-అంజనాద్రికి పోటెత్తిన భక్తులు
-సుమారు 60వేల మందిరాక
-ఆలయానికి రూ.10లక్షలకుపైగా ఆదాయం
-ఇబ్బందులుకలగకుండా అధికారుల ఏర్పాట్లు
కొండగట్టు (జగిత్యాల క్రైం) :కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం చివరి రోజు కావడంతో రాష్ట్ర నలుమూల పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, శ్రీరామ, హనుమన్నామ స్మరణతో మార్మోగింది. సుమారు 60వేల మంది భక్తులకు స్వామి వారిని దర్శించుకున్నారని, శనివారం ఒక్క రోజే ఆలయానికి రూ.10లక్షలకుపైగా ఆదాయం సమకూరిందని సిబ్బంది తెలిపారు. ఉదయం నుంచి భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి, అంజన్న దర్శనానికి బారులు తీరగా వాహనపూజల మూలమలుపు వరకు క్యూలైన్ విస్తరించింది. ప్రత్యేక దర్శనాల లైన్ సైతం ఆలయ వెనుక ద్వారం నుంచి భేతాళుడి ఆలయం వరకు కొనసాగింది. భక్తుల రద్దీ పెరుగడంతో ఆలయ అధికారులు వీఐపీ దర్శనాలు, అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాసశర్మ, ఆంజనేయులు, సిబ్బంది డి.సునీల్, కాసర్ల శ్రీనివాస్, జెమిని శ్రీనివాస్, రాజేందర్రెడ్డి, ధర్మేందర్ భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా, కొండకు భారీగా భక్తులు తరలిరావడంతో ఘాట్ రోడ్డుకు ఇరువైపులా, వై జంక్షన్ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్టాండ్ వద్ద, వసతిగృహాలు, ఖాళీ స్థలాల్లో భక్తులు వాహనాలు పార్కింగ్ చేయడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.