ప్రాణం తీసిన గట్టు తగాదా

Sun,January 20, 2019 12:40 AM

-పట్ట పగలే గొడ్డలితో నరికి హత్య
రాయికల్ : పొలం సరిహద్దు గట్టు వివాదం ఒక వ్యక్తిని పొట్టనబెట్టుకున్నది. భూ వివాదంలో తమ మాట వినడం లేదని అన్నపైనే కక్ష పెంచుకొని తమ్ముడి కు టుంబం విచక్షణా రహితంగా కత్తులు, గొడ్డలితో దాడి చేయగా అన్నకొడుకు మృతిచెందిన ఘటన శనివారం జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. రాయికల్ మండలం కుర్మపల్లెలో పట్టపగలే జరిగిన ఈ ఉదంతం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. పోలీసులు, కటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కుర్మపల్లెకు చెందిన పూల పోచాలు, లస్మయ్య అన్నదమ్ములు. వీరి మధ్య కొంత కాలంగా పొలం విషయంలో వివాదం నడుస్తున్నది. వారం క్రితం రాయికల్ ఠాణాలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా ఎస్ కరుణాకర్ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సయోధ్య కుదిర్చాడు. కానీ తన మాట వినడం లేదని అన్నపై తమ్ముడు కోపం పెంచుకొని ఎలాగైనా అంతమొందిచాలని ప్రణాళిక రచించుకొని సమయం కోసం చూశాడు.

శనివారం ఉదయం ఇద్దరూ పొలం విషయంలో మరోసారి గొడవ పడ్డారు. తర్వాత పోచాలు తన కొడుకు గంగమల్లయ్యతో కలిసి పనుల కోసం పొలం వద్దకు వెళ్లాడు. అవకాశం కోసం చూస్తున్న లస్మయ్య తన భార్య మల్లవ్వ, కొడుకు మహేశ్ కలిసి ముగ్గురూ గొడ్డలి, కత్తులు, రాడ్లతో పొలం వద్దకు వెళ్లి పోచాలు, గంగమల్లయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. బాధితుల ఆర్తనాదాలు విని చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న వీరిని చూసి వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. 108లో జగిత్యాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే గంగమల్లయ్య (35) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన పోచాలు జగిత్యాల దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. జగిత్యాల రూరల్ సీఐ రాజేశం దవాఖానకు చేరుకొని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. గంగమల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు ఎస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles