పల్లెలనూ పచ్చగ మారుస్తాం

Mon,November 19, 2018 01:15 AM

-కాలువలు పారించి సస్యశ్యామలం చేస్తాం
-వచ్చే ఖరీఫ్ నాటికి ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పూర్తి
-ప్రజల నమ్మకం కేసీఆర్ పైనే
-అభివృద్ధికే పట్టంగట్టాలె
-కాంగ్రెస్, బీజేపీలవి దొంగమాటలు
-జనాలు కూటమిని ఈసడించుకుంటున్నరు
-ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
-కాంగ్రెస్, టీడీపీ పొత్తు హీనాతిహీనం
-కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
-ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి
-మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి
-మెట్‌పల్లి పట్టణంలో కల్వకుంట్లకు ప్రజా ఆశీర్వాద సభ

జగిత్యాల ప్రతినిధి/ మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/ మెట్‌పల్లిటౌన్ : ఎస్సారెస్పీ రివర్స్‌పంపింగ్‌ను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ప్రతి పల్లెనూ పచ్చగా మారుస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ కోరుట్ల అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌వు ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత పాలకులు ఎన్నికలను అధికారం కోసం వాడుకున్నారనీ, టీఆర్‌ఎస్ మాత్రం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో అప్పటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు రాజకీయ నిరుద్యోగులు ఉద్యమాన్ని మొదలుపెట్టారని ఎద్దేవా చేశారనీ, వారి ఎగతాళికి టీఆర్‌ఎస్ కుంగిపోలేదనీ, బరిగీసి తెలంగాణ కోసం పోరాటం సాగించిందని గుర్తుచేశారు. గతంలో ఎగతాళి చేసిన పార్టీలు ఇప్పుడు అన్నీ కలిసి కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేక సోషల్ మీడియాను ఆధారం చేసుకొని కుట్రలకు తెరతీస్తున్నాయన్నారు.

వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశానని, అప్పుడు ఆంధ్రాలో కాలు అడ్డం పెడితే నీళ్లు వచ్చే పరిస్థితి ఉందనీ, తెలంగాణలో మాత్రం, బావులపై మా త్రమే ఆధారపడి వ్యవసాయం సాగేదని గుర్తు చేశారు. ఆరుగంటల విద్యుత్ సరిపోదు.. పన్నెండు గంటలైనా ఇవ్వాలని కోరితే నాటి పాలకులు ఎగతాళి చేశారే తప్ప, ఏనాడూ కనీసం 9గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఒకప్పుడు అర్ధరాత్రి అలారం మోగితే రైతులు, పొలం వద్దకు వెళ్లేదనీ, ఆ సమయంలో తల్లులు, భార్యలు జాగ్రత్తలు చెప్పి రైతులను పొలాలకు పంపేవారనీ, కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ పల్లెల్లో అర్ధరాత్రి మగమనిషి ఇం ట్లో లేని దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. నేడు విద్యుత్ కోసం అధికారులను వేడుకోవడమో, కార్యాలయాల్లో బంధించడమో చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలది తమది కాకపోతే ఢిల్లీ దాకా దేకుమనే తత్వమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆటో నడుపుతూ జీవించే వారికి ఆటో ట్యాక్స్ రద్దు చేశామ నీ, రైతుల కోసం ట్రాక్టర్ ట్యాక్స్ సైతం రద్దు చేశామని చెప్పారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేరిన కేసీఆర్ కరీంనగర్ ప్రజలందరి కీ తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో మెట్‌పల్లి సమీపంలోని డబ్బా వద్ద వాట ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించేందుకు, నీటిని అందించేందుకు రూ.340 కోట్లు మంజూరు చేయించారని గుర్తుచేశారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం 10 శాతం కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని నిర్దేశించిందన్నారు. ఆనాడు సీఎంగా ఉన్న వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి పదిశాతం కాంట్రిబ్యూషన్ అయిన రూ.34కోట్లు కూడా చెల్లించలేదని దీంతో ఆ పథకం మూలన పడిందన్నారు. తెలంగాణ సాధన తర్వాత ఎల్‌ఎండీ నుంచి ఎలాగైతే సిద్దిపేటకు ప్రత్యేక పైప్‌లై న్ ద్వారా తాగునీరు అందిస్తున్నామో, అలాగే రాష్ట్రమంతా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్దేశించుకున్నారనీ, అందులోంచి పుట్టిందే మిషన్ భగీరథ పథకమని చె ప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో బయటకు రావద్దన్నదే కేసీఆర్ ధ్యేయమన్నారు.

త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ తాగునీరందుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పింఛన్లను ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.వెయ్యి, వికలాంగులకు రూ. 1500 పెంచి ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ఉన్నత చదువులు చదివి న మేధావులున్నారనీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అమెరికాకు బతుకుదెరువు కోసం వెళ్తున్నారని, అమెరికాలో మనవాళ్లకు గేట్లు మూసేశారనీ, విద్యార్థుల కో సం బీజేపీ ప్రభుత్వం అమెరికాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ఎవరికైనా ఇబ్బందేననీ, ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక భరోసా ఇచ్చి, పోటీ పరీక్షలకు తయారయ్యేందుకు వీలుగా, నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.

ఉద్యమ సమయంలో తండాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న నగదు కాలిపోయిన సంఘటనలు చూశామనీ, దానికి చలించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారం కోసం, ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదనీ, ప్రజల బతుకులను తరిచి చూసే మానవతావాద పార్టీ అన్నారు. రైతులతో పాటు, రైతు కూలీలకు, ట్యాక్సీ డ్రైవర్లకు, గీత కార్మికులకు, ఇతర అన్ని కుల వృత్తుల వారికి ప్రభుత్వం తరుఫునే బీమా చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామనీ, త్వరలోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం సాగునీరేననీ, ప్రతి ఎకరా భూమికి నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌లోగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని పూర్తిచేసి, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. రోజూ ప్రజలతో మమేకమై ఉండే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించి, టీఆర్‌ఎస్‌కు అండగ నిలవాలనీ, అభివృద్ధికే పట్టంగట్టాలని పిలుపునిచ్చారు.

అది మాయా కూటమి : కల్వకుంట్ల
నాడు తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలు కుమ్మక్కై మహాకూటమి పేరిట మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నాయనీ, దిక్కు, సక్కి లేని ఈ కూటమి ఒక మాయా కూటమి అని టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆ నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో జతకట్టాడనీ, కాంగ్రెస్, టీడీపీ పొత్తు హీనాతిహీనమని ధ్వజమెత్తారు. పొరపాటున మహాకూటమికి అవకాశమిస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందనీ, కూటమి అధికారంలోకొస్తే 12 మంది ముఖ్యమంత్రులు తయారవుతారనీ, అలాంటి పరిస్థితి రాకుండా ఉండేం దుకు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరమందన్నారు. అడగకపోయినా వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అనీ, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎంగా ప్రశంసలందుకుంటున్నారని కొనియాడారు. మరోసారి తనను ఆశీర్వదించి అవకాశమిస్తే అభివృద్ధిలో కోరుట్లను అగ్రభాగంలో నిలుపుతానని పేర్కొన్నారు.

కేసీఆర్ రైతు పక్షపాతి : లోక బాపురెడ్డి
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రైతు పక్షపాతిలా నిలిచారని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి అన్నారు. ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరించి టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని చెబుతున్నారనీ, అందుకు నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణమన్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడే దుస్థితి ఉండేదనీ, తెలంగాణ వచ్చాక ఎరువులు, విత్తనాలు రైతుల ముంగిటకే వస్తున్నాయన్నారు. పంట పండించుకోవడం ఎంత కష్టమో పంట అమ్ముకోవడం అంత కష్టంగా ఉంటుందని, రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ గ్రామ, గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించారన్నారు. గతంలో ప్రభుత్వాలు పప్పు ధాన్యాలను కొనుగోలు చేసిన పాపాన పోలేదనీ, టీఆర్‌ఎస్ పాలనలో వరి, మక్కలే కాకుండా పప్పు ధాన్యాలను కూడా కొనుగోలు చేసిందని చెప్పారు.

మరెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు కావాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ అధ్యక్షులు శీలం వేణు, మర్రి ఉమారాణి, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ చీటి వెంకట్రావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆకుల లింగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్క సురేశ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బైర మల్లేశ్‌యాదవ్, ముదిరాజ్ సంఘం నాయకులు నేమూరి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేశ్‌యాదవ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, లింగంపల్లి సంజీవ్, మర్రి సహదేవ్, కేసుల సురేందర్, పూదరి నర్సాగౌడ్, మహాజన్ నర్సింలు, ప్రభాకర్, డాక్టర్ సత్యనారాయణ, ముదాం నర్సింలు, ఏలాల దశరథరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ఎండీ జావిద్, రాచమల్ల సురేశ్, దారిశెట్టి రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles