సభను విజయవంతం చేయాలి

Fri,September 7, 2018 02:42 AM

ఎల్కతుర్తి: ఎన్నికల శంఖారావంలో భాగంగా హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించే మొదటి ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కే ప్రజా దీవెనలు ఉన్నాయనీ, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సభ నేపథ్యంలో జన సమీకరణపై గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంపీ పర్యటించారు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎల్కతుర్తిలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం సైదాపూర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి, రాత్రి 7గంటల తర్వాత చిగురుమామిడి మండలం సుందరగిరికి చేరుకున్నారు. సుందరిగిరిలో కులసంఘాల యువకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. పోరాడి, ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చి, అద్భుతంగా అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్ పార్టీనేనని స్పష్టంచేశారు. నాలుగేళ్ల మూడు నెలల టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన పార్టీకే ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణను మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నాయా? అని ప్రశ్నించారు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది.. 1969 ఉద్యమంలో 369మందిని కాల్చి చంపింది.. కాంగ్రెస్ పార్టీ కాదా? అని అడిగారు. తెలంగాణను ఇచ్చినట్టు ఇచ్చే లాక్కున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. ఆ పార్టీ వల్లే అనేకమంది తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన చెందారు.

సొంతంగా రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోలేని పార్టీలు కాంగ్రెస్, బీజేపీలేననీ, ఢిల్లీ పెద్దల ఆదేశానుసారమే నడుస్తాయని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కరెంట్ కష్టాలు వస్తాయని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాడనీ, మరి ఇప్పుడు కరెంట్ కష్టాలున్నాయా? అని అడిగారు. రైతులు కరెంట్ కోసం ఎదురుచూడకుండా 24 గంటలపాటు కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. అనేక సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఏకైక ఘనత టీఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. హుస్నాబాద్ సభకు భారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎల్కతుర్తిలో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎల్తూరి స్వామి, వేముల శ్రీనివాస్, వెంకటేశ్‌యాదవ్.. సైదాపూర్‌లో జడ్పీ సభ్యుడు బిల్ల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వావిలాల ఖాదీబోర్డు డైరెక్టర్ పేరాల గోపాలరావు, ఎంపీటీసీలఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్, నాయకులు చంద శ్రీనివాస్, కొండ గణేష్, పైడిపల్లి రవీందర్, బొమ్మగాని రాజు, నీర్ల సతీశ్, పూసాల అశోక్.. చిగురుమామిడిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మండలాధ్యక్షుడు కృష్ణమాచారి పాల్గొన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles