మృతుల్లో పెద్దలే అధికం


Wed,September 12, 2018 03:12 AM

-50ఏళ్లు పైబడిన 30మంది మృత్యువాత
-45ఏళ్ల పైవయసు ఉన్న వారు ఆరుగురు
- చనిపోయిన వారిలో వ్యవసాయం చేసే వారే ఎక్కువ
- రైతుబంధు వర్తింపుపై అధికారుల దృష్టి
- వివరాల సేకరణలో వ్యవసాయ శాఖ
జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కొండగట్టు దుర్ఘటనలో మృతిచెందిన వారిలో 50 సంవత్సరాలకు పై బడిన వారే అధికంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బస్సు దుర్ఘటనలో కొడిమ్యాల మండలంలోని నాలుగైదు గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో మృతువాత పడ్డారు. మృతిచెందిన వారి వివరాలు, వయసుకు సంబంధించిన జాబితా రాత్రి వరకు అందలేదు. రాత్రి పదిగంటల సమయంలో కలెక్టర్‌తో పాటు, మల్యాల పోలీస్ అధికారులు మృతుల వివరాలు, వారి వయస్సు, వృత్తి వివరాలను విడుదల చేశారు. జాబితాను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర వివరాలు కనిపించాయి. వంద మంది ప్రయాణికులు (డ్రైవర్, కండక్టర్‌తో సహా) ఉండగా, అందులో చాలా మంది 50సంవత్సరాల వయసు పైబడిన వారు ఉన్నారు. 58 మంది మృతుల్లోనూ మహిళలు, ఎక్కువ వయసు ఉన్న వారే అధికంగా ఉన్నారు. చాలా మంది వ్యవసాయం చేసుకునే రైతులే ఉన్నట్లు మృతుల బంధువులు, గ్రామస్తులు తెలియజేశారు. మృతుల్లో 50 సంవత్సరాల పైబడిన వారు 30మంది ఉండగా, 45 సంవత్సరాలకు పై బడిన వారు ఆరుగురు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

35సంవత్సరాల లోపు వయస్సున వారు 11 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళల సంఖ్య ఉండడం గమనార్హం. చాలా మంది శరీరాలపై పెద్దగా దెబ్బలు కనిపించలేదు. కేవలం ఊపిరి ఆడకపోవడం వల్లే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని, మహిళలు అధికంగా భయానికి లోనై ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ వయస్సులో ఉన్న వారు దెబ్బలకు తట్టుకోలేకపోయారని చెబుతున్నారు. మృతుల్లో చాలా మంది వ్యవసాయం చేసుకునే రైతులేనని మృతుల కుటుంబీకులు, వారి గ్రామాలకు చెందిన వారు చెబుతున్నారు. కాగా రైతులు అధిక సంఖ్యలో చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవలి నుంచే అమలు చేస్తున్న రైతుబీమాను వర్తింపజేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.

మృతుల్లో ఎంత మంది రైతులు ఉన్నారు?, అందులో ఎందరికి రైతు బీమా వర్తించే అవకాశం ఉంది అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. కాగా జిల్లా కలెక్టర్ శరత్ సైతం వ్యవసాయ శాఖ అధికారులకు మృతుల్లో ఎంత మందికి బీమా వర్తింపజేయవచ్చునన్న విషయాన్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ అధికారులు మృతుల్లో రైతుల వివరాలు సేకరణ పనిలో పడినట్లు తెలిసింది.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...