ఆయకట్టుకు ఆయువుపట్ట

Mon,September 10, 2018 12:19 AM

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చెరువు కట్ట.. పచ్చని చెట్టు ఉన్న చోటే మానవ సమూహాభివృద్ధి సాధ్యం.. ఇది అనాదిగా అందరికీ తెలిసిన సత్యం. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ పాలకులైన కాకతీయులు, రెడ్డి రాజులు విరివిగా చెరువుల నిర్మాణాలు చేపట్టారు. కాకతీయులైతే ఏకంగా సప్త సంతానంలో చెరువు నిర్మాణాన్నీ ఒకటిగా గుర్తించారు. చెరువు నిర్మించిన రాజు, సంతానాన్ని పొందినట్లు భావించేవారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. అనంతరం ఇక్కడి ప్రజల జీవనశైలిలో చెరువుతో విడదీయరాని బంధం ఏర్పడింది. కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. సీమాంధ్రుల పాలనలో పాలకుల పట్టింపులేని తనం కారణంగా చెరువుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. వేలాది చెరువులు ఉనికి కోల్పోయాయి. సేద్య రంగానికి జీవనాధారమైన చెరువులు కాస్తా వట్టిపోయాయి. 60ఏళ్ల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పల్లెలకు ప్రాణాధారమైన చెరువులకు తిరిగి జీవకళ రప్పించాలని నిర్ణయించి, మిషన్ కాకతీయ పేరిట పథకాన్ని చేపట్టారు. ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మిషన్ కాకతీయ పథకం క్రమంగా ఫలితాలు ఇస్తున్నది. మొన్నటి వరకు తూములు మూసుకుపోయి, మత్తడి ఆనవాళ్లు కానరాక, పూడిక నిండిన మట్టితో తాంబాలంలా మారిన చెరువులు, ఇప్పుడు జలకళను సంతరించుకొని, నిండుకుండల్లా నీరు నింపిన గంగాళాల్లా కనిపిస్తున్నాయి. బీడుభూముల్లా కనిపించిన చెరువులు నేడు సేద్యానికి ప్రాణం పోసేలా మారాయి.

715 చెరువుల మరమ్మతు
జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద 715 చెరువుల మరమ్మతులు చేపట్టారు. జిల్లాలో వేలాది చెరువులు ఉండగా, పాలకుల నిర్లక్ష్యం మూలంగా అనేకం అంతర్థానమయ్యాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం నీటిని నింపేందుకు అవకాశమున్న వాటిని గుర్తించారు. మొత్తంగా జిల్లాలో 1226 చెరువులు, కుంటలున్నట్లు ప్రకటించారు. వీటిలో 14 చెరువులు 500 ఎకరాలకు పైగా ఆయకట్టును కలిగి ఉన్నవిగా వెల్లడించారు. మిగిలిన చెరువులు తక్కువ సామర్థ్యం కలిగినవిగా పేర్కొన్నారు. మొత్తంగా జిల్లాలో 83వేల ఎకరాల ఆయకట్టును ఈ చెరువులు కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ, కొన్నేళ్లుగా ఈ చెరువుల్లో నీరు నిండక, వట్టిపోవడంతో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాలుగు విడుతలో 715 చెరువులను ఎంపిక చేసి దాదాపు రూ. 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పునరుద్ధరణ చేపట్టారు.90 శాతం చెరువుల అభివృద్ధి పూర్తిగా కాగా మిగిలిన చెరువుల మరమ్మతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మత్తడి దుంకిన 504 చెరువులు
మిషన్ కాకతీయ పథకం కింద జీవం పోసుకున్న చెరువులు జలవిన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. జిల్లాలో ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువులు మత్తడి దుంకాయి. నీటిపారుదల శాఖ డీఈ నారాయణరెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం జిల్లాలో 504 చెరువులు మత్తడి దుంకగా, 180 చెరువులు వంద శాతం నిండాయి. ఇక 195 చెరువుల్లోకి 75శాతం నీరు చేరింది. 181 చెరువుల్లోకి 50 శాతానికి పైగా, కేవలం 166 చెరువుల్లో మాత్రమే పాతిక శాతం సామర్థ్యం కంటే తక్కువ నీరు చేరింది. దశాబ్దకాలంగా చెరువుల్లోకి ఇంత స్థాయిలో నీరు రాలేదనీ, ఈ సారి ఊహించని విధంగా నీరు చేరిందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. కమాండ్ ఏరియాలోనూ, సాధారణ వర్షపాతం నమోదయ్యే మండలాల్లోని అన్ని చెరువులూ పొంగి పొర్లాయని పేర్కొన్నారు. రాయికల్ పెద్ద చెరువు, పెగడపల్లి మండలం లింగాపూర్ చెరువు, కొడిమ్యాల మండలం మహాసముద్రం, వెల్గటూర్ మండలం జంగల్‌నాలా ప్రాజెక్టు, స్తంభంపల్లి చెరువు, మోతె చెరువులు పెద్దవనీ, వీటి కింద దాదాపు 500 నుంచి ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉం టుందని ఈ చెరువులన్నీ మత్తడి దుంకాయని తెలియజేశారు. మోతె, లక్ష్మీపూర్, కండ్లపల్లి ఇలా అనేక చెరువులు నిండిపోయాయి. జిల్లాలోని వెయ్యికి పైగా చెరువులు ఈ సారి జలకళను సంతరించుకోవడంతో వానాకాలం పంటలకు ఇబ్బందులు ఉండవనీ, దాదాపు 60వేల ఎకరాలకు రెండు పంటలకూ నీరందే అవకాశం ఏర్పడిందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ సాగు చేస్తామనుకోలే
రాయికల్ పెద్దచెరువు మా పాలిట కల్పతరువు. గతంలో పాలకులు పట్టించుకోకపోవడంతో పూడిక నిండి నీటి నిలువ సామ ర్థ్యం తగ్గిపోయింది. ఎక్కువ నీరు వస్తే ఆపే సామర్థ్యం లేక కట్ట తెగిపోయే ప్రమాదముందని ఎత్తు కొంత తగ్గించాం. ఇక చెరువు నీటిపై ఆశలు వదులుకున్నాం. మళ్లీ ఈ చెరువు నీటితో సాగు చేసుకుంటామన్న నమ్మకం పోయింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుకు మరమ్మతులు చేస్తున్నప్పుడు కొంత ఆసక్తి కలిగినా చెరువు నీటితో మళ్లీ వ్యవసాయం చేస్తామా? అన్న అనుమానం కలిగింది. పోయిన నెలలో కురిసిన వర్షాలతో చెరువు నిండి, మత్తడి దుంకితే ఆశ్చర్యం కలిగింది. ఈ ఏడాది రెండు పంటలు ఖచ్చితంగా చెరువు కింద సాగవుతాయన్న ధీమా వచ్చింది.
- కల్లెడ ధర్మపురి, రాయికల్ పెద్ద చెరువు ఆయకట్టు రైతు

154
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles