువ్వులు, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతలు తెలిపారు.

నష్టం అంచనావేయండి : మంత్రి కొప్పుల
ధర్మపురి నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వానతో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనావేయాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల అధికారులను హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ఆదేశించారు. ముందుగా ఈదురు గాలులకు విరిగిపడిన విద్యుత్ స్తంభాలను పుణరుద్ధరించాలన్నారు. రైతులు అధైర్య పడవద్దనీ, నష్ట పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

70
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles