నేడే డ్రాఫ్ట్ నోటిఫికేషన్


Wed,February 20, 2019 01:32 AM

-ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు ప్రతిపాదనలు రెడీ
-మండల కేంద్రాల్లో విడుదల
-22 దాకా అభ్యంతరాల స్వీకరణ
-23, 24 తేదీల్లో పరిష్కారం
-25న తుది జాబితా
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలకు సంబంధించి నేడు డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ కానున్నది. అన్ని మండలాల్లో ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేసిన ఎంపీడీవోలు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. మండల కేంద్రాల్లో ముందుగా ప్రకటించి, సదరు వివరాలను ప్రతి పంచాయతీ పరిధిలో అందుబాటులో ఉంచుతారు. సదరు ప్రతిపాదనలపై నేటి నుంచి 22 దాకా అభ్యంతరాలను ఎంపీడీవోలు నేరుగా స్వీకరిస్తారు.


సిద్ధమైన ప్రతిపాదనలు..
ఎంపీటీసీ స్థానాల గుర్తింపు ప్రక్రియపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడిజిల్లా ఎంపీడీవోలకు సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మంగళవారం ఉదయమే రంగంలోకి దిగారు. రాత్రి వరకు కసరత్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాలపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. నిర్ధారిత మండల జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రతి 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ చొప్పున ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే కొన్ని మండలాల పరిధిలో ప్రతి ఎంపీటీసీ స్థానం పరిధిలో 3,500 జనాభా రాకపోవడంతో కొంచెం అటూ ఇటు సర్దుబాటు చేసి ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలుస్తున్నది.

నేటి నుంచే అభ్యంతరాల స్వీకరణ..
ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తయారు చేసిన ప్రతిపాదనల విషయంలో బుధవారం అధికారికంగా డ్రాప్టు నోటిఫికేషన్ విడుదల కానున్నది. ప్రతి ఎంపీడీవో ముందుగా వారి వారి మండల కేంద్రంలో డ్రాఫ్టు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ తదుపరి వాటిని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అందుబాటులో ఉంచుతారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో గుర్తించిన ఎంపీటీసీ స్థానాలతోపాటు ఆయా ఎంటీసీ స్థానాల పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయో? వాటి వివరాలతోసహా గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుతారు. సదరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఎవైనా అభ్యంతరాలుంటే బుధవారం నుంచే ఎంపీడీవోలకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈ నెల 22వరకు స్వీకరిస్తారు. 23, 24 తేదీల్లో పరిష్కరించి, తుది జాబితాను 25న సాయంత్రం ప్రకటిస్తారు.

సర్వత్రా ఉత్కంఠ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలపై ఉత్కంఠ నెలకొన్నది. సర్పంచ్ పదవులకు కలసి రాని చాలా మంది ఔత్సహిక నాయకులు ఎంపీటీసీలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కో ఎంపీటీసీ స్థానంకు 3,500ల జనాభా ఉండాలన్న నిబంధన మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్న నేపథ్యంలో ఏ గ్రామాలు ఏ ఎంపీటీసీ పరిధిలోకి వెలుతున్నాయో? అన్న టెన్షన్ కనిపిస్తున్నది. తమకు అనుకూలమైన గ్రామాలన్నీ ఒకే ఎంపీటీసీ పరిధిలోకి వస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. అలా అయితే రిజర్వేషన్ కలిసి వస్తే గెలుపు సునాయసం అవుతుందని ఆశపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా పక్కా నిబంధలన ప్రకారం ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ప్రతిపాదనల విషయంలో వచ్చే ఫిర్యాదుల్లో సహేతుకమైన కారణాలు ఉంటే మాత్రమే మార్పులు చేర్పులుండే అవకాశమున్నది. లేదా ఎంపీడీవోలు విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా తుది జాబితా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles